ఒక్క దీప కోసం ఎన్ని పార్టీలో..

Update: 2017-01-17 05:12 GMT
అమ్మ జయలలిత మేనకోడలు దీప వ్యవహారం తమిళనాడులో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమ్మ లేని వేళ.. అన్నాడీఎంకే పగ్గాల్ని శశికళ చేపట్టటాన్ని కొందరు అన్నాడీఎంకే నేతలు.. కార్యకర్తలు.. అభిమానులు అస్సలు ఇష్టపడటం లేదు. అదే సమయంలో అన్నాడీఎంకేను వదిలిపెట్టలేకపోతున్నారు. తమకు ఎదురైన చిత్రమైన పరిస్థితిని అధిగమించటానికి వారికి దొరికిన మార్గం దీపగా చెప్పాలి.

అమ్మ మరణంతో ఏర్పడిన చిత్రమైన పరిస్థితుల్ని ఓకే చెప్పలేక.. అలా అని ఎదిరించలేక వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఇబ్బందిని అధిగమించటానికి వారు కొత్త మార్గాన్ని ఎన్నుకున్నారు. ఆ మార్గమే అమ్మ మేనకోడలు దీప. అమ్మ వారసత్వం ఆమెదేనని నమ్మేవారు.. శశికళను ఇష్టపడని వారికి దీప ఒక వేదికగా మారారు.

కొత్త ముఖాన్ని చూసేందుకు ఆ మాత్రం హడావుడి ఉంటుందంటూ.. దీప ఇంటి ముందు చేరిన జనాల్ని చూసినోళ్లంతా కామెంట్ చేశారు. అమ్మ మరణించిన ఇన్ని రోజుల తర్వాత కూడా దీప ఇంటి దగ్గర ఆమెను చూసేందుకు వచ్చే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అమ్మ వారసురాలి ఆమేనని అంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. దీప పేరిట పలువురు ఉత్సాహవంతులు ఏకంగా పార్టీలు పెట్టేస్తున్నారు. ఇప్పటికే అలాంటి పార్టీలు కొన్ని పుట్టుకొచ్చేశాయి.

తన రాజకీయ రంగ ప్రవేశం పక్కా అని తేల్చేసిన దీప.. ఈ రోజు ఆమె తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. మరి.. ఆమె రాజకీయ ప్రకటన ఎలా ఉండనుంది? ఆమె పేరిట పెట్టిన పార్టీ వేదికల మాటేమిటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గడిచిన కొద్ది రోజుల్లో దీపను తమ నాయకురాలిగా.. ఆమెను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ పార్టీలు పెట్టిన వారందరిని దీప ఒక గూటికి చేరుస్తారా? అన్నది మరో ఆసక్తికర ప్రశ్నగా మారిందని చెప్పాలి.

దీపను అభిమానించే వారు ఇప్పటివరకూ పెట్టిన పార్టీల్ని చూస్తే.. ‘‘జయలలిత ఎంజీఆర్ అన్నాడీఎంకే’..అభిల భారత అమ్మ ద్రవిడ మున్నేట కళగం (ఏఐఏడీఎంకే).. ‘అమ్మ మక్కల్ మున్రేట్ర సంఘం’.. పేరిట పార్టీల్ని ఏర్పాటు చేశారు. మరి.. దీప ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? ఇప్పటికేపెట్టిన పార్టీలు కాదని కొత్త పార్టీ పెడతారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం మరికొద్ది గంటల్లోనే లభించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News