ఇది తాత్కాలికమే..: ముప్పు ఇంకా తొలిగిపోలేదు!

Update: 2022-03-31 02:30 GMT
రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో యుద్ధం ముగిసినట్లేనని భావిస్తున్నారు. ఉక్రెయిన్ నుంచి రష్యా బలగాలు వెనక్కి తగ్గినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం తగ్గినా ఆ దేశాన్ని పూర్తిగా నమ్మలేమని తెలిపారు.

రష్యా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడితే యుద్ధం కొనసాగుతుందని అన్నారు. ఉక్రెయిన్ ప్రజల ధైర్య సాహసాల వల్లే రష్యా వెనుకడుగు వేసిందని చెప్పారు. ఉక్రెయిన్ ప్రజలు అమాయకులు కాదని, వీళ్లు ఎలాంటి పోరాటాన్నైనా ఎదుర్కొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.

‘నెలరోజులుగా సాగిన యుద్ధం తరువాత రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలతో ముందడుగు పడింది. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలైన కీవ్, ఉత్తర ప్రాంత నగరం చెర్ని హైవ్ సమీపంలో సైనిక కార్యకలాపాలను రష్యా తగ్గించింది. అయితే ఇది ఉక్రెయిన్ సైనికులతో పాటు ప్రజల తిరుగుబాటు వల్లే సాధ్యమైంది. భీకర యుద్ధం జరిగినా ఏమాత్రం భయపడకుండా ఎదురొడ్డి నిలిచారు. అయితే పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదనే చెప్పాలి. ఇప్పటికీ రష్యా విషయంలో నిర్లక్ష్యాన్ని కొనసాగించవద్దు. సవాళ్లు ఎదుర్కోవాల్సిన సమయం ఇంకా ఉంది.

రష్యా మరోసారి మన దేశంపై దాడి కొనసాగించే అవకాశం ఉంది. అందువల్ల ఎప్పటికైనా రష్యా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతిఘటనను మరువకూడదు. గత  ఎనిమిదేళ్లుగా డాన్ బాస్ ప్రాంతంలో యుద్ధంతో పాటు 34 రోజుల రష్యా దురాక్రమణ నుంచి ఉక్రెయిన్ ప్రజలు నేర్చుకున్నారు. ఉక్రెయిన్ ప్రజలు తమ దేశాన్ని నాశనం చేయాలనుకున్న వారిపై తిరుగుబాటు చేస్తారు. తమ దేశ స్వాతంత్ర్యం, సమగ్రతకు ఈ దేశ ప్రజాప్రతినిధులు ఎప్పటికీ రాజీ పడరు’ అని జెలెన్ స్కీ ఉక్రెయిన్ ప్రజలు బావోద్వేగ ప్రసంగం చేశారు.

అటు ఈ చర్చలపై అమెరికా స్పందించింది. ‘ఉక్రెయిన్ రాజధాని కీవ్ సరిహద్దుల నుంచి రష్యా చాలా తక్కువ సంఖ్యలో బలగాలను కదిలిస్తోంది. దీనిని యుద్ధం ఉపసంహరణ అనేదాని కంటే దారి మళ్లించడం అనవచ్చు. అయితే ఉక్రెయిన్లో ప్రాంతాల వారీగా దాడులు జరిగే అవకాశం ఉంది. కీవ్లో ముప్పు ఇంకా తొలిగిపోలేదు.’ అని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ మీడియా సమావేశంలో తెలిపారు. అయితే ఓ వైపు శాంతి చర్చలు జరగుతుండగానే మరోవైపు రష్యాలోని మైకోలీవ్ దాడులను కొనసాగిస్తూనే ఉండడం గమనార్హం.
Tags:    

Similar News