థర్డ్ ఫ్రంట్ ఏంటి చీప్ గా...మెయిన్ ఫ్రంటే

Update: 2022-09-07 17:03 GMT
దారులన్నీ ఒకే వైపునకు సాగితే అది మెయిన్ స్ట్రీట్ అవుతుంది. అలాగే అన్ని పార్టీలు కలిస్తే అది మెయిన్ ఫ్రంట్ అవుతుంది. బీహారీ బాబు నితీష్ కుమార్ ఫ్రంటుల మీద సరికొత్తగా డెఫినిషన్ ఇస్తున్నారు. అటు ఒక్క బీజేపీ ఇటు ఎన్నో పార్టీలు. మరి అన్నీ కలిస్తే బలమైన ఫ్రంట్ అవుతుంది. అపుడది మెయిన్ కాక మరేమవుతుంది. ఇదీ నితీష్ గారి నిఖార్సైన
మాట.

ఆయన చాన్నాళ్ళుగా పాట్నాకే పరిమితం అయిపోయారు. ఇప్పటికి రెండు దశాబ్దాలుగా అక్కడ సీఎం పీఠం పట్టుకుని అలాగే పేషీలో బిజీగా ఉండిపోయారు. ఈ లోగా దేశంలో చాలా మార్పులు జరిగినా ఆయన బీహారే ఫస్ట్ బెస్ట్  అనుకున్నారు. ఈలోగా  తనకంటే రాజకీయంగా జూనియర్ గా ఉన్న నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం నుంచి పీఎం పీఠం దాకా ప్రమోషన్ కొట్టేసిన వేళ నితీష్ లో కాస్తా మంట బయల్దేరింది.

దాంతో ఆయన ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. కానీ అంతా మోడీ హవా దాంతో ఉన్న సీఎం పీఠం కుర్చీ కదలకుండా చాలు అనుకుంటూ ఒక దశాబ్ద కాలం అలా గడిపేశారు. ఈ మధ్యలో అటూ ఇటూ అంటూ బీజేపీ నాన్ బీజేపీ శక్తులతో నెట్టుకొచ్చారు. ఇక్కడే నితీష్ తెలివి ఉందనుకోవాలి. ఇపుడు సరైన టైం. మోడీ హవా దేశాన పలుచన అవుతున్న కాలం.

అందుకే ఆయన మళ్ళీ విపక్ష  శిబిరంలోకి దూకారు. అయినా ఏం కాలేదు, బీహార్ సీఎం పదవి అలాగే పదిలంగా భద్రంగా ఉంది. మరో మూడేళ్ళ పాటు ఆ పదవికి ఢోకా లేదు. ఈ లోగా 2024లో ప్రధాని ఎన్నికలు వస్తున్నాయి. దాంతో తన అదృష్ట రేఖ‌ పరీక్షించుకోవడానికి ఆయన ఒక్కసారిగా  హస్తిన టూర్ వేశారు. రాహుల్ తో మొదలెట్టి అందరి నాయకులను కలసి వచ్చారు. ఒక విధంగా ఏడుపదుల వయసులో అయుదు పదుల రాజకీయ జీవితంలో ఇదొక కొత్త అనుభవంగా నితీష్ కి తోస్తోంది. ఎక్కడ లేని హుషార్ వస్తోంది.

నాకెందుకండీ ప్రధాని పదవి, విపక్షం అంతా ఏకమై బీజేపీని గద్దె దించితే చాలు అదే పదివేలు అని  ఇలా వినయంగా  మాట్లాడుతున్న ఈ బీహారీ బాబు రాజతంత్రంలో మేటి. వద్దు అంటే కావాలి అన్న అర్ధం రాజకీయ శాస్త్రం తొలి పుటలోనే ఉంటుంది. అందువల్ల నితీష్ కాదు అంటే అవును అనే అర్ధం. ఆ విధంగా చూస్తే అందరి నాయకులను కలుస్తూ తనను తానుగా ఫోకస్ చేసుకుంటూ నితీష్ పీఎం పీఠం కోసం  అడుగులు చకచకా వేస్తున్నారు.

మమతా బెనర్జీ, కేసీయార్ చేయలేని పని నితీష్ చేస్తున్నది ఒక్కటే. వారు కాంగ్రెస్ ని తప్ప తక్కిన వారిని కలిసి వదిలేశారు. కానీ నితీష్ రాహుల్ తో భేటీ అయి వచ్చారు. అంటే రేపటి ఎన్నికల్లో సెంచరీ దాటి సీట్లు తెచ్చుకునే అతి పెద్ద పార్టీ నుంచే తన కధను మొదలెట్టారు అన్న మాట. ఆ విధంగా బీజేపీయేతర పార్టీలను అన్నింటినీ ఒక చోటకు చేరిస్తే బలమైన ఆల్టర్నేషన్ తయారు కావడం ఖాయం.

ఇక అన్ని పార్టీలతో జరిపిన చర్చలు బాగా జరిగాయని, 2024 ఎన్నికలు విభిన్నంగా ఉంటాయని నితీష్ చెబుతున్నారు. ఆయన ఆలోచనను బట్టి చూస్తే ఈసారితో మోడీ మాజీ ప్రధాని అవుతారనే ధీమా కనిపిస్తోంది. ఆ ధీమాతోనే తిరిగి పాట్నా చేరుకున్న నితీష్ థర్డ్ ఫ్రంట్ అన్నది ఎక్కడా లేదు, మాదే మెయిన్ ఫ్రంట్ అంటున్నారు. దీని వెనక మరో అర్ధం కూడా ఉంది.

కాంగ్రెస్ బీజేపీలకు సమాన దూరం పాటించి వచ్చే కూటమిని థర్డ్ ఫ్రంట్ అంటారు. నితీష్ కాంగ్రెస్ ని కలుపుకుని పోతున్నారు. ఈ రోజు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బీజేపీని దింపాలనుకుంటున్నారు. ఆ విధంగా ఆలోచిస్తే ఆయన చెప్పినదే నిజం. నితీష్ తెచ్చేది మెచ్చేది మెయిన్ ఫ్రంటే అన్నది కరెక్ట్ మాట. మరి ఈ ఫ్రంట్ లో ఎవరుంటారు. ఏ ఏ పార్టీలు జత కూడుతాయి అన్నదే చర్చ.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News