కాంగ్రెస్ కి కొత్త బాస్ ఎప్పుడొస్తారంటే ?

Update: 2020-08-26 14:11 GMT
వందేళ్లకి పైగా సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేనంతగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. దాదాపుగా గత రెండు సార్లు ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇలాగే కొనసాగితే .. భవిష్యత్ లో కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోతుంది అని భావించిన కాంగ్రెస్ పెద్దలు పార్టీ నిర్మాణం వైపు మళ్లీ దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సారధి ఎవరు అన్న దానిపై విపరీతంగా చర్చ నడుస్తుంది. సోనియా గాంధీ అధ్యక్ష పదవి నుండి దిగిపోవాలని కాంగ్రెస్ సీనియర్ నేతలైన 23 మంది లేఖలు రాయడం తో దీనిపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం భేటీ అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగుతూ, సంస్థను బలోపేతం చేయడానికి అవసరమైన మార్పులు తీసుకురావాలని సోనియాగాంధీని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. వచ్చే ఏడాది జనవరిలో కాంగ్రెస్‌ పార్టీకి కొత్త బాస్ ని ఎన్నుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

తాత్కాలిగా సారధిగా సోనియా కొనసాగడానికి సమ్మతించడంతో అసమ్మతి నేతల తిరుగుబాటు తాత్కాలికంగా సద్దుమణిగింది. అయితే పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నించేలా లేఖ ఉందన్న ఎంపీ రాహుల్‌ , ఇందులో బీజేపీ హస్తం ఉందంటూ సీనియర్‌ నేతలపై మండిపడిన నేపథ్యంలో , పార్టీ నేతలు సైతం రాహుల్ వ్యాఖ్యలకి కౌంటర్లు ఇచ్చారు. దశాబ్దాల తరబడి పార్టీకి సేవలు అందించిన తమను ఇలా కించపరచడం సరికాదని ,  తాత్కాలిక చీఫ్‌గా సోనియాను కొనసాగిస్తూనే.. సాధ్యమైనంత త్వరగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.

కానీ, రాహుల్‌ సహా గాంధీ కుటుంబ విధేయులు ఆర్నెళ్ల పాటు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తేల్చి చెప్పడంతో జనవరిలో ఏఐసీసీ సదస్సు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిందట. బిహార్‌ అసెంబ్లీకి తప్ప, ఈ ఏడాది మరే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోవడం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కేరళ, అసోం, పుదుచ్చేరి తదితర ఐదు రాష్ట్రాలకు 2021 ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ ఆరు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త సారథి నేతృత్వంలో ఓ మంచి ‌ టీంను తయారు చేసుకుని, ముందుకు సాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక , నాయకత్వ మార్పు కోరుతూ లేఖ రాసిన 23 మంది సీనియర్‌ నాయకుల్లో పలువురు దానిపై వివరణ ఇస్తూ, పార్టీలో తాము అసమ్మతివాదులం కాదని, పార్టీ పునరుత్తేజాన్ని కోరుకుంటున్న వాళ్లమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్లే స్థితిలో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే స్థితిలో ప్రస్తుతం పార్టీ లేదన్నది అంగీకరించిన వాస్తవమని , 2024 లోక్‌ సభ ఎన్నికలకు, దేశంలో జరగనున్న ఇతర ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడం కోసమే తాము రాసిన లేఖ రాశాం అని చెప్పారు.
Tags:    

Similar News