కేసీఆర్ భ‌యాన్ని రెట్టింపు చేసిన కోదండ‌రాం!

Update: 2018-10-22 17:26 GMT
గులాబీ ద‌ళ‌పతి కేసీఆర్ అంచ‌నాల‌ను తెలంగాణ జన‌స‌మితి నాయ‌కుడు ప్రొఫెస‌ర్ కోదండరాం వ‌మ్ము చేశారు. టీఆర్ ఎస్ అధినేత వేసిన లెక్క‌లు వేరైతే దానికి భిన్నంగా కోదండ‌రాం ఇంకో నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్తున్నారు. మ‌హాకూట‌మిలోనే ఉంటామ‌ని ఆయ‌న తేల్చిచెప్ప‌డం ద్వారా అధికారం సుల‌భ‌మ‌నే టీఆర్ ఎస్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లార‌ని అంటున్నారు. అధికార టీఆర్ ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు ఐక్యంగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకొని కాంగ్రెస్‌ - టీడీపీ - సీపీఐల‌తో క‌లిసి తెలంగాణ జ‌న‌స‌మితి ప్ర‌జాకూట‌మిని ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ కూట‌మి ఆదిలోనే ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కుంది. ప్ర‌ధానంగా టీఆర్ ఎస్ త‌ర‌ఫున ఎదురుదాడిని రుచి చూసింది. తెలంగాణకు వ్య‌తిరేకి అయిన టీడీపీతో - రాష్ట్రం ఇవ్వ‌ని కాంగ్రెస్‌ తో ఎలా పొత్తుపెట్టుకుంటార‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు నిల‌దీశాయి.

అయితే, దీన్ని త‌న‌దైన శైలిలో కోదండ‌రాం ఆండ్ టీం తిప్పికొట్టింది. ప్ర‌జ‌లు ఆకాంక్షిస్తున్న తెలంగాణ కోస‌మే తాము జ‌ట్టుక‌డుతున్నామ‌ని తెలిపాయి. అయితే, అనంత‌రం టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్‌ ను పేర్కొంటూ ``టీడీపీ పెట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా. అలాంటి పార్టీతో కూట‌మి అంటూ బాబు దోస్తీ క‌ట్ట‌డం అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌కు ప‌రాకాష్ట‌. చంద్ర‌బాబు తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది` అంటూ మండిప‌డింది. దీన్ని సైతం కూట‌మి తిప్పికొట్ట‌డంతో ఆంధ్రాతో చంద్ర‌బాబుకు లింక్ పెట్టి విమ‌ర్శ‌లు చేయారు. సాక్షాత్తు గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆరే ఈ ర‌కంగా విరుచుకుప‌డ్డారు. అయితే, తెలంగాణ‌లోని ఆంధ్రా ఓట‌ర్లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో న‌ష్ట‌పోయేలా ఉన్నామ‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు వెన‌క్కుత‌గ్గాయి.

అనంత‌రం సీట్ల పంచాయ‌తీని పేర్కొంటూ కూట‌మి అయ్యే పనికాద‌నే అంచ‌నాకు గులాబీ వ‌ర్గాలు వ‌చ్చాయి. కానీ తాజాగా కోదండ‌రాం మీడియాతో మాట్లాడుతూ కూట‌మి ఉంటుంద‌ని తేల్చిచెప్పారు. అంతేకాకుండా తామంతా ఐక్యంగా పోరాటం చేస్తామ‌న్నారు. స్థూలంగా ప్ర‌తిప‌క్షాల బ‌లం విష‌యంలో గులాబీ ద‌ళ‌ప‌తి అంచ‌నా ఒక‌టైతే...అయింది మ‌రొక‌ట‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News