అవ‌స‌ర‌మైతే ఆ ఎమ్మెల్యేల‌ పై వేటు.. కేసీఆర్‌కు పీకే రిపోర్ట్‌!

Update: 2022-03-26 06:31 GMT
తెలంగాణ‌లో హ్యాట్రిక్ కొట్టాల‌ని సీఎం కేసీఆర్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునే దిశ‌గా సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలోని ప‌రిస్థితులు.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ప‌నితీరు.. ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల అభిప్రాయాలు ఇలా త‌దిత‌ర విష‌యాల‌పై పీకే టీమ్ స‌ర్వేలు చేసింది. ఆ నివేదిక‌ను కేసీఆర్‌కు అందించింది. అయితే అందులో కొన్ని సంచ‌ల‌న విష‌యాల‌ను పీకే సూచించిన‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలో మూడోసారి తెలంగాణ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని, కానీ కొంత‌మంది ఎమ్మెల్యేల‌పై మాత్రం వ్య‌తిరేక‌త ఉంద‌ని పీకే చెప్పార‌ని తెలిసింది.

వాళ్ల‌కు ద‌క్క‌ని ప్రాధాన్యం

పీకే రిపోర్ట్ ఆధారంగానే కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ 30 సీట్ల‌లో స‌ర్వే ఫ‌లితాలు వ‌స్తే అందులో 29 త‌మ‌కే అనుకూలంగా ఉన్నాయ‌ని ఇటీవ‌ల కేసీఆర్ చెప్పారు. అందుకే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ప్ర‌స‌క్తే లేద‌ని కుంబ బ‌ద్ద‌లు కొట్టారు. అయితే మ‌రోవైపు కొన్ని వ‌ర్గాల నుంచి టీఆర్ఎస్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంద‌ని పీకే రిపోర్ట్ చెబుతోంది. మొదటి నుంచి పార్టీ కోస‌మే ప‌ని చేసిన వాళ్ల‌కు గుర్తింపు ద‌క్క‌డం లేద‌నే అభిప్రాయం ఉంద‌ని నివేదిక‌లో తెలిపింది. పార్టీ రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చినా త‌మ‌కు గుర్తింపు ద‌క్క‌డంపై వాళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని స‌మాచారం. ఇక ఇత‌ర పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో చేరిన నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేద‌ని ఇది ఇబ్బందిక‌రంగా మారుతుంద‌ని రిపోర్ట్‌లో పేర్కొన్న‌ట్లు టాక్‌.

ప్ర‌జ‌ల ఆగ్ర‌హం..

స్థానికంగా కొంద‌రు ఎమ్మెల్యేల తీరుపై ప్ర‌జల్లో ఆగ్ర‌హం ఉంద‌ని కేసీఆర్‌కు పీకే చెప్పార‌ని తెలిసింది. అన‌వ‌స‌ర వివాదాల్లో దూర‌డం, సంబంధం లేని వాటిల్లో జోక్యం, కార్య‌క‌ర్త‌ల‌కు గుర్తింపు ద‌క్క‌క‌పోవ‌డం, ఎమ్మెల్యేల కుటుంబ స‌భ్యులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం అందుకు కార‌ణంగా తెలుస్తోంది. మొద‌టి నుంచి పార్టీ కోసం ప‌ని చేస్తున్న క్యాడ‌ర్‌ను కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని టాక్‌. ప్ర‌జ‌ల‌కు ఎమ్మెల్యేలు అందుబాటులో లేక‌పోవ‌డం కూడా వ్య‌తిరేక‌త‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని రిపోర్ట్ చెబుతోంది. ఇలా స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేయ‌లేక‌పోతున్న ఎమ్మెల్యేల జాబితాను సీఎంకు అందించిన‌ట్లు స‌మాచారం. వీళ్ల ప‌నితీరు మార్చుకోవాల‌ని హెచ్చ‌రించ‌ట‌మో లేదా అవ‌స‌ర‌మైతే వాళ్ల‌పై వేటు వేయాల‌ని పీకే సూచించార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు కొంత‌మంది మంత్రులు కూడా ఇప్ప‌టికీ త‌మ శాఖ‌ల‌పై ప‌ట్టు సాధించ‌లేద‌ని స‌మాచారం.

వాళ్ల‌కు చెక్ పెట్టేందుకు..

ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ తాత్సారం చేయ‌డంతో నిరుద్యోగుల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెరిగింది. దీన్ని త‌గ్గించుకునేందుకు ఉద్యోగాల భ‌ర్తీని ఏడాది లోపు పూర్తి చేయాల‌ని పీకే సూచించిన‌ట్లు స‌మాచారం. ఇక జిల్లాలు, జోన్ల విభ‌జ‌న‌తో కొంత‌మంది ఉద్యోగుల్లో ఏర్ప‌డిన అసంతృప్తిని త‌గ్గించేందుకు ప్ర‌మోష‌న్లు, ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను వేగంగా ప‌రిష్క‌రించాల‌ని చెప్పిన‌ట్లు టాక్‌. ఇక బీజేపీకి చెక్ పెట్టేందుకు ముఖ్యంగా సామాజిక మాధ్య‌మాల‌ను విరివిగా ఉప‌యోగించుకోవాల‌ని కేసీఆర్‌కు పీకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. యువ‌త‌ను ఆక‌ట్టుకునేందుకు బీజేపీ గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. అందుకు అడ్డుకట్ట వేయాలంటే త్వ‌ర‌గా ఉద్యోగాల భ‌ర్తీ చేయాల‌ని సూచించిన‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News