కొడాలిని కొట్టేందుకు గుడివాడ‌లో బాబు కొత్త స్ట్రాట‌జీ ఇదే..!

Update: 2021-10-08 17:30 GMT
కొడాలి నాని ఈ పేరు తెలుగు రాజకీయాల్లో ఓ అగ్గితూటాలా పేలుతూ ఉంటుంది. ఏపీలో అధికార వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాని మీడియా స‌మావేశం పెట్టారంటే ప్ర‌తిప‌క్ష టీడీపీతో పాటు ఆ పార్టీ నేత చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌పై ఎంత ప‌దునైన మాట‌లు.. ఇంకా చెప్పాలంటే బూతుల‌తో విరుచుకు ప‌డ‌తారో మ‌నం చూస్తూనే ఉన్నాం. తాను ఇచ్చిన బీ ఫాంతో ఎమ్మెల్యే అయిన నాని.. ఇప్పుడు త‌న‌నే తీవ్ర‌స్థాయిలో టార్గెట్ చేస్తూ.. టీడీపీ కేడ‌ర్ ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌కొట్టేలా మాట్లాడుతుండ‌డం చంద్ర‌బాబుకు చాలా బాధ క‌లిగిస్తోంది.

నానిని గుడివాడ‌లో ఎలాగైనా ఓడించాల‌న్న క‌సి టీడీపీ కేడ‌ర్‌తో పాటు అటు చంద్ర‌బాబుకు కూడా ఉంది. అయితే అక్క‌డ టీడీపీకి బ‌ల‌మైన క్యాండెట్ లేరు. 2004, 2009 ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి వ‌రుస‌గా రెండు సార్లు ఎమ్మెల్యే అయిన నాని.. ఆ త‌ర్వాత వైసీపీలోకి జంప్ చేసేశారు. 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో వైసీపీ ఓడిపోయినా కూడా గుడివాడ‌లో వ‌రుస‌గా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్ట‌డంతో పాటు త‌న కంచుకోట అని ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇక మొన్న ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా నాలుగోసారి విజ‌యం సాధించి.. గుడివాడ‌లో త‌న‌ను కొట్టేవారే లేడ‌ని ఫ్రూవ్ చేసుకున్నాడు.

అయితే ఈ సారి కొడాలిని ఓడించాల‌న్న క‌సితో ఉన్న చంద్ర‌బాబు అక్క‌డ స్ట్రాటఈని మారుస్తున్నాడు. గుడివాడ‌లో ఎప్పుడూ క‌మ్మ నేత‌లు ఎన్నిక‌వుతూ వ‌స్తున్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్పుడు తొలి రెండు ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ నుంచే పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. త‌ర్వాత రావి కుటుంబం నుంచి రావి శోభ‌నాద్రితో పాటు ఆయ‌న ఇద్ద‌రు కుమారులు హ‌ర‌గోపాల్‌, వెంక‌టేశ్వ‌ర‌రావు ఇద్ద‌రూ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక 2014లో ప్ర‌జారాజ్యంలోకి వెళ్లిన రావి వెంక‌టేశ్వ‌ర‌రావును తీసుకు వ‌చ్చి టిక్కెట్ ఇచ్చినా ఓడిపోయారు.

ఇక గ‌త ఎన్నిక‌ల్లోనే నానిని ఓడించాల‌ని విజ‌య‌వాడ నుంచి దేవినేని అవినాష్‌ను తీసుకువ‌చ్చి మ‌రీ కోట్లు కుమ్మ‌రించినా ఓడిపోయాడు. పైగా అవినాష్ త‌ర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో నానిని ఢీ కొట్టేందుకు బాబు కొత్త స్ట్రాట‌జీతోనే ముందుకు వెళుతున్నారు. గుడివాడ‌లో కాపు ఓట్లు ఎక్కువ‌. అందుకే కాపు వ‌ర్గంలో బ్రాండ్‌గా ఉన్న వంగ‌వీటి రాధాను ఇక్క‌డ నుంచి పోటీ పెడితే ఎలా ?  ఉంటుంద‌ని ఆలోచ‌న చేస్తున్నారు. కాపు + క‌మ్మ ఈక్వేష‌న్‌తో ఈ సారి గుడివాడ‌లో నానిని ఎలాగైనా ఓడించాల‌న్న క‌సితోనే బాబు ఉన్నార‌ని పార్టీ నేత‌లే చెపుతున్నారు.

రాధాను గుడివాడలో బరిలోకి దింపితే జిల్లా అంత‌టా కాపు ఓట‌ర్ల‌తో పాటు వంగ‌వీటి అభిమానుల్లో భారీ మార్పు ఉంటుంద‌న్న అంచ‌నాతో చంద్ర‌బాబు ఉన్నారు. మ‌రి ఈ స్ట్రాట‌జీ ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో ?  చూడాలి.
Tags:    

Similar News