కులం.. మ‌తం.. ప్రాంతం.. అంటూ విడ‌గొడ‌తారు.. వాళ్లే ప్ర‌మాద‌క‌రం!

Update: 2022-04-26 16:30 GMT
ప్ర‌జాస్వామ్య దేశంలో ప్ర‌జ‌ల ఓట్ల‌తో అధికారంలోకి వ‌చ్చిన నాయ‌కులు ఏం చేస్తున్నారు? జ‌నాల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోకుండా.. త‌మ జేబులు నింపుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యానికి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడుక్కునే నాయ‌కులు.. గెలిచిన త‌ర్వాత ముఖం చాటేస్తారు. అస‌లు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు ఉన్నారు.. వాళ్ల‌కు ఏమైనా స‌మ‌స్య‌లు ఉన్నాయా? అని ఆలోచించే నాయ‌కులే క‌నిపించ‌డం లేద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కానీ వాళ్ల‌తో పోలిస్తే ఇలాంటి రాజ‌కీయ నాయ‌కులే న‌యం.. అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వాళ్లు ఎవ‌రంటే.. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌లు.

వాళ్ల‌దే హ‌వా..

అవును.. ఇప్పుడు దేశ రాజ‌కీయాల్లో ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ల ట్రెండు న‌డుస్తోంది. త‌మ పార్టీ విజ‌యం కోసం నాయ‌కులు ఈ వ్యూహ‌క‌ర్త‌ల వెన‌కాల ప‌డుతున్నారు. దీంతో డిమాండ్‌ను ఉప‌యోగించుకుని ఎద‌గాల‌ని చూస్తున్న ఈ వ్యూహ‌క‌ర్త‌లు త‌మ‌ను న‌మ్మిన పార్టీని గెలిపించ‌డానికి ఎంత‌కైనా తెగిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. రాజ‌కీయ నాయ‌కులైతే త‌మ‌కున్న తెలివితో ప్ర‌జ‌ల సొమ్మును దోచుకుని వ‌దిలేస్తాడ‌ని.. కానీ ఈ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌లు అంత‌కంటే ప్ర‌మాద‌మ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

చిచ్చు పెట్టి.. విడగొట్టి

ఓ పార్టీని గెలిపించ‌డం కోసం కులం, మ‌తం, ప్రాంతమంటూ ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చుపెట్టి దేశాన్ని అన్ని ర‌కాలుగా విడ‌గొట్టే ప్ర‌య‌త్నం ఈ వ్యూహ‌క‌ర్త‌లు చేస్తున్నార‌నే అభిప్రాయం బ‌లంగా ఉంది. ఇలా దేశాన్ని విడ‌గొట్టి వినాశ‌నానికి దారి తీస్తార‌నే వాద‌న వినిపిస్తోంది. అందుకే రాజ‌కీయ నాయ‌కుల కంటే కూడా ఈ వ్యూహ‌క‌ర్త‌లే ప్ర‌మాద‌మ‌ని నిపుణులు అంటున్నారు. నీతి నిజ‌యాతీ లేకుండా ప్ర‌జ‌ల గురించి ఆలోచించ‌కుండా త‌మ‌ను న‌మ్ముకున్న పార్టీని గెలిపించ‌డం కోసం ఏమైనా చేస్తారు.

పీకేపై విమ‌ర్శ‌లు

ప్ర‌స్తుతం దేశంలో ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా చ‌లామ‌ణీ అవుతున్న ప్ర‌శాంత్ కిషోర్‌పై ఈ త‌ర‌హా విమ‌ర్శ‌లు చాలానే ఉన్నాయి. ఆయ‌న‌కు ఎలాంటి నీతి నిజాయ‌తీ ఉండ‌ద‌ని, ప్ర‌జ‌ల‌ను ప్రాంతం, కులం, మ‌తం పేరుతో విడ‌గొట్టి విద్వేషాలు రేకెత్తేలా చేస్తార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. గ‌తేడాది త‌మిళ‌నాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే కోసం పీకే ప‌ని చేశారు. ఆ పార్టీ అధినేత స్టాలిన్ సీఎం అయ్యారు. కానీ ఇప్పుడు న‌టుడు విజ‌య్ పార్టీ కోసం ప‌నిచేసేందుకు పీకే సిద్ధ‌మ‌య్యార‌నే వార్త‌లు వ‌చ్చాయి. విజ‌య్‌తో పీకే స‌మావేశం కూడా అయ్యారు. గ‌తేడాది గెలిపించిన పార్టీని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించ‌డం కోసం ఇప్పుడు పీకే ప‌ని చేయ‌బోతున్నార‌ని, ఆయ‌న‌కు ఆత్మ‌సాక్షి లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఆలోచించాల్సిందే

ఇక త‌న ప్ర‌యోజ‌నాల కోసం పీకే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారనే టాక్ ఉంది. కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చే దిశ‌గా పీకే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మ‌రోవైపు తెలంగాణ‌లో టీఆర్ఎస్ కోసం ఆయ‌న సంస్థ ఐ ప్యాక్ ప‌ని చేస్తోంది. మ‌రి జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌లో చేర‌బోతున్న ఆయ‌న‌.. తెలంగాణ‌లో టీఆర్ఎస్ ఇచ్చే రూ.వంద‌ల కోట్ల కోసం ప‌ని చేయ‌డం స‌రైందేనా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. మ‌రి తెలంగాణ కాంగ్రెస్ ప‌రిస్థితి ఏమిటీ? ఆ పార్టీ నేత‌లు ఏం చేయాలి? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇక పీకే రంగంలోకి దిగారంటే గొడ‌వలు, దాడులు కామ‌న్‌గానే క‌నిపిస్తాయ‌నేది మ‌రో మాట‌. అందుకు ఏపీలో కోడిక‌త్తి, ప‌శ్చిమ బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్జీ కాలికి గాయం, తాజాగా తెలంగాణ‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర‌.. ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌కు ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నారు. అందుకే ఇలాంటి స్వార్థ‌పూరిత‌, కుట్ర‌పూరిత వ్యూహ‌క‌ర్త‌ల‌ను క‌ట్ట‌డి చేయాల‌ని ప్ర‌జాస్వామ్య వాదులు సూచిస్తున్నారు. ప్ర‌జ‌లు ఆలోచించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News