ఆ వైసీపీ ఎంపీ ఎక్కడ.. నియోజకవర్గంలో తీవ్ర చర్చ!

Update: 2022-12-26 13:39 GMT
గత ఎన్నికల్లో అమలాపురం నుంచి వైసీపీ ఎంపీగా చింతా అనురాధ గెలుపొందారు. ఓవైపు టీడీపీ, మరోవైపు జనసేన అభ్యర్థుల నుంచి గట్టి పోటీని ఎదుర్కొని చింతా అనురా«ద విజయం సాధించారు. 40 వేల ఓట్ల తేడాతో బయటపడ్డారు.

కాగా చింతా అనురాధకు రాజకీయ నేపథ్యం ఏమీ లేదు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఆమె బాగా చదువుకున్నారు. ఆమె భర్త ఏపీ ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారని సమాచారం. రాజకీయాలపై ఉన్న ఆసక్తితో ఆయన తన భార్య అనురాధను వైసీపీలోకి పంపడం.. ఆమెకు 2019 ఎన్నికల్లో జగన్‌ సీటు కేటాయించడం జరిగిపోయాయి. దీంతో వైసీపీ గాలిలో చింతా అనురాధ విజయం సాధించారు. ఆమె టీడీపీ అభ్యర్థి, దివంగత లోక్‌ సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్‌ మధుర్‌పై విజయం సాధించారు.


చింతా అనురా«ధ బాగా చదువుకుని ఉండటంతో నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావించారు. అయితే ఆమె గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటం లేదని టాక్‌ నడుస్తోంది. ఏవైనా ముఖ్యమైన పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు ఉంటే తప్ప నియోజకవర్గానికి రావడం తగ్గించేశారని చర్చ జరుగుతోంది.  


ఆమె నియోజకవర్గంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. అయితే ఎవరైనా ఏదైనా పనికోసం అక్కడికి వెళ్లినా సమాధానం చెప్పే వారు లేరని అంటున్నారు. అలాగే ఆమె నియోజకవర్గానికి సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించడం లేదని చెబుతున్నారు.

నియోజకవర్గానికి పూర్తిగా దూరమైన చింతా అనురాధ కొన్ని పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తున్నారని అంటున్నారు. గతంలో రాజకీయ నేపథ్యం లేకపోవడంతో స్థానిక నేతలతోనూ ఆమెకు సంబంధాలు అంతంతమాత్రమేనని చెబుతున్నారు.

గడప గడపకూ కార్యక్రమంలోనూ చింతా అనురాధ పాల్గొనడం లేదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో చింతా అనురాధకు టికెట్‌ ఇవ్వవద్దని స్థానిక నేతలు డిమాండ్‌ చేస్తున్నారని తెలుస్తోంది.

ఎంపీగా పోటీ చేసినా ఈసారి గెలుపు కష్టమేనని చెబుతున్నారు. గత ఎన్నికల్లోనే ఆమె ఓడిపోవాల్సి ఉందని.. జగన్‌ వేవ్‌ లో గెలిచారనే అబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ఏదైనా ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని చింతా అనురాధ భావిస్తున్నట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News