ఈ 9సెకన్ల వీడియో చాలు.. మంత్రి పెద్దిరెడ్డికి కొత్త కేసు మెడకు చుట్టుకున్నట్లే

Update: 2022-05-12 03:15 GMT
ఏదో చేద్దామనుకొని మరేదో చేసిన చందంగా మారింది ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం చూస్తుంటే. పదో తరగతి పరీక్షాపత్రాల లీకేజీ అంశంపై తనకు సంబంధం లేకున్నా మాట్లాడిన ఆయన తన నెత్తి మీదకు కొత్త సమస్యను వేసుకున్నట్లుగా కనిపిస్తోంది. నోరు జారారో.. నిజం చెప్పారో కానీ ఆయన నోటి నుంచి తాజాగా వచ్చిన మాటల్ని వింటే అవాక్కు అవ్వాల్సిందే. ఇదేంది సామీ? ఈ మాటలేంది? ఇలా అయితే ఎలా? అన్న సందేహం కలగక మానదు.

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో పలువురిని అరెస్టు చేసిన వైనంపై మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి.. "వాళ్ల ఫోన్ కాల్స్ అన్నీ కూడా ట్యాపింగ్ చేసి.. ఎవరైతే నిజంగా బాధ్యులు ఉన్నారో.. వాళ్లందరిని అరెస్టు చేశారు" అని వ్యాఖ్యానించారు.

ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు తీవ్రత ఎంతన్నది కాసేపు పక్కన పెడితే.. మంత్రి పెద్దిరెడ్డి నోటి నుంచి వచ్చిన మాటల ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా మంత్రిగారే స్వయంగా కమిట్ అయిన నేపథ్యంలో..ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే.. జగన్ సర్కారుకు కొత్త తిప్పలు గ్యారెంటీ అని చెబుతున్నారు.

ప్రెస్ మీట్ లో మంత్రి పెద్దిరెడ్డి చేసిన షాకింగ్ వ్యాఖ్యలపై తాజాగా మాజీ మంత్రి లోకేశ్ స్పందించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ ఎపిసోడ్ లో పలువురి ఫోన్లు ట్యాప్ చేశామని.. అందుకుబాధ్యులైన వారిని అరెస్టు చేశామంటూ.. ట్యాపింగ్ చేసిన అంశంపై ఆన్ రికార్డెడెడ్ గా చెప్పిన వైనంతో తాను నివ్వెరపోయినట్లుగా పేర్కొన్నారు.

టీడీపీ నేతలపై కక్ష సాధించేందుకు వీలుగా వైసీపీ సర్కారు చట్టాల్ని విస్మరిస్తుందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన లోకేశ్.. అందుకు మంత్రి పెద్దిరెడ్డిమాటలే నిదర్శనంగా పేర్కొన్నారు.

ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఇష్టానుసారంగా తుంగలోకి తొక్కే అధికారం ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించిన లోకేశ్.. ప్రతిపక్షాలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకోవటం కోసం వైసీపీ ఓవర్ టైం పని చేస్తుండట సిగ్గుచేటుగా అభివర్ణించారు. ఏమైనా.. టెన్త్ పరీక్షా పత్రాల లీకేజీ సంగతేమో కానీ.. ఫోన్లు ట్యాప్ చేశామంటూ మంత్రి పెద్దిరెడ్డి మాటలు మాత్రం రానున్న రోజుల్లో ఆయనకు తలనొప్పిగా మారే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.


Full ViewFull View
Tags:    

Similar News