కొత్త, పాత‌ల క‌ల‌యిక‌తో కొత్త కేబినెట్‌.. స్ప‌ష్టం చేసిన స‌జ్జ‌ల‌

Update: 2022-04-09 15:30 GMT
సోమ‌వారం ఏర్ప‌డే ఏపీ కొత్త కేబినెట్‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో పాత మంత్రులు ఎవ‌రు ఉంటారు?  ఎవ‌రు కొత్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టి.. కేబినెట్‌లో సీటులోకి వ‌స్తారు? అనే చ‌ర్చ ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై క్లారిటీ లేదు. అయితే.. పాత‌వారిలో న‌లుగురికి చోటు ఉంటుంద‌ని.. కొన్ని రోజులు.. కాదు కాదు.. సీనియ‌ర్ల నుంచి తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో వారికి కూడా అవ‌కాశం క‌ల్పించి.. క‌నీసం 7 నుంచి 10 మంది వ‌ర‌కు పాత నేత‌ల‌కు అవ‌కాశం ఇస్తార‌ని.. మ‌రో చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. అయితే.. ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి దీనిపై ఎలాంటి స్ప‌ష్ట‌తా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. కానీ, చ‌ర్చ‌ల‌కు మాత్రం ఎక్క‌డా ఫుల్ స్టాప్ ప‌డ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో శ‌నివారం దాదాపు 3 గంట‌ల‌కు పైగా ముఖ్యమంత్రి జ‌గ‌న్‌తో కేబినెట్ కూర్పుపై చ‌ర్చించిన స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌రాకృష్నారెడ్డి ఒక కీల‌క విష‌యాన్ని వెల్ల‌డించారు. పాత కొత్త‌ల మేలు క‌ల‌యిక‌తో కొత్త కేబినెట్ ఏర్పాటు చేసేందుకు క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌ని తెలిపారు. దీంతో పాత వారిని తీసుకుంటున్నార‌నేఊహాగానాలు నిజ‌మేన‌ని తేలిపోయింది. అయితే.. ఇక్క‌డ కూడా మ‌రో ట్విస్టు ఉంది. ఎవ‌రెవ‌రెకి చోటు ద‌క్కుతుంద‌నే విష‌యాన్ని స‌జ్జ‌ల కూడా చెప్ప‌లేదు. సోమ‌వారం వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. ఇక‌, ఈ విష‌యంపై స‌జ్జ‌ల ఏమ‌న్నారంటే..

కేబినెట్ కొత్త, పాతల కలయికగా ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు. తద్వారా ఇప్పటివరకూ సాగుతున్న ఊహాగానాలకు ఆయన స్పష్టత ఇచ్చినట్లయింది. అలాగే రేపు మధ్యాహ్నం కల్లా కొత్త మంత్రుల జాబితా వెలువడే అవకాశం ఉందని కూడా సజ్జల తెలిపారు. ఇప్పటికే కేబినెట్ కూర్పు విషయంలో సీఎం జగన్ మరోసారి సామాజిక సమీకరణాల్ని భారీ ఎత్తున వడపోస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కేబినెట్లో ప్రస్తుతం ఉన్న వారిలో రెడ్డి, కాపు సామాజిక వర్గాలకు కొంత కోత పెట్టబోతున్నారని, అలాగే వైశ్య, క్షత్రియ సామాజికవర్గాలకు పూర్తిస్దాయిలో తప్పించబోతున్నట్లు కూడా తెలుస్తోంది.

అలాగే బీసీ మంత్రులైన గుమ్మ‌నూరు జయరాం(బోయ‌), శంకర్ నారాయణ, వేణుగోపాలకృష్ణ(బ‌లిజ‌)కు కొనసాగింపు ఇవ్వబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దాదాపు ఇదే ప్రచారానికి ఊతమిచ్చేలా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయి. ఇదిలావుంటే, కొత్త మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి జగన్‌ తుది కసరస్తు చేస్తున్నారు.   ఈ నెల 11న ఉదయం 11గంటల 31 నిమిషాలకు మంత్రివర్గ ప్రమాణస్వీకారం జరిగే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రానికి అధికారికంగా కొత్త మంత్రులకు లేఖలు వెళ్లవొచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత వ్యక్తిగతంగానూ సీఎంవో అధికారులు ఫోన్లు చేసి సమాచారం ఇవ్వనున్నారు.

పాత కేబినెట్‌లో 8 నుంచి 10 మంది వరకూ కొనసాగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. కుల సమీకరణాలు, కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకుని మిగతా వారిని ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. మంత్రుల ప్రమాణ స్వీకారానికి అతిథులకు అధికారులు ఆహ్వానాలు పంపుతున్నారు. మీరొక్క‌రే రావాల‌ని.. ఆహ్వాన ప‌త్రిక‌ను తీసుకురావాల‌ని.. 12.30 త‌ర్వాత మాత్ర‌మే రావాల‌ని.. ఆహ్వాన ప‌త్రిక‌ల్లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News