జీవితకాలం పదవులు అనుభవించి కాంగ్రెస్ ఊపిరి తీస్తున్నారు

Update: 2022-09-28 13:30 GMT
పదవీ దాహం తీరనిది. అది ఏడారిలో కూడా ఎండవావిని వెతుక్కుంటుంది. ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాటంచేసిన శతాధిక వృద్ధ పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీ ఈ దేశాన్ని అనేక దశాబ్దాలు ఏలింది. కాంగ్రెస్ లో ఎందరో సీనియర్లు ఉన్నారు. ఎన్నో పదవులు అనుభవించారు. నిజానికి వారు పార్టీకి ఏమిచ్చారు అన్నది పక్కన పెడితే వారు కాంగ్రెస్ వల్ల ఎంతో లబ్ది పొందారు. కొన్ని తరాల నాయకులను తయారు చేసిన పార్టీ కాంగ్రెస్.

ఇపుడు ఆ పార్టీ కష్టాలలో ఉంది. అలాంటి సమయంలో తనను పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలన్న ఆలోచన సీనియర్ నేతలకు కలగకపోవడం హస్తం పార్టీ చేసుకున్న ప్రారబ్ధంగా చూడాలి. అయిదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ లో ఉంటూ ఆ పార్టీ పదవులు అనుభవిస్తూ ఎన్నో సార్లు అధికార దర్జా అనుభవించిన గులాం నబీ ఆజాద్ ఈ మధ్యనే కాంగ్రెస్ ని నానా మాటలు అంటూ వీడిపోయారు. ఆయన కొత్తగా పార్టీ పెట్టి జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ మద్దతుతో కొన్ని సీట్లు సాధిస్తానని ధీమా పడుతున్నారు.

ఇక పార్టీలో ఉన్న వారు అయినా సరిగ్గా ఉన్నారా అంటే లేనే లేదు అంటున్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కి ఎంతటి పదవీదాహం ఉందో తాజా పరిణామాలతో  రుజువు అయింది. ఆయన‌ 1998 నుంచి 2003 వరకూ, అలాగే 2003 నుంచి 2013 దాకా మరోసారి పదేళ్ల పాటు రాజస్థాన్ సీఎం గా పనిచేశారు. ఇక 2018 నుంచి ఈ రోజు దాకా మూడవసారి అధికారంలో ఆయనే ఉన్నారు. ఇది కాక కేంద్రంలో ఇందిరాగాంధీ నుంచి రాజీవ్, పీవీ వరకూ ఇలా అనేక మంది మంత్రివర్గాలలో కేంద్ర మంత్రిగా పదవులు చేశారు.

పార్టీలో కూడా అనేక హోదాలను అనుభవించారు. ఇక్కడ ఒక ముచ్చట చెప్పుకోవాలి. 2018లో రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం యువ నేత సచిన్ పైలెట్. ఆయన చరిష్మా మూలంగా పార్టీ గెలిస్తే సీనియర్ కదా అని అశోక్ ని సోనియా గాంధీ రాహుల్ గాంధీ నియమించారు. సచిన్ ని సముదాయించి పక్కన ఉంచారు. ఒక దశలో అశోక్ గెహ్లాట్ వల్ల సచిన్ బీజేపీ వైపు వెళ్ళిపోవాలనుకున్నా ఆపి ఉంచారు.

ఇదంతా చేసింది అశోక్ గెహ్లాట్ పదవిని కొనసాగించడం కోసమే. ఇపుడు కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా ఆయన్ని నియమించాలనుకున్నారు. నమ్మిన బంటుగా భావించారు. కానీ చివరికి అశోక్ గెహ్లాట్ తన అసలు స్వరూపం చూపించారు అని అంటున్నారు. ఆయన తన చీఫ్ మినిస్టర్ పదవి కోసం ఎంతకైనా తెగిస్తారు అనేలా తాజా పోకడలు ఉన్నాయి. 92 మంది ఎమ్మెల్యేలను తన వర్గం వారిని రాజీనామా చేయించడం ద్వారా ఆయన రాజస్థాన్ లో సంక్షోభానికి కారణం అవుతున్నారు.

పార్టీ పోయినా ఫర్వాలేదు కానీ సచిన్ కి మాత్రం పదవి దక్కరాదు అన్న పంతంతో అశోక్ గెహ్లాట్ చేస్తున్న రాజకీయం కాంగ్రెస్ పెద్దలకు చికాకు తెప్పించడమే కాక షాక్ తినిపించింది. దేశమంతా ఇది చూసి కాంగ్రెస్ వృద్ధ నేతలో ఇంతటి పదవీ దాహమా అని విస్తుపోయింది. ఇదిలా ఉంటే గాంధీలు తమ చేతిలో ఉన్న అత్యుత్త‌మ పదవి అయిన అధ్యక్ష స్థానాన్నే ఇచ్చి గౌరవించాలనుకుంటే అత్యాశపడీన్ అశోక్ గెహ్లాట్ తాను అర్హుడిని కాను అని నిరూపించుకున్నారు అంతే కాదు తన పదవీ దాహాన్ని కూడా చూపించుకున్నారు అని అంటున్నారు. ఇక అక్కడ బీజేపీ పావులు కదుపుతూ మరో ముప్పయి మంది ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు అశోక్ గెహ్లాట్ ఆస్కారం కల్పించారు. అలా రాజస్థాన్ లో కాంగ్రెస్ సమూల నాశనానికి పెద్దాయన కంకణం కట్టుకున్నరని తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

ఇక తెలంగాణాలో చూసుకుంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పదవులు ఇచ్చి ప్రోత్సహించింది. ఇపుడు అందులో ఒక బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి జంప్ అయి తనను పెంచిన కాంగ్రెస్ ఉసురు తీయడానికి చూస్తున్నారు అని అంటున్నారు. ఇలా కాంగ్రెస్ లో ఉంటూ పదవులు అనుభవిస్తూ తీరా సరైన సమయంలో హ్యాండ్ ఇస్తున్న వృద్ధులను పదవీ దాహం తప్ప కృతజ్ఞత లేని వారిని పక్కన పెట్టాలని అంతా కోరుతున్నారు.

వృద్ధ నాయకత్వాన్ని సమూలంగా దూరం చేసి పార్టీలో యువతరాన్ని ప్రోత్సహించాలని కూడా అంటున్నారు. కాంగ్రెస్ వంటి తల్లిని మోసం చేస్న వారు విశ్వాసఘాతకులుగా కూడా ఆ పార్టీ వారే కాదు, రాజకీయం తెలిసిన  వారు అంతా కూడా నిందిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News