రోజా ఆశ‌లు మ‌రో రూపంలో.. వైసీపీలో చ‌ర్చ‌

Update: 2022-04-10 01:30 GMT
ఆమె ఫైర్ బ్రాండ్‌. వైసీపీ అధినేత‌ను కానీ.. ప్ర‌భుత్వాన్ని కానీ.. ఎవ‌రు విమ‌ర్శించినా.. నోటికి ప‌నిచెప్పే నాయ‌కురాలుగా పేరు తెచ్చుకున్నారు. తీవ్ర విమ‌ర్శ‌లే కాదు.. వివాదాల‌కు కూడా ఆమె కేరాఫ్‌. ఆమే.. జ‌బ‌ర్డ‌స్త్ రోజా. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014, 2019 ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న రోజా.. వైఎస్ జ‌గ‌న్ అంటే.. ప్రాణం పెడ‌తారు. అదేవిధంగా పార్టీలోనూ త‌న కంటూ.. ప్ర‌త్యేకంగా దూకుడు రాజ‌కీయాలు చేస్తార‌నే పేరు తెచ్చుకున్నారు. నేనే ముందు.. నా మాటే ముందు.. అనే టైపులో రాజ‌కీయాలు చేయ‌డం రోజా అంద‌రినీ మించిపోయార‌నే పేరు ఎప్పుడో ఉంది.

ఈ క్ర‌మంలోనే ఆమె స్వ‌పక్షంలోనే విప‌క్షాన్ని పెంచుకున్నార‌న్న విమ‌ర్శ‌లుకూడా ఉన్నాయి. ఇక‌, జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని కోరుకున్న‌.. వైసీపీ అధికారంలోకి రావాల‌ని అభిల‌షించిన నాయ‌కుల్లో రోజా ఒక‌రు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యారు. కానీ, మంత్రి కావాల‌నే ఆమె ఆశ మాత్రం ఇప్ప‌టికీ చిగురించ‌డంలేదు. వాస్త‌వానికి 2019లో వైసీపీ స‌ర్కారు ఏర్ప‌డిన స‌మ‌యంలోనే రోజాకు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని.. ఏకంగా హోం శాఖ‌ను ఆమె చేతుల్లో పెడ‌తారని పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది. అయితే.. అనూహ్యంగా అస‌లు ఆమెకు కేబినెట్‌లోనే చోటు ద‌క్క‌లేదు.

దీంతో ఒకింత అలిగిన ఆమె అప్ప‌టి మంత్రి వ‌ర్గ ఏర్పాటుకు.. అస‌లు హాజ‌రు కాకుండా.. ఆరోగ్యం బాగోలేదంటూ.. త‌ప్పించుకు న్నారు. ఓ వారం త‌ర్వాత‌.. ఆమె తాడేప‌ల్లి రావ‌డం.. జ‌గ‌న్ బుజ్జ‌గించ‌డం.. ఏపీఐఐసీ చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌విని ఇప్పించ‌డం.. వంటివి వెంట వెంట‌నే జ‌రిగిపోయాయి. దీంతో ఒకింత రోజా రౌద్రం త‌గ్గినా.. కేబినెట్ కూర్పుపై మాత్రం ఆశ‌లు స‌న్న‌గిల్ల‌లేదు. దీనికి కార‌ణం.. రెండున్న‌రేళ్ల త‌ర్వాత‌.. మ‌ళ్లీ మార్పు ఉంటుంద‌ని.. స్వ‌యంగా సీఎం జ‌గ‌న్ చెప్ప‌డ‌మే. అందుకే..  ఎప్పుడెప్పుడు రెండున్న‌రేళ్లు పూర్త‌వుతాయా? అని ఆమె ఎదురు. ఇప్పుడు.. స‌మ‌యం రానే వ‌చ్చింది. దీంతో రోజా.. ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.

కానీ, ఎటు చూసినా.. ఆమెకు ఎగ‌స్పార్టీ..కీల‌క మంత్రి పెద్దిరెడ్డి తో వివాదాలు. జిల్లా నేత‌ల‌తో గుర్రు.. వంటి వాటికి తోడు.. ఏకంగా.. రెడ్డి ట్యాగ్ ఆమె ఆశ‌ల‌పై నీళ్లు చిమ్ముతోంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.  వాస్త‌వానికి కొత్త కేబినెట్‌లో బెర్త్ కోసం ఆమె తిర‌గ‌ని గుడి, కొల‌వ‌ని దేవుళ్లు లేరు. విశాఖ స్వామి చెప్పార‌ని.. నాగ పూజ‌లు కూడా చేయించుకున్నారు. ఇంత జ‌రిగినా.. మంత్రి ప‌ద‌వులు ఇచ్చే ప్ర‌త్య‌క్ష దైవం సీఎం జ‌గ‌న్‌ను ప్ర‌స‌న్నం చేసుకునే మార్గం మాత్రం క‌నిపించ‌లేదు. మ‌రోవైపు  సామాజిక స‌మీ క‌ర‌ణ‌ల రీత్యా రోజా రెడ్డి కావ‌డంతో.. మ‌రోసారి ఆమెకు నిరాశే ఎదురుకానుంద‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి.  

అయితే.. రోజాను గుర్తిస్తూ.. జ‌గ‌న్ ఆమెకు.. డిప్యూటీ స్పీక‌ర్ లేదా చీఫ్‌విప్ ప‌ద‌వుల‌ను ఆఫ‌ర్ చేస్తార‌ని.. వైసీపీలో కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల కేబినెట్ కావ‌డంతో ఈ ద‌ఫా మంత్రివ‌ర్గంలో బీసీలు, ఎస్సీ, మైనార్టీల‌కు పెద్ద పీఠ వేయ‌నున్న నేప‌థ్యంలో సొంత సామాజిక వ‌ర్గానికి ప‌ద‌వుల్లో జ‌గ‌న్ కోత విధించ‌నున్నారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఇప్ప‌టికే సంకేతాలు ఇచ్చారు. మొత్తానికి ఫైర్‌బ్రాండ్ ప్ర‌ద‌క్షిణ‌లు కేబినెట్ కాక‌పోయినా.. ఆ మాత్రం గుర్తింపు ఉండే స్థానాలే ద‌క్కుతాయ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News