రాహుల్ ది ఆఖరి పోరాటమేనా ?

Update: 2022-09-08 14:41 GMT
దేశవ్యాప్తంగా దాదాపు నేలమట్టమైపోయిన పార్టీని తిరిగి పునరుత్తేజం చేయాలంటే ఏమిచేయాలి ? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి ఇపుడు అదే చేస్తున్నారు. అదే తాజాగా తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన  భారత్ జోడో యాత్ర. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సుమారు 3500 కిలోమీటర్ల పాదయాత్రను రాహుల్ బుధవారం ప్రారంభించారు. దాదాపు 122 పార్లమెంటు నియోజకవర్గాల మీదుగా రాహుల్ యాత్ర సాగుతుంది.

అంతా బాగానేఉంది కానీ అసలీ యాత్రకు రాహుల్ ఎందుకు దిగారు ? ఎందుకంటే చత్తీస్ ఘడ్, రాజస్ధాన్లో తప్ప ఇంకే రాష్ట్రంలోను కాంగ్రెస్ అధికారంలో లేదు. పార్లమెంటులో కూడా కేవలం 59 స్ధానాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఇదే పరిస్ధితి కంటిన్యు అయితే ఒకపుడు దేశంలో కాంగ్రెస్ అనే పార్టీ ఉండేదని జనాలు చరిత్ర పాఠాల్లో చదువుకునేందుకు మాత్రమే మిగిలిపోతుంది. ఆ పరిస్దితులు రాకూడదనే రాహుల్ తెగించి భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు.

దేశవ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన మొదటినేతగా రాహుల్ జనాలకు గుర్తుండిపోతారు. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు జవసత్వాలు నింపడంలో భాగంగానే పాదయాత్ర మొదలైంది. జనాలు కాంగ్రెస్ కు ఓట్లేయటానికి రెడీగానే ఉన్నా నేతలకే ఓట్లు వేయించుకునే ఉద్దేశ్యంలేదు. ఎందుకంటే నేతలమధ్య అధికారంలో ఉంటే ఒకరకమైన గొడవలు, ప్రతిపక్షంలో ఉంటే మరోరకమైన గొడవలు. దాంతో జనాలకు కాంగ్రెస్ అంటేనే చీత్కారం మొదలైంది.

ఇదే సమయంలో దేశవ్యాప్తంగా బీసీలందరినీ పోలరైజ్ చేస్తున్నట్లు 2014లో బీజేపీ బిల్డప్ ఇచ్చింది. అప్పటికే కాంగ్రెస్ మీద ఏహ్యభావం పెంచుకున్న జనాలు బీజేపీకి పట్టంగట్టారు. ఎనిమిదిన్నరేళ్ళ పాలనలో నరేంద్రమోడీ అంటే జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయినా జనాలకు ప్రత్యామ్నాయం కనబడటంలేదు.

అందుకనే కేంద్రంలో కానీ ఆయా రాష్ట్రాల్లో కానీ జనాలు కాంగ్రెసేతర పార్టీలకు ముఖ్యంగా ప్రాంతీయపార్టీలకు పట్టంకడుతున్నది. ఈ పరిస్ధితిని మార్చి జనాలందరినీ మళ్ళీ కాంగ్రెస్ వైపుకు తీసుకొచ్చేందుకే రాహుల్ పాదయాత్ర మొదలుపెట్టారు. అంటే ఒకరకంగా ఆఖరిపోరాటమనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో పార్టీ పుంజుకోకపోతే కాంగ్రెస్ పని గోవిందా అనే చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News