క‌ల్తీ చేస్తే.. యావ‌జ్జీవ కారాగార శిక్ష‌!

Update: 2018-06-26 05:10 GMT
ప‌సిపిల్ల‌లు తాగే పాలు మొద‌లు తినే తండి వ‌ర‌కూ అది.. ఇది అన్న తేడా లేకుండా అన్నింట్లోనూ క‌ల్తీ.. క‌ల్తీ. ఈ క‌ల్తీ వ‌స్తువుల లెక్క చూస్తే.. భ‌యంతో ఏమీ తిన‌లేని ప‌రిస్థితి. ఇలాంటి క‌ల్తీల‌పై భారీగా కొర‌డా విద‌ల్చాల‌ని కేంద్రం ఆలోచిస్తోంది.

ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని దెబ్బ తీసేలా ఆహార క‌ల్తీకి పాల్ప‌డితే క‌ఠిన శిక్ష‌ల దిశ‌గా చ‌ట్టాన్ని రూపొందించే దిశ‌గా కేంద్రం అడుగులు వేస్తోంది. క‌ల్తీ ఆహారాన్ని త‌యారు చేసినా.. వాటిని అమ్మినా ఏడేళ్ల నుంచి యావ‌జ్జీవ కారాగార శిక్ష త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. కేసు తీవ్ర‌త‌కు త‌గ్గ‌ట్లుగా శిక్ష‌లు.. జ‌రిమానాలు కోర్టులు డిసైడ్ చేస్తాయంటున్నారు.

ఇందుకు త‌గ్గ‌ట్లుగా చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయాల‌ని కేంద్ర స‌ర్కారు భావిస్తోంది. వ్య‌క్తులు.. వ్యాపార సంస్థ‌లు ఉద్దేశ‌పూర్వ‌కంగా ఆహార ఉత్ప‌త్తుల్ని క‌ల్తీ చూస్తే క‌నీసం ఏడేళ్లు జైలు శిక్ష విధించాల‌ని.. అవ‌స‌ర‌మైతే యావ‌జ్జీవ కారాగార‌శిక్ష సైతం వేయాల‌న్న వాద‌న‌కు కేంద్రం సానుకూలంగా స్పందిస్తోంది.

క‌ల్తీ తీవ్ర‌స్థాయిలో జ‌రిగితే కంపెనీకి తాళం వేయ‌టంతో పాటు.. వాటి యాజ‌మాన్యంపై భారీ ఎత్తున చ‌ర్య‌లు తీసుకునే దిశ‌గా ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేస్తున్నారు.  దీనికి సంబంధించి ఆహార భ‌ద్ర‌త‌.. ప్ర‌మాణాల సంస్థ అయిన ఎఫ్ ఎస్ ఎస్ ఏఐ కీల‌క సిఫార్సులు చేసింది. అంతేకాదు.. ఆహార క‌ల్తీ గురించి వ్యాపార‌స్తుల్లోనూ.. వినియోగ‌దారుల్లోనూ అవ‌గాహ‌న క‌ల్పించ‌టానికి ప్ర‌త్యేక నిధిని ఏర్పాటు చేయాల‌ని కూడా పేర్కొంది.

నిరంత‌ర ప్ర‌క్రియ మాదిరి ఆహార‌కల్తీ మీద అవ‌గాహ‌న పెంచితే త‌ప్పించి దేశం నుంచి క‌ల్తీని త‌రిమి కొట్ట‌లేమ‌ని చెబుతున్నారు. త‌మ ప్ర‌తిపాద‌న‌ల్ని ప‌లు రాష్ట్రాల‌కు ఎఫ్‌ ఎ‌స్‌ ఎ‌స్‌ ఏఐ పంపింది. దీనిపై ఆయా రాష్ట్రాలు ఎంత త్వ‌ర‌గా ఆమోద ముద్ర వేసి తిరిగి పంపితే.. ఈ వ‌ర్షాకాల స‌మావేశాల్లో దీనిపై చ‌ర్చ జ‌రిగి.. చ‌ట్ట‌రూపంలో మారే అవ‌కాశం ఉంది. మ‌రి.. రాష్ట్రాలు ఎంత‌లా రియాక్ట్ అవుతాయో చూడాలి.
Tags:    

Similar News