కోడెల ఇంటి అద్దె లెక్క‌ల్లో తేడాలున్నాయా?

Update: 2019-04-22 04:22 GMT
ఏపీలో ఎన్నిక‌లు ముగిశాయి. ఓట‌ర్లు తమ తీర్పును ఈవీఎంల‌లో నిక్షిప్తం చేశారు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు మ‌రో నెల రోజులు స‌మ‌యం మిగిలి ఉంది. అధికార బదిలీకి సంబంధించిన చ‌ర్చ ఏపీలో ఎక్కువ‌గా వినిపిస్తుంటే.. అదేమీ ఉండ‌ద‌న్న ధీమాను టీడీపీ నేత‌లు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ అధికార‌ప‌క్షానికి సంబంధించిన కొత్త కొత్త వ్య‌వ‌హారాలు ఇప్పుడు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఇంటికి సంబంధించిన ఒక విష‌యం వెలుగు చూడ‌ట‌మే కాదు.. త‌ర‌చి చూస్తే.. రానున్న రోజుల్లో ఇదో సంచ‌ల‌నంగా మారుతుంద‌న్న మాట వినిపిస్తోంది. ఇంత‌కీ ఏపీ స్పీక‌ర్ కోడెల ఇల్లు ఎక్క‌డా?  ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలోనా?  ఉమ్మ‌డి రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లోనా?  లేదంటే ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న స‌త్తెన‌ప‌ల్లిలోనా?  లేదంటే గుంటూరులోనా.. ఇవేమీ కావు.. న‌ర‌స‌రావుపేట‌లోని ఆయ‌న సొంత భ‌వ‌నంలోనా? అన్న ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు వెతికితే కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ఏపీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు అధికారిక నివాసం.. క‌మ్ క్యాంప్ ఆఫీసు ఏమిట‌న్న ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు చూస్తే.. హైద‌రాబాద్‌ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబ‌రు 7 లోని ఇరాన్ కాన్సులేట్ స‌మీపంలోని ఇంటి నెంబ‌రు 8–2–503ను చెబుతున్నారు. ఈ ప్రైవేటు భ‌వ‌నానికి ప్ర‌తి నెలా రూ.ల‌క్ష చొప్పున అద్దె చెల్లిస్తున్న‌ట్లుగా ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. మ‌రి..ఏపీ  స్పీక‌ర్ గారు ఉండే ప్రైవేటు భ‌వ‌నంలో మ‌రేదైనా ఆఫీసు ఉండే అవ‌కాశం ఉందా?  అంటే.. లేద‌నే చెబుతారు. కానీ.. కాసింత జాగ్ర‌త్త‌గా చూస్తే కొత్త విష‌యం బ‌య‌ట‌కు రావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

కోడెల అధికార నివాసం పేరిట ఉన్న అడ్ర‌స్ లోనే.. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర మ‌ల్టీఫ్లెక్సెస్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ కార్యాల‌యం ఉన్న‌ట్లుగా రికార్డుల్లోనే కాదు.. ఆ సంస్థ వెబ్ సైట్ లోనూ ఉంది.

స‌ద‌రు సంస్థ రిజిస్ట్రేష‌న్ కూడా ఇదే అడ్ర‌స్ తో ఉండ‌టం విశేషం. 2007 సెప్టెంబ‌రులో అన్ లిస్ట్ అయిన ఈ ప్రైవేటు కంపెనీ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో 2018 సెప్టెంబ‌రు 29న నిర్వ‌హించిన‌ట్లుగా పేర్కొంది. ఒక రాష్ట్ర అసెంబ్లీ స్పీక‌ర్ అధికార నివాసంలో ఇలా జ‌ర‌గ‌టం సాధ్య‌మా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఇంత‌కీ ఈ సంస్థ ఎవ‌రిది? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే.. ఉమ్మ‌డి ఏపీలో చంద్ర‌బాబు స‌ర్కారులో హోంమంత్రిగా వ్య‌వ‌హ‌రించిన దేదేంద‌ర్ గౌడ్ కొడుకుద‌న్న స‌మాధానంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏపీ ప్ర‌భుత్వం స్పీక‌ర్ అధికార నివాసానికి నెల‌కు రూ.ల‌క్ష చొప్పున అద్దె చెల్లిస్తుంటే.. అందులో దేవెంద‌ర్ గౌడ్ కొడుక్కి చెందిన ఆఫీసు ఉండ‌టం దేనికి నిద‌ర్శ‌నం?  మ‌రి.. అధికారికంగా ప్ర‌తినెలా చెల్లిస్తున్న ల‌క్ష రూపాయిలు ఎక్క‌డికి వెళుతున్నాయి?  ఎవ‌రి అకౌంట్లోకి పోతున్నాయి? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ల‌భించాల్సి ఉంటుంది. ఏపీ రాష్ట్ర అసెంబ్లీ స్పీక‌ర్ అధికారిక అద్దె ఇంటి లెక్క హాట్ టాపిక్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News