బాబు..'ఛాయ్ పే చ‌ర్చా'.... ప్ర‌చారం స‌ర‌ళిని మార్చేసుకుంటున్న చంద్ర‌బాబు!

Update: 2022-12-10 10:30 GMT
రానున్న ఎన్నిక‌లు టీడీపీకి చావో రేవో లాంటి ఎన్నిక‌లుగా మారిన త‌రుణంలో మ‌ళ్లీ ఆంధ్రాలో టీడీపీని అధికారంలోకి తీసుకురావ‌డానికి చంద్ర‌బాబు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. టీడీపీ చేప‌డుతున్న ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి కార్యక్ర‌మంలో భాగంగా ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. చంద్ర‌బాబు స‌భ‌ల‌కు ప్ర‌జ‌లు  ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌టంతో తెలుగు త‌మ్ముళ్లు కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే చంద్ర‌బాబు ఇప్పుడు త‌న ప్ర‌చార స‌ర‌ళిని కూడా అనూహ్యంగా మార్చి అంద‌ర్నీ సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేస్తున్నారు.

బాప‌ట్ల‌లో చంద్ర‌బాబు త‌న ప‌ర్య‌ట‌న రూటు మార్చారు. అక్క‌డ అప్పిక‌ట్ల‌లో రోడ్డుప‌క్క‌న ఉన్న ఒక టీ కొట్టుకు వెళ్లి ఆయన సామాన్యుడి వ‌లే అక్క‌డ టీ సేవించి వారితో మాటా మంతి క‌లిపి మాట్లాడారు. అక్క‌డే ఉన్న కొంత‌మంది స్థానికుల‌తో ఆయ‌న మాట్లాడి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.

ఇలా చంద్ర‌బాబు త‌న ప‌ర్య‌ట‌న‌లో ఆక‌స్మికంగా రూటు మార్చి ఛాయ్ పే చ‌ర్చలా మార్చ‌డం తెలుగు త‌మ్ముళ్ల‌కు మంచి ఎన‌ర్జీ ఇచ్చిన‌ట్ల‌యింది. ఎన్నిక‌ల‌కు ఇక ఎంతో స‌మ‌యం లేక‌పోవ‌డంతో చంద్ర‌బాబు ఒక‌వైపు ప‌ర్య‌ట‌న‌లు చేస్తూనే మ‌రోవైపు సామాన్యుల‌తో మ‌మేక‌మై వారి సాధ‌క బాధ‌లు తెలుసుకోవాల‌ని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయ‌న ఇక‌పైన కూడా ఇదే రీతిలో ప‌ర్య‌ట‌న చేసిన చోట‌ల్లా సామాన్యుల వ‌ద్ద‌కు వెళ్లి వారిని ప‌లుక‌రించి వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకుని వారికి భ‌రోసా క‌ల్పించ‌నున్నారు. త‌ద్వారా జ‌నం మ‌న‌సు గెలుచుకోవాల‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌.

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తి ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సంప్ర‌దాయ రాజ‌కీయ ప్ర‌సంగాలే చేసేవారు. ఇప్పుడు ఆయ‌న ఆ ప్ర‌సంగాల రూటు కూడా మార్చారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌న వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్‌ను నియ‌మించుకోవ‌డాన్ని బాబు త‌ప్పుబ‌ట్టారు. ఆయ‌న్ను బీహార్ డెకాయిట్‌గా వ‌ర్ణిస్తూ గ‌ట్టి విమ‌ర్శ‌లు చేశారు. అయితే ఇప్పుడు త‌ద్బిన్నంగా  ప్ర‌శాంత్ కిశోర్ శిష్యుడు రాబిన్ శ‌ర్మ‌ను టీడీపీ వ్యూహ‌క‌ర్త‌గా నియమించుకున్నారు.

రాబిన్ శ‌ర్మ చెప్పిన‌ట్లుగా వ్యూహాలు కూడా అమ‌లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే  ఈవేళ చంద్ర‌బాబు ఛాయ్ పే చ‌ర్చ చేప‌ట్టిన‌ట్లు టీడీపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇది స‌క్సెస్ అయితే రాబోయే రోజుల్లో మ‌రిన్ని ప్ర‌చార వ్యూహాలను కూడా టీడీపీ తెర‌పైకి తీసుకురానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News