టీడీపీ నేతలంతా రోడ్లపైకి... మాజీ మంత్రి మాత్రం...?

Update: 2022-10-29 01:30 GMT

వైసీపీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారి టీడీపీ నేతలు అంతా ఉత్తారాంధ్రా జిల్లాలలో ఒక్కటిగా నిలిచి అధికార పార్టీ మీద సమరశంఖం పూరించారు. ఇక ఎన్నికలకు ఏణ్ణర్ధం వ్యవధి మాత్రమే ఉంది అనుకున్నారో లేక టీడీపీ గ్రాఫ్ పెరిగిందని భావించారో అదీ కాక జనాల మూడ్ తమకు అనుకూలంగా ఉందని ఊహించారో. అధినేత చంద్రబాబు చెప్పినట్లుగా టాప్ టూ బాటం నేతలు అంతా రోడ్ల పైకి వచ్చారు. పోలీసులతో ఎదురు పడి  గొడవ పడ్డారు. సేవ్ ఉత్తరాంధ్రా అంటూ నినదించారు.

విశాఖలో అయితే పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా బీచ్ రోడ్డు వద్ద ఉన్న రుషికొండ దాకా కీలక నేతలు వెళ్లగలిగారు. అక్కడ వారిని అరెస్ట్ చేశారు మరో వైపు టీడీపీ నేతలను ముందుగానే గృహ నిర్బంధం చేశారు. ఎవరెవరు ఆందోళనలకు సిద్ధంగా ఉన్నారో అంచనా కట్టి మరీ పోలీసులు ముందు రోజు రాత్రి నుంచే వారిని నియంత్రించే పనిలో పడ్డారు. వారూ వీరు అని చూడకుండా మొత్తానికి మొత్తం టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పారేశారు.

విశాఖలో సెక్షన్ 30 అమలులో ఉందని చెబుతూ పోలీసులు ఎలాంటి ర్యాలీలు చేయడానికి అనుమతులు అవసరం లేదని కూడా ఆదేశించడంతో తమ్ముళ్లకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి టీడీపీ నుంచి పోలీసులకు గట్టి ప్రతిఘటన కూడా ఎదురైంది. ఇవన్నీ ఇలా జరుగుతూంటే గోదావరి జిల్లాల నుంచి మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వంటి వారు వచ్చినా విశాఖలోనే ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం ఏ అలికిడీ లేకుండా గమ్మున ఉండడమే ఇపుడు టీడీపీ వర్గాలలో చర్చకు తావిస్తోంది.

ఇది చంద్రబాబు నిర్దేశించిన  ప్రొగ్రాం, విశాఖ మీద ఉత్తరాంధ్రా మీద వైసీపీ రాజకీయ పెత్తనంతో పాటు కబ్జాలకు తెగబడుతోందని అరోపిస్తూ తమ కంచుకోటలను కాపాడుకోవడానికి చేస్తున్న రాజకీయ సమరం. మరి ఇలాంటి వేళ సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న గంటా శ్రీనివాసరావు సేవ్ ఉత్తరాంధ్రాలో పాలుపంచుకోకపోవడం నిజంగా తమ్ముళ్లకు షాకింగ్ గా ఉంది అంటున్నారు.

అసలు ఒక్క స్టేట్మెంట్ కూడా గంటా సైడ్ నుంచి లేనే లేదు అని అంటున్నారు. మరి గంటా అంటేనే డైనమిక్ లీడర్. ఆయన వస్తే అనుచరులు పెద్ద సంఖ్యలో వస్తారు. అంగబలం, అర్ధబలం పుష్కలంగా ఉన్న నాయకుడు. అలాంటి గంటా కీలకమైన టైం లో టీడీపీ కష్టకాలంలో పోరాటాలు మద్దతుగా నిలిచి తాను పోరాటం చేయకపోతే ఎలా అన్నదే పార్టీని వేధిస్తున్న ప్రశ్న.

అసలు గంటా ఆంతర్యం ఏమిటి. ఆయన నిజంగా పార్టీలో ఉంటారా, కొనసాగుతారా. అయిదేళ్ళూ ఎలాంటి పోరాటాలు చేయని వారికి టికెట్లు ఇవ్వనని ఒక వైపు చంద్రబాబు చెబుతూంటే ఎప్పటికపుడు నాయకుల గ్రాఫ్ ని పరిశీలిస్తూ సమీక్షలు చేస్తూంటే గంటా ఎందుకు అంత నిబ్బరంగా ఉన్నారు. ఆయన మనసులో ఆలోచనలు ఏంటి అన్నది ఎవరికీ అంతుబట్టకుండా ఉంది.

మరో వైపు చూస్తే టీడీపీలో కీలక నాయకులు అందరినీ కలుపుకుని పోతున్న అధినాయకత్వం గంటాను కావాలనే వదిలేసిందని, ఆయనకు ఎక్కడా ప్రయారిటీ ఇవ్వడంలేదని, అందుకే ఆయన తనకెందుకు వచ్చిన బాధ అని కామ్  అయ్యారని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియడం లేదు కానీ గంటా లాంటి బిగ్ షాట్ టీడీపీకి దూరంగా ఉంటే మాత్రం ఆ పార్టీ విజయావకాశాల మీద అది పెను ప్రభావమే చూపిస్తుంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News