డ‌ల్ అయిపోయాడా బండి సంజ‌య్‌.. ఎందుకు?

Update: 2022-04-22 11:34 GMT
బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడిగా పార్టీ బాధ్య‌త‌లు చేపట్టిన‌ప్ప‌టి నుంచి బండి సంజ‌య్‌తో దూకుడుతో ముందుకు సాగుతున్నారు. అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసుకుని పదునైన విమ‌ర్శ‌ల‌తో సాగుతున్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో నాలుగు ఎంపీ స్థానాల్లో బీజేపీ విజ‌య ఢంకా మోగించింది. ఆ త‌ర్వాత బండి సంజ‌య్ అధ్య‌క్షుడిగా పార్టీ ప‌రుగులు పెడుతోంది.

దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న విజ‌యాలు సాధించింది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింది. దీంతో కేసీఆర్‌ను ఢీకొట్టే స‌రైన నాయ‌కుడు బండి సంజ‌య్ అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. బండి వేగం త‌గ్గింద‌ని విశ్లేష‌కులు కూడా అంటున్నారు.

రేవంత్ రాక‌తో..గ‌తేడాది తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్ఠానం నియ‌మించ‌డంతో రాష్ట్రంలో ఆ పార్టీ జోరందుకుంది. టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ అంటూ రేవంత్ దూసుకెళ్తున్నారు. కానీ మొద‌ట్లో సీనియ‌ర్లు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం, రేవంత్‌ను వ్య‌తిరేకించ‌డం స‌మ‌స్య‌గా మారింది. కానీ ఇటీవ‌ల తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌ను ఢిల్లీకి పిలిచి మ‌రీ హైక‌మాండ్ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చింది. ఒక జాతీయ స‌ర్వే ద్వారా రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అధిష్ఠానానికి తెలిసింద‌ని టాక్‌.

కేసీఆర్‌పై వ్య‌తిరేక‌త కాంగ్రెస్‌కు అనుకూలంగా మార‌నుంద‌ని ఆ రిపోర్ట్‌లో తెలిసింది. దీంతో తెలంగాణ నాయ‌కుల‌ను రేవంత్ సార‌థ్యంలో సాగాల‌ని హైక‌మాండ్ సూచించింది. గీత దాటితే స‌స్పెండ్ చేస్తామ‌ని హెచ్చ‌రించింది. అప్ప‌టి నుంచి సీనియ‌ర్ల‌లో మార్పు వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్పుడు అంద‌రూ క‌లిసి రాహుల్ గాంధీ స‌భ కోసం ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు కేసీఆర్‌ను ఢీ కొట్టే మొన‌గాడు రేవంత్ అనే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

చీలిన వ‌ర్గాలు..మ‌రోవైపు సొంత పార్టీలోనే సంజ‌య్‌కు స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయ‌ని స‌మాచారం. బీజేపీ నాయ‌కులు రెండు వ‌ర్గాలుగా చీలిపోయార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. సంజ‌య్‌కు బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుల నుంచి మ‌ద్ద‌తు లేద‌ని టాక్‌. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్లు మాత్ర‌మే సంజ‌య్ వెన‌కాల న‌డుస్తున్నార‌ని అంటున్నారు. అందుకే సంజ‌య్ పాద‌యాత్ర కూడా ఊహించిన ఆద‌ర‌ణ ద‌క్క‌డం లేద‌ని నిపుణులు అంటున్నారు. రేవంత్ దెబ్బ‌కు సంజ‌య్ వెన‌క‌బ‌డ్డార‌ని హైక‌మాండ్ కూడా అనుకుంటున్నట్లు తెలిసింది. బీజేపీ వాదుల‌కు సంజ‌య్ మీద న‌మ్మ‌కం పోతున్న‌ట్లే క‌నిపిస్తోంది.

అంతే కాకుండా ద‌క్షిణ తెలంగాణ‌లో బీజేపీ పెద్ద‌గా బ‌లం లేదు. ఆ పార్టీ నుంచి అక్క‌డ డీకే అరుణ మాత్ర‌మే ఉన్నారు. ఖ‌మ్మం, న‌ల్గొండ‌, రంగారెడ్డి, మెద‌క్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఉమ్మ‌డి జిల్లాల్లో బీజేపీకి క‌నీసం కార్య‌క‌ర్త‌ల బలం కూడా లేదని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో బండి సంజ‌య్ ప‌ద‌విని ఈట‌ల రాజేంద‌ర్‌కు క‌ట్ట‌బెట్టేందుకు అధిష్ఠానం ఆలోచిస్తుంద‌నే ఊహాగానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన ఈట‌ల‌కు టీఆర్ఎస్‌లోని నాయ‌కుల‌తో మంచి సంబంధాలున్నాయి. టీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న నేత‌లు, ఉద్య‌మ నాయ‌కులు ఈట‌ల ఆధ్వ‌ర్యంలో బీజేపీలో చేరే అవ‌కాశం ఉంది. అందుకే ఈట‌ల వైపు హైక‌మాండ్ చూస్తుంద‌ని టాక్‌. మ‌రి ఈ ప‌రిస్థితుల‌ను దాటి బండి సంజ‌య్ మ‌ళ్లీ వేగం పెంచుతారా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News