వంటనూనెల ధరలు తగ్గుతాయా ?

Update: 2022-03-30 07:31 GMT
మండిపోతున్న వంటనూనెల ధరలు తగ్గుతాయని ఆశించవచ్చా ? కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూస్తుంటే అలాగే ఆశించవచ్చనే అనిపిస్తోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా దాదాపు నెలన్నరగా సన్ ఫ్లవర్ ఆయిల్ తో పాటు ఇతర వంటనూనెల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కొద్దిరోజుల్లోనే నూనెల ధరలు పది, ఇరవై రూపాయల ధరలు పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరి మొదట్లో కిలో వేరుశనగ నూనె ధర 100 రూపాయలుంటే చివరి వారంకు వచ్చేసరికి 120 రూపాయలైపోయింది.

అలాగే మార్చి రెండో వారానికి అదే కిలో ఆయిల్ ధర 135 రూపాయలకు చేరుకుంది. దాంతో మధ్య, దిగువ తరగతి జనాల్లో గగ్గోలు మొదలైపోయింది. జనాల్లో మొదలైన మంటను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రష్యాతో 45 వేల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. మామూలుగా మనకు సన్ ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్ నుండి దిగుమతవుతుంది. అయితే యుద్ధం కారణంగా అక్కడినుండి దిగుమతయ్యే అవకాశం లేకపోవటంతో సన్ ఫ్లవర్ ఆయిల్ ను రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాం.

ఒకవైపు ఉక్రెయిన్ నుండి సన్ ఫ్లవర్ దిగుమతి నిలిచిపోవటం, మరోవైపు ఇండోనేషియా కూడా ఎగుమతులపై పరిమితులు విధించటం, అమెరికా తదితర దేశాల నుండి తెప్పించటం కష్టమైపోయింది. అందుకనే వేరే గత్యంతరం లేక రష్యా నుండే 45 వేల టన్నులు తెప్పిస్తోంది. ఏప్రిల్ లో మొదటి విడతలో 12 వేల టన్నులు అదే నెల చివరికి మరో 20 వేల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతవుతుంది. మిగిలిన 13 వేల టన్నులు మే నెలలో దిగుమతవుతుంది.

యుద్ధానికి ముందు షిప్ మెంటు టన్నుకు 1630 డాలర్లుంటే ఇపుడు 2150 డాలర్లు చెల్లించాల్సొస్తోంది. అంటే దాదాపు నెలరోజుల్లోనే షిప్మెంట్ ఛార్జీలు సుమారు 550 డాలర్లు పెరిగిపోయింది. దీని ప్రభావం వల్లే సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. రష్యా నుండి భారీ దిగుమతుల తర్వాత అయినా దేశంలో వంటనూనెల ధరలు తగ్గుతాయేమో చూడాలి.
Tags:    

Similar News