బీజేపీ ఎంత బెట్టు చేస్తే...టీడీపీకి అంత హీటు...?

Update: 2022-03-22 16:30 GMT
బీజేపీ అయినా మరో పార్టీ అయినా రాజకీయాలు అన్నవే ఎవరికైనా మూలాధార సూత్రం. మాట్లాడే ప్రతీ మాట వెనక కూడా ఫక్తు పొలిటికల్ ట్యూన్ ఉంటుంది. ఊరక రారు మహానుభావులు అన్నట్లుగా ఊరకే ఒక్క మాట కూడా పొలిటీషియన్ నోటి వెంట రానే రాదు. ఇక ఏపీలో చూసుకుంటే బీజేపీకి ఏం బలముందని ఎవరైనా అనుకోవచ్చు.

కానీ కేంద్రంలో మోడీ బలంగా ఉన్నారు. అక్కడ అమిత్ షా అనే అమిత బలసంపన్నుడు, అపర చాణక్యుడు ఉన్నారు. ఈ ఇద్దరూ కలసి పన్నే వ్యూహాలు ఇంకా పవర్ ఫుల్ గా ఉంటాయి. ఇప్పటికి రెండు సార్లు కేంద్రంలో అధికారాన్ని పట్టేసిన బీజేపీ ముచ్చటగా మూడవసారి కూడా గెలవాలనుకుంటోంది. దానికి తగిన ప్రాతిపదికను కూడా సిద్ధం చేసుకుని ఉంచుకుంది.

ఇప్పటికి ఉన్న పరిస్థితులనే తీసుకుంటే కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం ఖాయమనే అంటున్నారు. అందుకే బీజేపీతో పొత్తులకు ఏపీలోని పార్టీలు అంగలారుస్తున్నాయి. బీజేపీ కేంద్రంలో ఉంటే ఆ పార్టీతో దోస్తీ చేయకుండా ఏపీలో ఎవరు వచ్చినా ప్రభుత్వాన్ని అసలు నడపలేరు. ఇది అందరికీ అర్ధమవుతున్న సత్యం.

ఈ నేపధ్యంలో బీజేపీని రోడ్ మ్యాప్ పవన్ అడిగారు. చంద్రబాబు సైతం బీజేపీ దోస్తీని గట్టిగానే కోరుకుంటున్నారు. మరి దీని మీద బీజేపీ స్టాండ్ ఎలా ఉంది అన్నదే ఇపుడు ఏపీ రాజకీయాలలో ఇంటరెస్టింగ్ మ్యాటర్. బీజేపీ కనుక ఎస్ అంటే టోటల్ గా ఏపీ పాలిటిక్స్ మారిపోతాయి. అలా కాకుండా ఇప్పటిలాగానే జనసేనతోనే మా పొత్తు అంటూంటే మాత్రం అన్ని పార్టీలలోనూ టెన్షన్ పెరిగిపోతోంది.

అయితే బీజేపీ ఇదంతా కావాలనే చేస్తోంది అంటున్నారు. అదెలా అంటే బీజేపీ అవసరం అటు జనసేనకూ ఉంది, ఇటు టీడీపీకి ఉంది. మరో వైపు చూస్తే వైసీపీకి కూడా ఉంది. జనసేన టీడీపీ కూటమిలో బీజేపీ చేరకూడదు అని వైసీపీ అయితే గట్టిగా కోరుకుంటోంది. చేరితే మాత్రం ఏపీలో వైసీపీకి నేరుగా మోడీతోనే యుద్ధం అన్నట్లుగా పరిస్థితి మారుతుంది.

ఇక కేంద్రంలోని బలమైన ప్రభుత్వం అండ టీడీపీ జనసేనకు లభిస్తే 2024 ఎన్నికల్లో ఆ పార్టీలు చెలరేగిపోవడం ఖాయం. అందుకే ఏపీలో బలం తక్కువగా ఉన్నా బీజేపీతో చెలిమికి ఈ రెండు పార్టీలు ఎక్కువ విలువ ఇస్తునాయి. ఇక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున ఫండింగ్ వస్తుంది. అలాంటపుడు కేంద్రంలోని పార్టీ తమతో ఉంటేనే ఏ రకామైన ఇబ్బందులు లేకుండా ఉంటాయని కూడా టీడీపీ లాంటి పార్టీలు ఆలోచిస్తాయి.

ఇక కేంద్రంలోని బీజేపీ జట్టు కూడితే నిధుల సమస్యతో పాటు అధికార సమస్య కూడా తీరిపోతుంది అన్న లెక్కలూ ఉన్నాయి. దాంతోనే బీజేపీతో  పొత్తు కోసం ఈ రెండు పార్టీలూ ఎదురుచూస్తున్నాయి. మరి ఇలాంటి విషయాలు బీజేపీకి కూడా బాగా తెలుసు కదా. అందుకే ఆ పార్టీ ఊరిస్తోంది. ఊ అనకుండా ఉహూ అంటోంది.

మరి బీజేపీకి దీని వల్ల లాభమేంటి అంటే తొందరగా ఊ అనేస్తే  కూటమిలో తమకు ఏ అయిదారు సీట్లో టీడీపీ పెద్దలు ఇచ్చేసి పక్కనా పెడతారు అని కమలనాధులు భావిస్తున్నారు. అలా కాకుండా వీలైనంత కాలం ఊరించి ఊరించి పొత్తులు పెట్టుకుంటే కచ్చితంగా రేపటి రోజున సీట్ల బేరంలో పాతికకు తక్కువ కాకుండా సీట్లు పొందే అవకాశం ఉంటుంది అన్నదే బీజేపీ స్ట్రాటజీ.

కూటమి కిందకు వస్తే  టీడీపీ తరువాత జనసేన పెద్ద పార్టీ. అందువల్ల రెండు పార్టీలు ఎక్కువ సీట్లు తీసుకుని తమకు తక్కువ చేస్తాయన్న బెంగా కలవరం బీజేపీకి ఉన్నాయని అంటున్నారు. ఇలా బెట్టు చేసి కధను సాగదీయడం ద్వారా టీడీపీకి  హైపర్ టెన్షన్ పుట్టించి చివరికి తాము అనుకున్న నంబర్ ని సాధించడమే కమలనాధుల నయా ప్లాన్ అంటున్నారు.

అందుకే కర్నూల్ లో జరిగిన బీజేపీ  భేటీలో పొత్తుల విషయంలో తొందర వద్దు అని కీలక నేతలు భావించారని అంటున్నారు. మొత్తానికి చూస్తే పవన్ అడిగిన రోడ్ మ్యాప్ అయితే ఇప్పట్లో బీజేపీ ఇవ్వదు అని ఏతా వాతా తేలుతున్న అంశం. చూడాలి మరి జరుగుతుందో.
Tags:    

Similar News