కిషన్ రెడ్డికి  కొత్త ఆశ... ఢిల్లీ టూ అంబర్ పేట

Update: 2022-12-15 02:30 GMT
కేంద్ర మంత్రి జి  కిషన్  రెడ్డిది బీజేపీలో నాలుగు దసాబ్దల పై చిలుకు బంధం. ఆయన ఏబీవీపీ కార్యకర్త నుంచి బీజేపీలో పనిచేస్తూ వచ్చారు. ఆ తరువాత బీజేవైఎం లో నాయకుడిగా ఎదిగారు. అటు నుంచి బీజేపీలో చేరి అనేక పదవులు చేపట్టారు. ఉమ్మడి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆయన అంబర్ పేట నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2018లో మాత్రం కేవలం వేయి ఓట్ల తేడాతో ఓడారు. అది ఆయన మంచికే జరిగింది అని ఆరు నెలల తరువాత వచ్చిన లోక్ సభ ఎన్నికలతో రుజువు అయింది.

ఆయన సికింద్రాబాద్ ఎంపీ సీటుకు పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. ఆ వెంటనే మోడీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రి అయ్యారు. ఆ మధ్యనే ఆయన క్యాబినెట్ ర్యాంక్ ని పొందారు. ఒక విధంగా ఆయన పదవి బాగుంది. ఆయన రాజకీయం కూడా సాఫీగా సాగుతోంది. కానీ తెలంగాణా మీద కన్నేసిన బీజేపీ తొందరలో కీలకమైన మాపులు చేయబోతోంది అని అంటున్నారు. కేవలం ఏడాది వ్యవధికి వచ్చిన తెలంగాణా ఎన్నికల్లో కిషన్ రెడ్డిని బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా చూపించేందుకు వ్యూహరచన చేస్తున్నారు అని అంటున్నారు.

పైగా తెలంగాణాలో ఉన్న బలమైన రెడ్డి సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడానికి కిషన్ రెడ్డిని ట్రంప్ కార్డ్ గా వాడుకోవాలని చూస్తున్నారుట. ఇక బీజేపీ గతం కంటే ఇపుడు బాగానే ఎదిగింది. బీజేపీ గ్రాఫ్ బాగుంది. అయితే వివిధ సామాజిక వర్గాలను తమ వైపునకు తిప్పుకునే విషయంలో బీజేపీ ఇపుడు కొత్త ఆలోచనలు చేస్తోంది. బీసీగా ఉన్న బండి సంజయ్ కి పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఆయన రెండేళ్ళుగా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇపుడు రాజ్యసభ మెంబర్ గా డాక్టర్ లక్ష్మణ్ ని చేశారు. అలాగే బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఆయన్ని తీసుకున్నారు.

తొందరలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ చేసి ఆయన్ని కిషన్ రెడ్డి స్థానంలో తీసుకోవాలని బీజేపీ ఆలోచిస్తోందిట. కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి బాధ్యతల నుంచి తప్పించి పూర్తిగా తెలంగాణా రాజకీయాల్లోని ఉంచేలా చేయడానికి చూస్తోందిట. అలా బీసీ కేంద్ర మంత్రి అటు రెడ్డి ప్రెసిడెంట్ ఇటూ అన్నట్లుగా తెలంగాణాలో కొత్త సామాజిక సమీకరణలను తీసుకురావాలని చూస్తోందిట.  కాంగ్రెస్ లో రెడ్లు ఉన్నారు. అయితే పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న వారిని ఈ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారుట.

ఇక కిషన్ రెడ్డి గతంలోనే బీజేపీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆయన సేవలను పూర్తిగా తెలంగాణాకు వాడితే మంచి ఫలితం ఉంటుందని బీజేపీ భావిస్తోందిట. అలాగే కిషన్ రెడ్డి సొంత సీటు అంబర్ పేట నుంచి మళ్లీ ఆయన్ని పోటీకి దించి ఆ సీటుతో పాటు చుట్టుపక్కల సీట్లను దక్కించుకోవాలని చూస్తోందిట.

అదే విధంగా బీజేపీ అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డి సీఎం అన్నది అటు జనంలోనూ ఇటు బలమైన సామాజికవర్గంలోనూ వెళ్లేలా చూడాలని తద్వారా గత రెండు ఎన్నికలలోనూ తెలంగాణా రాజకీయాల్లో కీలకమైన పాత్ర లేకుండా ఉన్న రెడ్లను తమ వైపునకు తిప్పుకోవాలని చూస్తున్నారుట. మరి ఈ పాలిట్రిక్స్ ఎంతమేరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి ఏణ్ణర్ధం ముందే గండం వచ్చిపడింది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News