కొత్త మలుపులు తిరుగుతున్న యువతి నగ్న వీడియో కేసు

Update: 2020-07-01 12:10 GMT
ఓ యువతి నగ్న వీడియో సోషల్ మీడియాలో వైరలవడాన్ని పోలీసులు తీవ్రంగా భావించి ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని గుంటూరులో విచారణ చేస్తుండగా కొత్త మలుపులు తిరుగుతోంది. ఇంజినీరింగ్‌ విద్యార్థిని నగ్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు పోర్న్ వెబ్‌సైట్లలో వైరల్‌ చేసిన కేసును సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ఈ కేసులో నిందితుల అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపైన తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ కేసులో పోలీసు దంపతుల కుమారుడు ఏ1గా ఉండడంతోనే అలా వ్యవహరించారనే అనుమానాలు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

దర్యాప్తులో భాగంగా ఈ కేసులో కొందరు రౌడీషీటర్లు తలదూర్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే గుంటూరులోని పాతగుంటూరు, బుచ్చయ్యతోట, శారదా కాలనీకి చెందిన ముగ్గురు రౌడీషీటర్లతో పాటు అరండల్‌పేటకు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

2017లో గుంటూరులో ఓ రౌడీషీటర్‌ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న విద్యార్థి అప్పట్లో ఆయన వద్దకు తరచూ వెళ్తుండేవాడని తెలిసింది. ఆ రౌడీషీటర్‌ పేరు చెప్పి బెదిరించడంతోనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని భావిస్తున్నారు. ఆ రౌడీషీటర్‌ హత్యకేసులో ప్రమేయమున్న వ్యక్తులకు ఆ న్యూడ్ వీడియో చేరడం, అతడిపై కోపంతో ఆ విద్యార్థిని ఇరికించడం కోసమే ఆ వారే వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ చేశారని సమాచారం.

ఈ కేసులో ఏ1గా ఉన్న పోలీసు దంపతుల కుమారుడు వరుణ్‌తేజ్‌ను ఇప్పటికే అరెస్ట్ చేశామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఈ కేసుతో ప్రమేయమున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే అరెస్ట్ విషయంలో సున్నితంగా వ్యవహరించామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. మరికొన్ని రోజుల్లో దీని వెనకాల ఉన్న వారందరినీ అరెస్ట్ చేస్తామని పోలీసులు అధికారులు చెబుతున్నారు.
Tags:    

Similar News