హుజూరాబాద్‌లో కొత్త రాజకీయం.. తెర తీసిందెవరంటే!

Update: 2021-10-10 03:32 GMT
రాజకీయాల్లో ఆధిపత్య పోరు సహజం. రాజకీయ చతురత ప్రదర్శించి ఆధిపత్యపోరులో పై చేయి సాధించడమే రాజకీయ ముఖ్య లక్ష్యం. సమయస్పూర్తితో పాటు సకాలంలో అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం.. దాన్ని సాధించుకోవడంలో ప్రత్యర్థిని రాజకీయంగా ఇరుకున పెట్టడం తప్పనిసరి వ్యూహంగా ఉంటుంది. ఇక రాజకీయ పార్టీలు ప్రత్యర్థిని దెబ్బతీయడానికి ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని ఎత్తులు వేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ ఎత్తులు ప్రత్యర్థివర్గానికి అంతుచిక్కుకుండా కూడా ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తూ..  ప్రత్యర్థిని దెబ్బతీస్తుంటారు. ఇదే కోవలో హుజురాబాద్ ఉప ఎన్నికలో పన్నాగాలు అమలు చేస్తున్నారు. ఈ పన్నాగాలను ప్రత్యర్థులు ముందగానే పసిగట్టి.. విరుగుడు వ్యూహాన్ని అమలు చేస్తారో? లేక ఉచ్చులో చిక్కుకుంటారో చూడాలి.

హుజురాబాద్ ఉప ఎన్నికలో వ్యూహాలు అంతుచిక్కకుండా ఉన్నాయి. ఓటర్లను అయోమయానికి గురి చేసేందుకు రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. క్రాస్ ఓటింగ్‌పై కొన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ఓటర్లను గందరగోళానికి గురిచేస్తూ క్రాస్ ఓటింగ్ జరిగేలా పార్టీలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేరులో ఉన్న వ్యక్తులు నామినేషన్ వేశారని ఆయన సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ఈసంపల్లి రాజేందర్‌ (న్యూ ఇండియా పార్టీ), ఇప్పలపల్లి రాజేందర్‌ (ఆల్‌ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ), ఇమ్మడి రాజేందర్‌ (రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా) నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్స్ వేసిన వారిలో ముగ్గురు సభ్యులు కూడా రాజేందర్ పేరుతో ఉండడతో పాటు ఇంటిపేరున వచ్చే ఇనిషియల్ కూడా 'ఈ'పేరుమీద ఉండడం గమనార్హం. దీని వల్ల ఓటర్లు అయోమయానికి గురి అయి క్రాస్‌ ఓటింగ్‌ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలువురు అంటున్నారు.

రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక ఖాయమని భావించిన.. అన్ని పార్టీలు రాజకీయ అస్త్రాలను సిద్ధంగా పెట్టుకున్నాయి. ఈటల రాజీనామా చేసిన వెంటనే ప్రచారానికి ఉపక్రమించాయి. రెండు నెలలుగా ప్రధాన పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్‌ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. టీఆర్ఎస్ కుల సమీకరణలను అంచనా వేసి గెల్లు శ్రీనివాస్‌ను బరిలోకి దింపింది. రెండు నెలలుగా ముగ్గురు మంత్రులు హుజురాబాద్‌లో మకాం వేశారు. నియోజకవర్గంలో హామీలు గుప్పించారు. కౌశిక్‌రెడ్డి, టీఆర్ఎస్‌లో చేర్చుకోవడం మొదలు..  బండా శ్రీనివాస్‌ను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించడం... వకుళాభరణం రామకృష్ణను బీసీ కమిషన్ చైర్మన్‌గా ఎంపిక చేయడం ఆ పరిణామాలన్నీ రోజుల వ్యవధిలోనే జరిగాయి. అనేక హామీలు, కులాల వారిగా ఓట్లను టీఆర్ఎస్ సమీకరిస్తోంది. ఇప్పటికే  గెల్లు శ్రీనివాస్‌ గ్రామగ్రామాన సభలు, సమావేశాలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు మంత్రి హరీశ్‌రావు తనదైన శైలిలో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.

ఈటల తన ప్రచారాన్ని పాదయాత్రతో మొదలుపెట్టారు. అనివార్య కారణాలతో పాదయాత్రను విరమించుకున్నా.. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ప్రచారంలో ఈటల మార్కును చూపిస్తున్నారు. ప్రధానం సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావును టార్గెట్ చేసుకుని ప్రచారం చేస్తున్నారు. హుజురాబాద్ ప్రచారంలో పాల్గొనేందుకు బీజేపీ స్టార్ క్యాపైనర్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో 20 మంది నేతలకు చోటు కల్పించారు. కాంగ్రెస్ అనేక కసరత్తులు చేసిన తర్వాత ఆలస్యంగా అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను ఎంపిక చేసింది. హుజురాబాద్ ఉప ఎన్నికను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం మండలాల వారిగా ఇన్‌ఛార్జీలను కూడా నియమించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో రాజకీయంగా ఎన్నడూ లేనంత హీట్‌ను పుట్టిస్తున్నాయి.  2023లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రిహార్సల్స్‌గా ఉప ఎన్నికను అన్ని పార్టీలు భావిస్తున్నాయి. హుజురాబాద్‌లో ఓటర్లు ఎవరిని బాద్‌షా చేస్తోరా చూడాలి.
Tags:    

Similar News