ఎవ‌రీ మ‌ద్దూరి అఖిల‌ప్రియ..బ్రదర్ ఆఫ్ భూమా బ్లాస్ట్

Update: 2022-10-11 02:30 GMT
కర్నూల్ జిల్లాలో ఆ ఫ్యామిలీకి ఎంతో పేరుంది. ఆ ఫ్యామిలీకి ఉన్న పొలిటికల్ గ్లామర్ అలాంటిది. . భూమా నాగిరెడ్డి అంటే కర్నూల్ జిల్లాలో వచ్చే పొలిటికల్ వైబ్రేషన్స్ వేరుగా ఉంటాయి. అలాంటి నాగిరెడ్డి మరణించాక ఆయన కుమార్తె అఖిల ప్రియా భూమా ఇంటి పేరుతోనే మంత్రి అయ్యారు. తండ్రికి దక్కాల్సిన పదవి అలా ఆమెకు వారసత్వంగా దక్కింది. ఇక మళ్లీ ఆమె ఎన్నికల్లో గెలవాలీ అనుకుంటోంది. అంటే కచ్చితంగా భూమా ఫ్యామిలీ పేరునే వాడాలి.

అలాంటి భూమా అఖిలప్రియ అంటే అందరికీ తెలుసు. కానీ మద్దూరి అఖిలప్రియ ఎవరు అంటున్నారు భూమా నాగిరెడ్డి అన్న భాస్కరరెడ్డి కొడుకు భూమా కిశోర్ రెడ్డి. మద్దూరి అఖిలప్రియ భూమా నాగిరెడ్డి పరువు తీస్తోంది అని కూడా ఘాటైన పదజాలం గుప్పించారు. అఖిలప్రియ భర్త ఇంటి పేరు మద్దూరి అని ఆయన ఆ విధంగా సంభోదిస్తూ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఈయన ఆళ్ళగడ్డ బీజేపీ ఇంచార్జి. లేటెస్ట్ గా మీడియా ముందుకు వచ్చిన కిశోర్ రెడ్డి అయితే చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. ఒక విధంగా అఖిలప్రియ మీద బ్లాస్ట్ అయ్యారనే చెప్పాలి.

భూమా నాగిరెడ్డి శోభానాగిరెడ్డి ఆస్తులను 2011లోనే అమ్మేశారంటూ  కోర్టులో కేసు వేయడమేంటి అని ఆయన మండిపడ్డారు. ఆ టైమ్ లో రాజకీయాల్లో పులిలా ఉన్న నాగిరెడ్డి ఆస్తులను ఎవరో గుంటూరు నుంచి వచ్చిన వారు కొనేటంత దమ్ము ఉందా అని కిశోర్ రెడ్డి ప్రశ్నించారు. ఇదంతా ఫేక్ అని భూమా అఖిలప్రియ ఆఖరుకు తన తల్లిదండ్రుల ఆస్తులను కూడా తీసుకోవడానికి ఇలా చేస్తున్నారని కిశోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విధంగా చేయడం వల్ల భూమా ఫ్యామిలీ పరువు తీశారని, ఆయన్ని  బజార్లో పెట్టారని ఆయన ఫైర్ అయ్యారు. భూమా నాగిరెడ్డి కూతురు కాకపోతే అఖిలప్రియ వార్డు మెంబర్ అయినా గెలిచేదా అని ఆయన ప్రశ్నించారు.

తల్లిదండ్రుల పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తూ ఆళ్లగడ్డలో దౌర్జన్యాలు చేస్తూ హైద‌రాబాద్‌లో కిడ్నాప్‌లు కూడా చేస్తూ చివరికి చనిపోయిన వారిని కూడా వదల‌కుండా ఇలా  చేయడం కంటే దారుణం ఉందా అని ఆయన నిగ్గదీశారు.

భూమా కుమారుడు విఖ్యాత్ రెడ్డి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. కనీసం తన తల్లిదండ్రులకు జరుగుతున్న అవమానం మీద స్పందించకపోవడమేంటని నిలదీశారు. భూమా నాగిరెడ్డి ఏనాడు ఆస్తులు అమ్ముకోలేదని,  అంతా ఫేక్ అని అసలైన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని కిశోర్ రెడ్డి చెప్పారు. వాటిని బయటపెట్టి అసలు కధ ఏంటొ తేలుస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే భూమా అనుచరులు అసలు విషయం తెలుకుంటే బట్టలూ ఊడదీసి కొడతారు అని కూడా వార్నింగ్ ఇచ్చారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News