కొత్త రూల్ వచ్చేసింది.. ఎప్పుడు పడితే అప్పుడు తహసీల్దారును కలువలేరు

Update: 2019-11-14 06:30 GMT
ఒక సంఘటన ఎంతటి మార్పును తీసుకొస్తుందన్న విషయం హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ లో చోటు చేసుకున్న ఉదంతం స్పష్టం చేస్తోంది. మొన్నటి వరకూ తహసీల్దారు కార్యాలయానికి వచ్చి.. తహసీల్దారును కలవాలనుకుంటే సమయంతో పని లేకుండా వెళ్లి కలిసే వెసులుబాటు ఉండేది. ఇటీవల గీతారెడ్డిని ఆఫీసులోనే సజీవదహనం చేసిన ఉదంతం నేపథ్యంలో అధికారులు కొత్త రూల్స్ తీసుకొచ్చారు.

ఎవరు పడితే వారు.. ఎప్పుడు పడితే అప్పుడు తహసీల్దారును వచ్చి కలిసే వీలు లేకుండా నిర్ణయం తీసుకున్నారు. విజిటింగ్ వేళల పేరుతో పరిమిత సమయంలో మాత్రమే కలిసేలా నిర్ణయం తీసుకున్నారు. ఆఫీసులో సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేయటంతో పాటు.. ఎవరెవరు? ఎప్పుడెప్పుడు వస్తున్నారన్న విషయాన్ని చూడనున్నారు.

పోలీసు భద్రతను కల్పించనున్నారు. అంతేకాదు.. గతంలో మాదిరి ఏదో ఒక ద్వారం నుంచి కలిసే వీలు లేకుండా.. అందరూ ఒక ద్వారం నుంచి మాత్రమే కలిసేలా ఏర్పాటు చేయటంతో పాటు.. పరిమిత వేళల్లోనే కలిసే వెసులుబాటు ఉంటుంది. ఈ సమయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. మెజిస్ట్రేట్ అధికారాలు ప్రతిబింబించేలా కోర్టు గది.. అధికారుల కార్యాలయంలో ప్రత్యేకమైన నిర్మాణాలు ఉండాలని.. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని నిర్ణయించారు. గ్రీవెన్స్ డే రోజున ప్రజల నుంచి వినతులు.. ఫిర్యాదులు తీసుకునే సమయంలో కార్యాలయ సిబ్బంది అంతా హాజరుకావాలన్న ఆదేశాన్ని ఇచ్చారు.
Tags:    

Similar News