మొన్న కోవిడ్.. నిన్న మంకీ పాక్స్.. నేడు మ‌ర్ బ‌ర్గ్ క‌ల్లోలం!

Update: 2022-07-19 02:30 GMT
ప్ర‌పంచ దేశాల‌ను కొత్త వైర‌స్ లు తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం వ‌చ్చిన కోవిడ్ వైర‌స్ తో ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు క‌న్నుమూశారు. కొన్ని ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు ఇంకా కోవిడ్ దుష్ప్ర‌భావాల‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితిలో తాజాగా మంకీ పాక్స్ 61 దేశాల్లో ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. మ‌న‌దేశంలోనూ విదేశాల నుంచి వ‌చ్చిన‌వారిలో మంకీ పాక్స్ కేసులు వెలుగు చూశాయి. కేర‌ళ‌లో రెండు మంకీ పాక్స్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి.

మొన్న కోవిడ్, నిన్న మంకీ పాక్స్ ల నుంచి త‌ప్పించుకోలేక ప్ర‌జ‌లు స‌త‌మ‌త‌మవుతుంటే ఇప్పుడు మ‌ర్ బ‌ర్గ్ అనే వైర‌స్ క‌ల‌వ‌ర‌పెడుతోంది. తాజాగా ఆఫ్రికా ఖండంలోని ఘనాలో అత్యంత వ్యాప్తి కలిగిన ‘మర్‌బర్గ్‌’ వైరస్ కేసులు బయటపడటం ఉలిక్కిపాటుకు గురిచేసింది.

ఈ కొత్త వైరస్‌ కారణంగా ఘ‌నాలో ఇద్దరు మృతిచెందినట్లు అక్కడి ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఎబోలా తరహా లక్షణాలు కలిగిన వైరస్‌ కారణంగా ఈనెల మొదట్లోనే ఆ ఇద్దరు మృతిచెందారు. కాగా ఆసుపత్రిలో చనిపోయే ముందు వారు డయేరియా, జ్వరం, వికారం, వాంతులు లాంటి లక్షణాలతో బాధపడినట్లు అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే మృతుల నమూనాలు సేకరించి సెనెగల్‌లోని ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించిన తర్వాత మర్‌బర్గ్‌గా తేలినట్లు ఘనా హెల్త్ సర్వీస్ ఒక ప్రకటనలో వెల్ల‌డించింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ధ్రువీకరించ‌డం గ‌మ‌నార్హం. కాగా మ‌ర్ బ‌ర్గ్ వైర‌స్ తో అప్రమత్తమైన ఘనా ప్రభుత్వం ఈ వైర‌స్ ను నియంత్రించే చ‌ర్య‌ల‌కు శ్రీకారం చుట్టింది.

ఇందులో భాగంగా మ‌ర్ బ‌ర్గ్ వైర‌స్ అనుమానితులు, వారి స‌న్నిహితుల‌ను ఐసోలేషన్‌కు తరలించి వారిని పరీక్షిస్తోంది. కాగా ఘ‌నా దేశంలో మ‌ర‌ణించిన ఆ ఇద్ద‌రు మిన‌హా ఇప్పటివరకు మరే ఇతర వ్యక్తిలో మర్‌బర్గ్‌ లక్షణాలు కనిపించలేదని ఘ‌నా ఆరోగ్య శాఖ వెల్లడించింది. పశ్చిమాఫ్రికాలో మొత్తంగా మర్‌బర్గ్‌ కేసులు వెలుగుచూడటం ఇది రెండోసారి మాత్రమే. మొట్టమొదటిసారి గతేడాది గినియా దేశంలో ఈ కేసులు బయటపడ్డాయ‌ని చెబుతున్నారు.

ఎబోలా కుటుంబానికి చెందిన మర్‌బర్గ్‌ వైరస్ ఓ అంటువ్యాధ‌ని వైద్యులు చెబుతున్నారు. ఇది గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. ఆ తర్వాత మానవుల్లో వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తి శారీరక ద్రవాలు తాకినప్పుడు లేదా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఒకరి నుంచి మరొకరికి సోకే ప్ర‌మాదం ఉంది. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ 2-21 రోజులపాటు ఓ వ్యక్తిలో సజీవంగా ఉంటుంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News