ఫుల్ టైం పనోళ్లకు నెలకు రూ.9వేలు?

Update: 2015-08-17 07:14 GMT
ఇప్పటివరకూ పనిమనుషుల పనికి సంబంధించి చట్టబద్ధమైన నిబంధనలు అంటూ లేవు. పని చేసే వాడికి.. చేయించుకునే వారికి మధ్య ఉన్న అవగాహనతో బండి నడిచిపోయింది. తాజాగా.. ఈ విధానం సమూలంగా మార్పులు చోటు చేసుకోనున్నాయా? అంటే అవుననే చెబుతున్నారు. పనిమనుషుల సామాజిక భద్రత గురించి జాతీయ స్థాయిలో సరికొత్త విధానాన్ని ప్రవేశ పెట్టాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది. ఈ విధానం కానీ అమల్లోకి వస్తే.. కనీస వేతనం కింద పనిమనుషులకు రూ.9వేలు ఇవ్వాల్సి ఉంటుంది.

ఒక్క జీతం మాత్రమే కాదు.. వారికి సంబంధించి వేతనంతో కూడిన సెలవులు.. ప్రసూతి సెలవులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఫుల్ టైం పనిమనుషుల విషయంలో కేంద్రం కానీ ప్రత్యేక చట్టం తయారు చేసిన పక్షంలో.. సంపన్నులకు మాత్రమే సౌలభ్యంగా ఉండటమే కాదు.. మధ్య.. ఎగువ మధ్యతరగతి వారికి పనిమనుషుల సేవలు అందే అవకాశం ఉండదు.

ఈ కారణంతో సేవలు పొందే వారు మాత్రమే కాదు.. సేవలు అందించే వారికి ఇబ్బందులు ఎదురుకావటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పనిమనుషులు సంఘాలుగా ఏర్పడటం.. కార్మిక సంక్షేమ విభాగం అధికారుల రంగ ప్రవేశంతో కొత్త చిక్కులు ఎదురవుతాయని కొందరు వాదిస్తుంటే.. ఈ చట్టాలు కానీ అమల్లోకి వస్తే శ్రమ దోపిడీ కి అడ్డుకట్ట పడుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఫుల్ టైం పనిమనుషులకు సంబంధించి కేంద్రం రూపొందించే చట్టంతో ఎందరికి ఎంత ప్రయోజనం కలుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి.
Tags:    

Similar News