పవన్ డిప్యూటీకే తొలి ప్రసాదం!

Update: 2022-09-11 01:30 GMT
జనసేన ఎన్నికల కోసం తన వంతుగా సమాయత్తమవుతోంది. పొత్తుల మాటలు ఈ మధ్య బొత్తిగా  మానేసింది. తాను చేయాల్సింది ఏదో చేసుకుని పోతోంది. అదే టైమ్ లో పవన్ కూడా జనాల్లోకి వచ్చేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఆ పార్టీ వచ్చే ఎన్నికల కోసం టికెట్లను ఎవరికి ఇవ్వాలన్నది ఇంకా ఆలోచిస్తోంది. అయితే పవన్ తరువాత నంబర్ టూ ప్లేస్ లో ఉన్న నాదెండ్ల మనోహర్ టికెట్ కన్ ఫర్మ్ అయిపోయింది అంటున్నారు. నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.

ఆయన 2004, 2009 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి నుంచి గెలిచి డిప్యూటీ స్పీకర్ గానూ తరువాత  స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు. 2019లో ఆయన అదే ప్లేస్ నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే పవన్ పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న నాదెండ్ల తొలి ప్రసాదం తానే తీసుకుంటున్నారు. ఏ పోటీ లేని తెనాలి సీటుకు తానే క్యాండిడేట్ ని అని ఆయన చెప్పేసుకున్నారు. ఆ విధంగా జనసేన నుంచి ఫస్ట్ టికెట్ అందుకున్న వారిగా నిలిచారు.

నాదెండ్ల మనోహర్  తెనాలి నియోజ‌క‌వ‌ర్గంలో తాజాగా పర్యటించారు. తెనాలి  ప‌రిధిలోని కొల్లిప‌ర‌, అత్తోటలో మ‌నోహ‌ర్  జనాలను కలుస్తూ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నాను, గెలిపించాలని కోరుతూ వచ్చారు. తెనాలికి తాను చాలానే చేశానని ఆయన చెప్పుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నపుడు  650 కోట్ల‌ రూపాయలతో అభివృద్ధి ప‌నులు చేసిన‌ట్లుగా మనొహార్  తెలిపారు. ఇక అక్కడి మార్కెట్ యార్డు నిర్వ‌హించేందుకు కొల్లిప‌ర రైతుల‌ను కూడా భాగ‌స్వాములను చేశానని చెప్పుకున్నారు. ఇక  కృష్ణా న‌దిలో 350 కోట్ల రూపాయల వ్య‌యంతో చెక్ డ్యాం నిర్మించేందుకు అంచ‌నాలు రూపొందించామ‌ని పేర్కొన్నారు.

ఇక మరోసారి తనకు ఎమ్మెల్యేగా  అవ‌కాశ‌మిస్తే రైతుల క‌ల‌ను నెర‌వేరుస్తాన‌ని నాదెండ్ల భారీ హామీ ఇచ్చేశారు. ఇక తెనాలి వాసుల దయ తన ప్రాప్తం అన్నట్లుగా ఆయన ప్రచారంలోకి దిగిపోయారు. ఇక నాదెండ్ల మనోహర్ 2019 ఎన్నికల్లో తెనాలిలో పోటీ చేస్తే మూడవ స్థానం దక్కింది. ప్రస్తుతం అక్కడ నుంచి అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన బలమైన క్యాండిడేట్. ఇక టీడీపీలో చూస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గట్టి అభ్యర్ధి. గతంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.

ఈ ఇద్దరు నేతలను దాటుకుని మనోహర్ 2024లో గెలవగలరా అంటే ఆలోచించాలి. అయితే పొత్తు కుదిరితే మాత్రం ఆయన విజయం మీద ఆశలు ఉంటాయి. కానీ ఆలపాటి బాబుకు అత్యంత సన్నిహితుడు. పైగా టీడీపీకి కావాల్సి వారు. ఆయన్ని కాదని సీటు దక్కుతుంది అనుకోవడం కూడా కష్టమే. మొత్తానికి పవన్ డిప్యూటీకి తెనాలి నోరురిస్తోంది. జనసేన వేవ్ ఉంటే చంద్రబాబుతో పొత్తు ఉండి ఆలపాటి ఆలోచిస్తే తెనాలి  ఎమ్మెల్యే అయ్యేది నాదెండ్లే. చూడాలి 2004లో గెలిచిన నాదెండ్ల 2024లో మళ్ళీ అసెంబ్లీకి వస్తారా లేదా అన్నది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News