సీమ ప‌ల్లెల్లో ఉద్దానం సెగ‌లు ..?

Update: 2022-04-30 02:30 GMT
మ‌రో ఉద్దానం ను  చూడ‌కండి.. ప్లీజ్.. మ‌రో ఉద్దానం విల‌యం రావొద్దండి ఇటుగా అని కోరుకోండి. వైద్య రంగంలో ఎన్ని మార్పులు వ‌చ్చినా ప‌ల్లెజ‌నంకు ఇప్ప‌టికీ రోగ నిర్థార‌ణే ఓ పెను భారంగా ఉంది. ఇక తాజాగా వెలుగు చూసిన సీమ సమ‌స్య‌పై ఇప్ప‌టికే ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల్సి ఉంది కానీ లేదు. తాగునీటి న‌మూనాలు కొన్ని ల్యాబ్ కు వెళ్లాయి. అవి వస్తే ఆ నీరు తాగేందుకు యోగ్య‌మా కాదా అన్న‌ది తేలాలి. స్వ‌ర్ణ ముఖి న‌దీ తీరాన ఓ సీమ గ్రామం క‌న్నీటి గాధ ఇది.
 
క్రానిక్ కిడ్నీ డిసీజ్ లు అన్న‌వి ఇవాళ్టికి కావు. కేవ‌లం ఆహార నియ‌మాలు స‌రిగా లేక‌పోవ‌డం, నాటు సారా వినియోగం ఎక్కువ ఉండ‌డం, ఇతర మ‌త్తు ప‌దార్థాల వాడ‌కం కార‌ణంగానే ఇవి వ‌స్తున్నాయి అని చెప్ప‌డం ఇప్ప‌టిదాకా వైద్య రంగం చేస్తున్న ప‌ని. ముఖ్యంగా తాగునీటి క‌లుషితం కార‌ణంగా ఈ సీకేడీని గుర్తిస్తున్నామ‌ని వైద్యులు అంటున్నారు.

అయితే ఇప్పుడు వెలుగు చూసిన స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కావాలంటే ప‌ల్లెల‌కు శుద్ధ‌త‌తో కూడిన నీరు అందించాలి. అదేవిధంగా వాళ్ల ఆహారపు అల‌వాట్ల‌లో మార్పు తీసుకుని రావాలి. అంతేకాదు వ్యాధి ప్రాథ‌మిక ద‌శ‌లో గుర్తించేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య శిబిరాల ఏర్పాటు అన్న‌ది త‌ప్ప‌నిస‌రి ! ఇవేవీ లేకుండా ఉద్దానంలో అయినా సీమ‌లో అయినా పాల‌కులు మాట‌లు చెప్పి పోతే ఫ‌లితం సున్నా.

ఉద్దానం స‌మ‌స్య‌ల‌ను తీర్చే క్ర‌మంలో ఆంధ్రా సీఎం ఉన్నార‌ని నిర్థారించ‌లేం. ముఖ్యంగా శ్రీ‌కాకుళం జిల్లా ప‌లాస త‌దిత‌ర ప‌రిస‌ర ప్రాంతాల్లో కిడ్నీ  వ్యాధి గ్ర‌స్తుల స‌మ‌స్య‌లు తీర్చేందుకు ఏనాడో ముఖ్య‌మంత్రి ఓ హామీ ఇచ్చి వెళ్లారు. వంద ప‌డ‌క‌ల ఆస్ప‌త్రికి నిధులు కూడా ఇచ్చారు. కానీ ప‌నులు మాత్రం వేగంగా సాగ‌డం లేదు. మంత్రి సీదిరి అప్ప‌ల్రాజు నియోజ‌క‌వ‌ర్గం ఇది.

ఇప్పుడు ఇదే స‌మ‌స్య తిరుప‌తి జిల్లా నాయుడుపేట మండ‌లం వ‌డ్డి కండ్రిగ‌లో వెలుగు చూసింది. ఆరోజు ఉద్దానం స‌మ‌స్య‌పై ప‌వ‌న్ మాట్లాడారు. దీక్ష‌లు చేశారు. ఉపావాసం ఉన్నారు. పాల‌కుల‌ను దారిలోకి తెచ్చేందుకు ఎన్నో ప్ర‌జా ఉద్య‌మాల‌కు సార‌థ్యం వ‌హించారు. అవి కొంత మేర ఫ‌లితం ఇచ్చాయి. కానీ ఇప్ప‌టికీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ లకు సంబంధించి మందులున్నా,సమ‌స్య‌కు మూలాలు తెలియ‌డం లేదు. మందులు కూడా కొన్ని సార్లే ప‌నిచేస్తున్నాయి. ప్రాథ‌మిక ద‌శ‌లో జ‌బ్బును గుర్తిస్తేనే స‌మ‌స్య‌కు కాస్త ప‌రిష్కారం.

లేకుంటే క‌ష్ట‌మే !

వాస్త‌వానికి ఉద్దానం స‌మ‌స్య అయినా వ‌డ్డి కండ్రిగ స‌మ‌స్య అయినా ప్రాథ‌మిక ద‌శ‌లోనే నివృత్తి కావాలి.లేదంటే రెండోద‌శ‌లో డ‌యాల‌సిస్ త‌ప్ప‌దు. డ‌యాల‌సిస్ అన్న‌ది ఖ‌రీదైన వ్య‌వ‌హారం. డ‌యాల‌సిస్ చేసినా రోగి బ‌తుకుతాడు అనేందుకు గ్యారంటీ లేదు. ఎన్నో సార్లు డ‌యాల‌సిస్ ప్ర‌క్రియ విఫ‌లం అయి చనిపోయిన వారెంద‌రో ! ఈ వ్యాధి ఇంత‌వ‌ర‌కూ ఎందుకు వ‌స్తుంది ఎలా నివృత్తి చేయ‌వ‌చ్చు.. వ్యాధికి సంబంధించి ఆన‌వాళ్లు ఏంటి.. ఆహార నియ‌మాల కార‌ణంగానే చ‌నిపోతున్నారా అన్న‌ది కూడా తేలాల్సి ఉంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ పాల‌క వ‌ర్గాలు స్పందించి సీమ ప్ర‌జ‌ల‌కు వైద్యం అందించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది.
Tags:    

Similar News