పిలిస్తే.. ప్రోటోకాల్ పక్కన పెట్టి ప్రగతిభవన్ వెళ్లేదాన్ని.. తమిళ సై షాకింగ్ వ్యాఖ్యలు

Update: 2022-04-02 04:11 GMT
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సైకు.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య పెరిగిన దూరం గురించి తెలిసిందే. తాను చెప్పినట్లుగా తమ పార్టీ నేతకు ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని.. దానికి సంబంధించిన ఫైల్ మీద రాజముద్ర వేయాలని కోరిన వేళ.. నిబంధనల ప్రకారం ఆ పని చేయలేనన్న తమిళ సై తీరు సీఎం కేసీఆర్ మనసును గాయపరిచిందని చెబుతారు. ఈ ఇద్దరు ముఖ్యుల మధ్య విభేదాలకు బీజం అలా పడితే.. ఆ తర్వాతి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎంతవరకు వచ్చాయన్నది తెలిసిందే.

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా ఆయన మంత్రుల్ని.. ఎమ్మెల్యేల్ని ఆహ్వానించారు. అయినప్పటికీ.. కేసీఆర్ అండ్ కో మాత్రం హాజరుకాలేదు. ఈ సందర్భంగా మాట్లాడిన తమిళ సై.. కేసీఆర్ తీరును ప్రస్తావిస్తూ.. తన తీరు గురించి చెప్పటం ద్వారా.. కేసీఆర్ లో లేనిదేమిటో చెప్పే ప్రయత్నం చేశారు.

తన గురించి తాను చెప్పుకునే క్రమంలో గవర్నర్ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించారని చెప్పాలి. తన గురించి.. తన గొప్పతనం గురించి ఎక్కువ చెబితే.. వెగటు పుడుతుందన్న విషయాన్ని గుర్తించిన ఆమె.. తన ప్రసంగంలో పలు అంశాల్ని చాలా కేర్ ఫుల్ గా ప్రస్తావించినట్లుగా కనిపించక మానదు. గవర్నర్ తమిళ సై చేసిన ప్రసంగంలో కీలకమైన అంశాల్ని.. ఆమె మాటల్లోనే చెబితే..

-  నేను రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించాను. కొందరు వచ్చారు. రానివారి గురించి నేనేమీ చెప్పేది లేదు. నా ఆహ్వానాన్ని గౌరవించనందుకు నేనేమీ బాధపడడం లేదు. ప్రగతిభవన్‌లో ఉగాది కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఉంటే ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి అయినా వెళ్లేదాన్ని.

-  యాదాద్రికి వెళ్లాలని ఉన్నా నన్ను ఆహ్వానించలేదు. నేను వివాదాలను, గ్యాప్‌ను సృష్టించే వ్యక్తిని కాదు. కొన్ని అంశాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి. నేను ఎన్నిసార్లు ఆహ్వానాలు పంపినా పట్టించుకోవడం లేదు. ఇగ్నోర్‌ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ పిలిచాం. కానీ రాలేదు. సమ్మక్క సారలమ్మ జాతరకు ఎవరో పిలుస్తారని ఎదురుచూడకుండా వెళ్లాను. రాష్ట్ర ప్రభుత్వానికి..రాజభవన్‌కు మధ్య దూరం రావటానికి కారణం తెలీదు.

-  నేను గవర్నర్ ను కాను. తెలంగాణ సోదరిని. చాలా ఫ్రెండ్లీ. నవ్వుతున్నంత మాత్రాన బలహీనంగా ఉన్నట్లు కాదు. నేను చాలా శక్తివంతురాలిని. ప్రేమాభిమానాలతో తప్ప నా తలను ఎవరూ వంచలేరు.

-  నేను అహంభావిని కాదు. చురుకైన మహిళను. తెలంగాణ ప్రజలకు చేయి అందించేందుకు ఇక్కడ మీ సోదరి ఉంది. మీకు సాయం చేసేందుకు చేయూతనిస్తా. గత రెండున్నరేళ్లుగా తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు రాజ్ భవన్ ఎంతో చొరవ తీసుకుంది. ఇది ప్రజాభవన్.. తెలంగాణ ప్రజల కోసం రాజ్ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
Tags:    

Similar News