సర్వం కాషాయమయం : ఎర్రన్నలు ఏమవ్వాలి...?

Update: 2022-07-15 02:30 GMT
దేశంలో విభిన్నమైన పంధాలో కామ్రేడ్స్ ముందుకు సాగుతూంటారు. వారు పోరాటాలలో అగ్రభాగాన పేదలు ఉంటారు. బడుగుల కష్టాల మీద గట్టిగా ఫోకస్ పెడతారు, కర్షకులు, కార్మికుల గోడు వారే పట్టించుకుంటారు. పెత్తందార్లు, బూర్జువా శక్తుల మీద అలుపెరగని పోరాటం చేస్తారు. అయితే వారికి అధికారం అందని పండే అవుతోంది. దానికి కారణం ఈ దేశంలో గెలుపు గుర్రాలకే ఎపుడూ ఓట్లు పడతాయి.

అలా కామ్రేడ్స్ తాము ఏలే వాళ్ళను నిలదీసే వాళ్ళమే తప్ప ఏలికలను కాలేమని తామే చెప్పుకున్నారా లేక జనాలు అలా భావనకు వచ్చారా తెలియదు కానీ కామ్రేడ్స్ మాత్రం విలక్షణమైన ప్రతిపక్ష పాత్రకే పరిమితం అయ్యారు. ఇక దేశంలో వామపక్షాల హవా అరవై దశకంలో మొదలై 70, 80లలో ఉధృతంగా సాగింది. 90ల నాటికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పులు ఆర్ధిక సంస్కరణల వల్ల కామ్రేడ్స్ బాగా తగ్గిపోవాల్సి వచ్చింది.

అదే విధంగా చూస్తే పోరాటాల కంటే ఆరాటాలు ఎక్కువ అయిన తరం కొత్తగా బయల్దేరిన వేళ ఉద్యమాలకు నీళ్ళు చల్లే పరిస్థితులు ఎదురయ్యాయి. ఇక కామ్రేడ్స్ యూపీయే హయాంలో అంటే 2004 నుంచి 2008 దాకా కొంత అధికార వెలుగు వెలిగారు. దాని కంటే ముందు 1996లో  వారు ఒక చారిత్రాత్మకమైన తప్పు చేయడం వల్ల పశ్చిమ బెంగాల్ ని అప్రతిహతంగా ఏలిన జ్యోతీ బాస్ దేశానికి ప్రధాని అయ్యే అవకాశాన్ని కోల్పోయారు.

నాడే కనుక తొలి కమ్యూనిస్ట్ పాలన ఏంటో దేశం చూసి ఉంటే తరువాత కూడా ఆ నమూనాతో వారు మరింతగా విస్తరించేవారు. ఈ రోజుకు ఇంతకంటే ఎక్కువగా బలపడేవారు. ఇక ఈ రోజు చూస్తే  దేశంలో వేగంగా కాంగ్రెస్ క్షీణిస్తోంది. అదే టైమ్ లో జాతీయ పార్టీలు అయిన సీపీఐ సీపీఎం కూడా తగ్గిపోతున్నాయి. ప్రాంతీయ పార్టీలు పెరుగుతున్నాయి. అవి కూడా వ్యక్తిగత కుటుంబ పార్టీలుగా మారుతున్నాయి.

ఈ పార్టీలు నయానో భయానో బీజేపీ వైపుగా చేరుతున్నాయి. ఒకనాడు దేశంలో తృతీయ ఆల్టర్నేషన్ అంటే గట్టిగా వినిపించే పేరు కామ్రేడ్స్. ఇపుడు అలాంటి పరిస్థితి లేదు. ఎర్ర కోటగా చెప్పుకునే పశ్చిన బెంగాల్ లో ఉనికి పోయింది. కేరళ ఒక్కటే ఈ రోజు ఆశాకిరణంగా ఉంది.

ఇక నార్త్ సైట్ అంతా కాషాయం కమ్ముకుంటోంది. మధ్యలో కాంగ్రెస్ కొంత ఉన్నా ధాటీగా ఏమీ లేదు. బీహార్, మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీలలో ప్రాంతీయ పార్టీల హవా కొంత ఉన్నా బీజేపీని ఐక్యంగా ఎదుర్కొనే సీన్ అయితే లేదు. ఇక సౌత్ లో చూసుకుంటే ఉమ్మడి ఏపీ రెండుగా చీలింది. దాంతో ప్రాంతీయంగా కొత్త పార్టీలు పుట్టుకువస్తున్నాయి.

కామ్రేడ్స్ ని తమ అవసరాలకు వాడుకునే సీన్ తప్ప వారి చరిత్ర, ప్రజా క్షేత్రంలో పోరాటాలలో వారి అవసరం అన్నది గుర్తించే పార్టీలు లేవనే చెప్పాలి. దాంతో వారు కూడా కొంత తగ్గి, మరికొంత రాజీపడి సాగుతున్నారు. పొత్తులతో అయినా చట్ట సభలకు వెళ్ళి తమ వాణిని వినిపించాలనుకుంటున్నారు. ఇక చూస్తే ఉమ్మడి ఏపీలో 2009లో మహాకూటమి కట్టిన చంద్రబాబు 2014 నాటికి బీజేపీతో జతకట్టారు. 2019 నాటికి జనసేన కామ్రెడ్స్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా లాభం లేకపోయింది.

ఆ మీదట జనసేన వెళ్ళి బీజేపీతో కలసింది. ఇక 2018లో బీజేపీని తిట్టి తెగదెంపులు చేసుకున్న టీడీపీ తాజాగా రాష్ట్రపతి ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్ధిని బలపరచి చేరువ కావాలని చూస్తోంది. దాంతో ఏపీలో కామ్రేడ్స్ కి టీడీపీతో పొత్తు ఆశలు గల్లంతు అవుతున్నాయి.

దీని మీద సీపీఎం అగ్ర నేత బీవీ రాఘవులు ఒకింత బాధగానే కామెంట్స్ చేశారు. ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరీ బీజేపీకి అధికార విపక్షాలు రెండూ మద్దతు ఇవ్వడం దారుణం అని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ఇదే రకమైన ధోరణితో ముందుకు ఆయా పార్టీలు సాగుతాయి. అంతా కాషాయమయం అవుతున్నా వేళ ఎర్రన్నలకు చోటు ఎక్కడ అంటే జవాబు చెప్పడం కష్టమే. పొత్తుల పేరిట పిలిచే పార్టీలు వారితో జట్టు కుదుర్చుకునే పార్టీలు కూడా తెలుగు రాష్ట్రాలలో కనిపించడం లేదు అంటే ఆలోచించాల్సిందే.
Tags:    

Similar News