బండ్ల గ‌ణేష్ ని మ‌రిపించిన టీఎస్ మంత్రి

Update: 2022-05-02 08:29 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వుందంటే అక్క‌డ బండ్ల గ‌ణేష్ చేసే హ‌డావిడీ అంతా ఇంతా కాదు. ప‌వ‌న్ పై ఓ రేంజ్ లో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తూ క‌డుపుబ్బా న‌వ్విస్తుంటారు. త‌న అభిమాన హీరో ప‌వ‌న్ పై 'ఈశ్వ‌రా ప‌వ‌నేశ్వ‌రా.. ప‌వ‌రేశ్వ‌రా అంటూ అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపుతూ వేడుక‌కు హైలైట్ గా నిలుస్తుంటారు. తాజాగా జ‌రిగిన సినీ కార్మికోత్స‌వంలో బండ్ల గ‌ణేష్ ని మ‌రిపించారు టీఎస్ మంత్రి తుమ్మ మ‌ల్లారెడ్డి. క‌రోనా వేళ సినీ కార్మికుల‌కు చిరు అందించిన సాయం తో పాటు అనేక విష‌యాన్ని వెల్ల‌డించి ఆక‌ట్టుకున్నారు.

నేను చిరు అభిమానినే అంటూ ప్ర‌సంగం మొద‌లు పెట్టిన టిఎస్ మినిస్ట‌ర్ తుమ్మ మాల్లారెడ్డి త్వ‌ర‌లో తాను సినిమా నిర్మాణం చేయ‌బోతున్నాన‌ని వెల్ల‌డించారు. అంతే కాకుండా సీనీ కార్మికుల్లో నూత‌నోత్తేజాన్ని క‌లిగిస్తూ ఆయ‌న మాట్లాడిన మాట‌లు చిరుని న‌వ్వుల్లో మునిగితేలేలా చేసింది. చిరుది ఆంధ్రా అయినా ఆయ‌న తెలంగాణ బిడ్డేన‌ని, అంతే కాకుండా తెలుగు సినిమా ప్ర‌పంచంలో వున్న వాళ్లంతా తెలంగాణ బిడ్డ‌లేన‌ని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా త‌న కాలేజీ స్నాత‌కోత్సవాల్లో ప్ర‌సంగిస్తూ యూత్ ని ఎట్రాక్ట్ చేసే మ‌ల్లారెడ్డి సినీ కార్మికోత్స‌వంలోనూ అదే పంథాని కొన‌సాగించి కార్మికుల్లో నూత‌నోత్తేజాన్ని క‌లిగించారు.

మంత్రి మ‌ల్లారెడ్డి ప్ర‌సంగం ఆద్యంతం బండ్ల గ‌ణేష్ ని త‌ల‌పిస్తూ సాగింది. దీంతో చిరు ఆద్యంతం చిరున‌వ్వులు చిందిస్తూ ఆయ‌న ప్ర‌సంగాన్ని ఎంజాయ్ చేశారు. అయితే ఈ సందర్భంగా మంత్రి మ‌ల్లారెడ్డి ఆవేశంగా మాట్లాడిన‌ట్టుగా అనిపించినా చాలా వ‌ర‌కు నిజాల‌ని వెల్ల‌డించారు.  

తాను ఎలా ఎదిగింది. ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి చేరుకుంది చెప్పుకొచ్చారు. పాలు పోసే స్టాయి నుంచి మంత్రిగా ఎదిగాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇక సినీ కార్మికుల్లో జోష్ నింపే ప్ర‌య‌త్నంలో తెలుగు సినిమాకు మంచి రోజులు వ‌చ్చాయ‌ని, రేప‌టి రోజు మీరు బాగా క‌ష్ట‌ప‌డండి మీకు మంచి జ‌రుగుతుంద‌న్నారు.

కొన్ని చోట్ల మంత్రి ప్రసంగం అతిగా అనిపించినా ఆయ‌న అన్న మాట‌లు చిరుతో స‌హా అంద‌రినీ హ‌త్తుకున్నాయి. అయితే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఏపీ మంత్రి చెల్ల‌బోయిన వేణు మాత్రం ఈ స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయారు. ఆయ‌న సొంత డ‌బ్బా కొట్టుకోవ‌డానికే అధిక ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్టుగా క‌నిపించింది.  కానీ ఏపీ మంత్రులు మాత్రం చిరుని పొగ‌డ్త‌ల‌తో ఆకాశానికి ఎత్తేశారు. ఆయ‌న మంచిత‌నం, గొప్ప గుణం గురించి కీర్తించి ఆక‌ట్టుకున్నారు. త‌ల‌సాని కూడా చిరుపై ప్ర‌శంల‌స వ‌ర్షం కురిపించారు.

చిరు చిత్ర‌పురి కాల‌నీలో ఆసుప‌త్రిని క‌ట్టిస్తార‌ని, అదే విధంగా కార్మికుల పిల్ల‌ల చ‌దువుల కోసం పాఠ‌శాల నిర్మాణానికి చిరు స్థలాన్ని కూడా కేటాయించార‌ని చెప్పి చిరుపై వున్న తన అభిమానాన్ని చాటుకున్నారు. హైద‌రాబాద్ లోని యూస‌ఫ్ గూడా కోట్ల విజ‌య భాస్క‌ర్ రెడ్డి స్టేడియంలో జ‌రిగిన సినీ కార్మికోత్స‌వంలో ప‌లు ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు చోటు చేసుకోవ‌డం విశేషం.
Tags:    

Similar News