శుభవార్త : జ‌గ‌న‌న్న‌కు పైస‌లొచ్చిన‌య్ !

Update: 2022-04-05 06:44 GMT
నిండా మునిగిన కూడా ఏదో ఒక ఆశ తీరానికి చేరుస్తుంద‌న్న చందంగా ఇప్పుడొక చిన్న వెలుగు రేఖ రాష్ట్రానికి అవ‌స‌రం అయి ఉంది. అప్పుల పుట్టుక‌పై అదేవిధంగా ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై నిరంత‌రం ఏదో ఒక వివాదాన్ని మోస్తూ వ‌స్తున్న జ‌గ‌న్ స‌ర్కారు ఎప్ప‌టి నుంచో ప్ర‌త్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందుకు కొన్ని సార్లు ప్ర‌య‌త్నాలు చేసినా అవ‌న్నీ విఫ‌లం అయ్యాయి. చేసేది లేక ఆఖ‌రికి మ‌ధ్యే మార్గంగా ప‌న్నుల వ‌డ్డ‌నకు ప్రాధాన్యం ఇచ్చారు.

తాజాగా కాస్త ఉప‌శ‌మ‌నం అన్న విధంగా కొన్ని ప‌నులు ఫ‌లితాలు ఇస్తున్నాయి. ఆ విధంగా కొంత‌లో కొంత ఆదాయం ఖ‌జానాకు వ‌చ్చి చేర‌నుంది. ప‌న్నుల వ‌సూలు కూడా కొన్ని చోట్ల బాగానే ఉంటోంది. ఆస్తి ప‌న్నుకు సంబంధించి కాస్త సానుకూల‌త ఉన్నా చెత్త ప‌న్నుపై మాత్రం ఇప్ప‌టికీ విభేదాలు పొడ‌సూపుతున్నాయి. విభిన్న స్వ‌రాలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు నాలా వ‌సూలుకు సంబంధించి ఆరు శాతం వ‌డ్డీ విధించి అభాసు పాలైంది. ఇవి కూడా కాస్త పరిష్కృతం అయితే స్థానిక పాల‌న‌కు కాస్తో కూస్తో డ‌బ్బులు వ‌చ్చి చేరుతాయి.

ఎలానూ కేంద్రం నుంచి పంచాయ‌తీలకు నేరుగా అంటే రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌మేయం లేకుండానే నిధులు వ‌చ్చి చేరుతున్నందున ఇప్పుడిప్పుడే కొన్ని చిన్నా చిత‌కా ప‌నులు చేప‌ట్టే అవ‌కాశం స‌ర్పంచ్ ల‌కు చిక్కుతోంది. అదేవిధంగా వాళ్లంతా త‌మ త‌మ పంచాయ‌తీల త‌రఫున చెల్లించాల్సిన విద్యుత్ బ‌కాయిలు చెల్లిస్తే ఇంకాస్త స‌మ‌స్య తీర‌నుంది.ఆర్థికంగా కూడా స‌ర్కారు నిల‌దొక్కుకోవ‌డంకు కాస్త ఆస్కారం ఉంటుంది. ఈ ద‌శ‌లో ఓ విధంగా ఎప్ప‌టి నుంచో రాష్ట్రాన్ని వేధిస్తున్న స‌మ‌స్య ఒక‌టి తీరింది.

కొంత‌లో కొంత ఆదాయానికి మార్గం సుగ‌మం అయింది. మ‌న రాష్ట్రం త‌ర‌ఫున వేలంలో ద‌క్కించుకున్న గ‌నుల త‌వ్వ‌కంపై దృష్టి సారించింది సంబంధిత ఏపీఎండీసీ. దీంతో ఝార్ఖండ్ లో త్వ‌ర‌లోనే బొగ్గు త‌వ్వ‌కం మొద‌లు కానుంద‌ని ప్ర‌ధాన మీడియాలో సంబంధిత వ‌ర్గాలు ధ్రువీక‌రిస్తున్నాయి. అక్క‌డి బ్ర‌హ్మ‌దియా బొగ్గు గ‌నిలో త‌వ్వ‌కాల‌కు సంబంధించి త్వ‌ర‌లోనే ప‌నులు చేప‌ట్ట‌నున్నామ‌ని కూడా అంటున్నారు సంబంధిత ఉన్న‌తాధికారులు.

లోటు బ‌డ్జెట్ తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కాస్త ఊరట ఇచ్చే వార్త ఇది. ఓ విధంగా ఇప్ప‌టికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రానికి ఇదొక స్వ‌ల్ప‌కాల ఉప‌శ‌మ‌నం మాత్ర‌మే! ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ తో స‌హా ఇత‌ర వ‌ర్గాల వారు కూడా ఆనందించాల్సిన ప‌రిణామం ఇదే! తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఖ‌నిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి తొమ్మిది వంద‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు ఆదాయం వ‌చ్చింద‌ని, 2021 - 22 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి ఈ మొత్తం ఖ‌జానాకు వ‌చ్చి చేరింద‌ని ప్ర‌ధాన మీడియా వెల్ల‌డిస్తోంది.

ఈ మేరకు సంస్థ ఎండీ వెంక‌ట రెడ్డి ఆనందం వ్య‌క్తం చేస్తూ..గ‌త నెల ప‌దో తేదీ నుంచి త‌వ్వ‌కాలు మొదల‌య్యాయ‌ని, 21 రోజుల్లో 17 కోట్ల రూపాయ‌ల ఆదాయం చేకూరింద‌ని తెలిపారు. ఒక్క బొగ్గు గ‌నుల తవ్వ‌కం ద్వారానే ఈ ఏడాది అంటే ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి (2022 - 2023) ప‌న్నెండు వంద‌ల కోట్ల రూపాయ‌లు వ‌స్తుంద‌ని అంచనా వేస్తున్నామ‌ని కూడా ఆయ‌న తెలిపారు.
Tags:    

Similar News