తెలంగాణలో కొత్త రాజకీయం.. గులాబీ వర్సెస్ కమలం

Update: 2022-07-22 05:11 GMT
తెలంగాణ రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయం మొదలైంది. మొన్నటివరకు అధిక్యత.. ఆధిపత్యం అంటే బలప్రదర్శన మాత్రమే ఉండేది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి.. కొత్త పంథాలోకి వెళుతున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తెలంగాణలో ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా కొత్త తరహా కోట్లాటల రాజకీయాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. గ్రామాల్లో అధిపత్య పోరు ఉన్నా.. అది వీధి పోరాటాల వరకు వెళ్లేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విపక్షాల ఉనికి ప్రశ్నార్థకం గా మారటం.. టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించటం తెలిసిందే.

ఇటీవల కాలంలో టీఆర్ఎస్ అధిక్యతను సవాలు చేసే స్థాయికి కమలం పార్టీ ఎదిగింది.రాష్ట్రం మొత్తం ఇలాంటి పరిస్థితే ఉంటుందని చెప్పటం లేదు కానీ.. పలు ప్రాంతాల్లో ఇలాంటి ధోరణి ఈ మధ్యన ఎక్కువైంది. ఎక్కడిదాకానో ఎందుకు ఈ నెల 20న మంచిర్యాలలో బీజేపీ - టీఆర్ఎస్ నేతల మధ్యన ఘర్షణ జరిగింది.

వరద బాధితుల్ని ఆదుకోవాలని బీజేపీ నేతలు దీక్ష చేస్తే.. జీఎస్టీ పెంపును నిరసిస్తూ గులాబీ నేతలు కూడా నిరసన చేశారు. ఈ సందర్భంగా మాటామాటా పెరిగి.. చివరకు ఇరు పార్టీలకు చెందిన వారు కొట్టుకున్నారు. ఈ ఉదంతాన్ని మర్చిపోకముందే తాజాగా మరోజిల్లాలో అలాంటి పరిస్థితి చోటు చేసుకుంది.

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలం బూర్గుల గ్రామంలో టీఆర్ఎస్.. బీజేపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామంలో బీజేపీ కార్యకర్తలు కొత్తగా బీజేపీ గద్దెను ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు.. గ్రామంలో బీజేపీ గద్దె ఎందుకు ఉంటుంది? అంటూ ప్రశ్నిస్తూ దాన్ని కూల్చేశారు. ఈ కూల్చివేతను బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మొదలైన ఘర్షణ తోపులాట వరకు వెళ్లి.. కోట్లాటకు తెర తీసింది. బీజేపీ కార్యకర్తలపై అధికార టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ శ్రేణుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ చౌరస్తాలో రోడ్డు మీద బైటాయించిన బీజేపీ కార్యకకర్తలు.. తమ ఆందోళనను కంటిన్యూ చేశారు. దీనిపై టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ ఇరు పార్టీల మధ్య గొడవ ముదిరిపోవటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్.. బీజేపీల మధ్య ఘర్షణలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇదంతా చూస్తే..గతంలో లేని రీతిలో తెలంగాణలో రాజకీయం కొత్త తరహా లోకి వెళుతుందని మాత్రం చెప్పక తప్పదు. ఇదే విషయాన్ని తాజాగా వైరల్ అవుతున్న తోపులాటకు చెందిన వీడియోను చూస్తే.. తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.


Full View

Tags:    

Similar News