ఏపీలో కొత్త ఊరును క‌నుగొన్నారు

Update: 2017-08-18 07:01 GMT
ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఒక కొత్త ప్రాంతాన్ని క‌నుక్కోవ‌టం ఏమిటి? అన్న సందేహం రావొచ్చు. కానీ.. ఇది నిజం. ఇంత పెద్ద ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌.. మీడియా ఉన్న ఈ డిజిట‌ల్ యుగంలో.. వాస్కోడిగామా భార‌త‌దేశాన్ని క‌నుగొన్న‌ట్లు.. కొలంబ‌స్ అమెరికాను క‌నుగొన్న‌ట్లుగా తూర్పుగోదావ‌రి జిల్లా అధికారులు ఇప్పుడు కొత్త‌గా ఒక గ్రామాన్ని క‌నుగొన్నారు.

ఇంత‌వ‌ర‌కూ రెవెన్యూ లెక్క‌ల్లో లేని.. ప్ర‌భుత్వ రికార్డుల్లోకి ఎక్క‌ని ఒక కొత్త ఊరును క‌నుగొన‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగానే కాదు.. సంచ‌ల‌నంగా మారింది.

ఇంత‌కీ.. ఎవ‌రి దృష్టికి రాని ఈ కొత్త ఊరు ఇప్పుడే ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్న సందేహం వ‌చ్చిందా? అక్క‌డికే వ‌స్తున్నాం. అస‌లేం జ‌రిగిందంటే.. తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌వొమ్మంగి మండ‌లంలో జ్వ‌రాల‌తో బాధ ప‌డుతున్న ముగ్గురు పిల్ల‌ల్ని తీసుకొని ల‌గ‌రాయి ప్రాధ‌మిక ఆసుప‌త్రికి ఒక ఆదివాసీ వ్య‌క్తి గురువారం వ‌చ్చాడు. త‌మ ఊళ్లో అంద‌రూ మంచం ప‌ట్టార‌ని అత‌ను చెప్ప‌టంతో ఎంపీడీవో  స్పందించి వెంట‌నే వైద్యుల్ని తీసుకొని ఆ గ్రామానికి బ‌య‌లుదేరారు.

స‌ద‌రు ఆదివాసీ తీసుకెళుతున్న దారి చూసి అధికారులు.. వైద్యులు ఆశ్చ‌ర్య‌పోయిన ప‌రిస్థితి. ఎందుకంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ రికార్డుల్లో లేని స‌రికొత్త ఊరికి అత‌డు తీసుకెళ్లాడు.  కొండ‌లు.. గుట్ట‌లు దాటుకొని వెళ్లిన వారికి ఆదివాసీలు కొత్త‌పాలెంగా పిలుచుకునే కొత్త ఊరు ముచ్చ‌ట బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఆ ఊళ్లో తాగ‌టానికి మంచినీళ్లు లేక‌పోవ‌ట‌మే కాదు.. న‌డిచి వెళ్ల‌టానికి కూడా స‌రైన దారి లేని ప‌రిస్థితి. అనంత‌గిరి నుంచి లోత‌ట్టు ప్రాంతానికి కాలిన‌డ‌క‌న వెళితే కానీ ఆ ఊరికి చేరుకోలేని ప‌రిస్థితి. 35 మంది పెద్ద‌వారు.. 15 మంది పిల్ల‌ల‌తో ఆ ఊరు ఉంది. వారి చ‌దువు గురించి అర్థంకాని రీతిలో ఉంది. అక్క‌డ ఓ నేల బావి మాత్ర‌మే ఉన్న విష‌యాన్ని అధికారులు గుర్తించారు. అదే వారి నీటికి ఆధారంగా చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. మొక్క‌జొన్న‌.. గంటెలు.. సాములు వంటి పంట‌లు పండించి అవే తింటున్నారు. ఊరు.. ఊరంతా జ్వ‌రాల‌తో బాధ ప‌డ‌టంతో వైద్య‌సాయం కోసం బ‌య‌ట‌కు రావ‌టంతో రికార్డుల్లో లేని కొత్త ఊరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ డిజిట‌ల్ యుగంలో ఐదున్న‌ర కోట్ల మంది ఆంధ్రులు ఉన్న రాష్ట్రంలో ఒక కొత్త ఊరు బ‌య‌ట‌కు రావ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. గ్రామ‌స్తుల ద‌య‌నీయ ప‌రిస్థితిని చూసిన అధికారులు వెంట‌నే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి.. వైద్య‌సేవ‌లు అందిస్తున్నారు. ఇలాంటి వారికి సంబంధించిన స‌మాచారాన్ని హైద‌రాబాద్ లోని సీసీఎంబీ అధికారులకు తెలియ‌జేస్తే..ఈ ఆదివాసీల జ‌న్యుక్ర‌మం మీద ప‌రిశోధ‌న జ‌రిపితే మ‌రిన్ని కొత్త విష‌యాలు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెప్పొచ్చు. మ‌రి.. ఆ ప‌ని అధికారులు చేస్తారా?
Tags:    

Similar News