అయోధ్య‌ అవుతుందా ? లంక అవుతుందా? లోకేశ్ స్పీక్స్

Update: 2022-04-10 08:30 GMT
అయోధ్య అంటే సుభిక్ష‌మ‌యిన రాజ్యం.. ప్ర‌జ‌ల క‌ష్టం త‌న క‌ష్టం అనుకునే రాజు.. త‌ల్లీ తండ్రీ లాంటి ఇద్ద‌రు రాజ్యానికి..ఒకరు రామ‌య్య తండ్రి మ‌రొక‌రు సీత‌మ్మ త‌ల్లి..ప‌చ్చని సిరులు ఉన్న నేల.. క‌రువు కాట‌కాలు లేని ప్రాంతం.. సంతోషాలు వ‌ర్థిల్లిన రోజులు.. రాజ్యానికి యుద్ధ భ‌యం లేదు..శ‌త్రు భ‌యం లేదు.. ఉన్నా కూడా యోధులైన రామ ల‌క్ష్మ‌ణులను దాటి వారు రాలేరు.
అటువంటి రాజ్యాన్ని మ‌ళ్లీ చూడ‌గ‌ల‌గ‌డం అసాధ్యం. క‌నుక ఇది ముందు చూపు లేని రాజ్యం అని జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి ఈ పండుగ వేళ టీడీపీ విమ‌ర్శిస్తోంది.

ఇవాళ శ్రీ‌రామ న‌వ‌మి..రామ క‌ల్యాణంతో అన్ని వాడ‌లూ అల‌రారుతుంటాయి. ప‌చ్చ‌ని తోర‌ణాలు..మంగ‌ళ వాద్యాల‌తో ఎన్నడూ లేని విధంగా అంగ‌రంగ వైభ‌వంగా క‌ల్యాణం జ‌రిపించి స్వామి వారి ప్ర‌సాదం పంచి, అంతా జై శ్రీ‌రామ్ అని ప‌లికే శుభ‌వేళ. రామయ్య తండ్రి అంటే చ‌క్క‌ని పాల‌కుడు. మంచి తండ్రి.. జ‌న రంజ‌క పాల‌న‌లో ఆయ‌న‌దే ఇవాళ్టికీ అగ్ర స్థానం.ఆడిన మాట త‌ప్ప‌డు. ఇచ్చిన మాట కోసం ఎందాక అయినా వెళ్తాడు. ఒక‌టే బాణం అదే రామ బాణం తిరుగులేని బాణం. అమ్మ సీత‌మ్మ తోడుగా జీవితం.

ఆ రోజు రావ‌ణ సంహారం చేసినా, లేదా ఇత‌ర రాక్ష‌స సంహారం చేసినా ధ‌ర్మాన్ని కాపాడ‌డ‌మే ముఖ్యోద్దేశం. ఆయుధానికి అర్థం వినియోగించే విధానంలో కాదు వినియోగించే సంద‌ర్భంలో ఉంటుంది. ఆ విధంగా ప‌దిత‌ల‌ల రావ‌ణుడ్నీ చంపి లోకానికి శుభాలు చేకూర్చిన రామ‌య్య పండుగ ఇవాళ. శ్రీ‌రామ న‌వ‌మి ఇవాళ. ఈవేళ‌ను ఉద్దేశించి యువ నాయ‌కులు లోకేశ్ ఏమ‌న్నారంటే...

పాలకుడికి అహంకారం ఉంటే రాజ్యం ఎలా దహించుకు పోతుందో చెప్పడానికి ఆనాటి లంక ఉదాహరణ. అలాగే పాలకులకి ముందుచూపు లేకపోతే ఆ రాజ్యంలో రావణ కాష్టం ఎప్పుడైనా రగులుకోవచ్చని అని చెప్పడానికి నేటి లంక ఉదాహరణ. ఏపీని లంకలా కానివ్వకుండా అయోధ్య‌లా చూసుకుందాం. రామరాజ్యాన్ని తిరిగి తెచ్చుకుందాం. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని ఓ సందేశం రాశారు.

ముందు చూపు లేకనే క‌రెంటు కోత‌లు
ముందు చూపు లేక‌నే ఆర్థిక సంక్షోభాలు
ముందు చూపు లేక‌నే రోడ్డున ప‌డుతున్న యువ‌త
ముందు చూపు లేక‌నే ప‌రిశ్ర‌మ‌ల‌కు వారానికి రెండ్రోజులు ప‌వ‌ర్ ఆఫ్
 
అని కూడా అంటోంది టీడీపీ. అయ్యోధ్య లాంటి రాజ్యం రామ రాజ్యం ..రావాలంటే ముందు పాల‌కులు త‌మ యోగ్య‌త‌ల‌ను మెరుగు పరుచుకోవాలి. మంచి పాల‌న అందించేందుకు ఉన్న ప్ర‌తి ఒక్క అవ‌కాశాన్నీ వినియోగించుకోవాలి. అంతేకాదు మంచి పాల‌నకు ఉచిత పథ‌కాలు అందించ‌డ‌మే మేలిమి మార్గం కాద‌ని కూడా గ్ర‌హించాలి. ఇవేవీ గ్ర‌హించ‌కుండా ఉంటే రాజ్యం రామ రాజ్యం ఎలా అవుతుంది.. అందుకే రాజ్యం రావ‌ణ రాజ్యం కాకూడ‌దు అని కోరుకునేది.
Tags:    

Similar News