కాంగ్రెస్ దారుణ పరిస్థితి.. 110 ఏళ్ల చరిత్రలో తొలిసారి అలాంటి దుస్థితి

Update: 2022-07-07 03:02 GMT
ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ కు ఇప్పుడున్న పరిస్థితి ఎదురవుతుందన్న విషయాన్ని ఎవరూ ఊహించి ఉండరేమో? పార్టీకి సారథ్యం వహించే వారు సమర్థులు కాకుంటే పరిస్థితి ఇలానే ఉంటుందన్న భావన కలిగేలా కాంగ్రెస్ అధినాయకత్వ పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబ చట్రంలో చిక్కుకుపోవటం.. మారిన కాలానికి.. రాజకీయానికి తగ్గట్లుగా మారకపోవటం.. ఆ పార్టీ చేసిన పెద్ద తప్పుగా చెప్పాలి. అందుకు మూల్యంగా తాజాగా మరో దారుణ పరిస్థితి ఎదురైంది.

రోజులు గడిచే కొద్దీ దేశంలో బీజేపీ ప్రాతినిథ్యం అంతకంతకూ పెరుగుతుంటే.. అందుకు భిన్నంగా కాంగ్రెస్ పరిస్థితి అంతకంతకూ తీసికట్టుగా మారుతోంది. తన ప్రాభవాన్ని కోల్పోతున్న ఆ పార్టీకి తాజాగా మరో షాకింగ్ పరిణామం ఎదురైంది.

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లోని శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ తొలిసారి తన  ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. 1887లో ఉత్తరప్రదేశ్ శాసనమండలి ఏర్పడింది. 1909లో మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ తరఫున తొలి ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు.

దీంతో 110 ఏళ్ల యూపీ కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి.. శాసన మండలిలో కాంగ్రెస్ ప్రాతినిథ్యం లేని మొదటి సందర్భం చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఆ పార్టీ తరఫున ఒక సభ్యుడు (దీపక్ సింగ్) ఉండగా.. తాజాగా ఆయన పదవీ కాలం ముగిసింది.

దీంతో.. యూపీ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తాజాగా 12 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియగా.. వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దీపక్ ఒకరు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలు ఉండగా.. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. దీంతో.. యూపీ మండలిలో కాంగ్రెస్ పార్టీ తరఫు ప్రాతినిధ్యం వహించే ఛాన్సు మిస్ అయ్యింది. ఎలాంటి పార్టీ ఎలా తయారైందో  కదూ?
Tags:    

Similar News