టెన్ష‌న్లో ఆ..నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల ఆశావ‌హులు

Update: 2022-06-21 06:10 GMT
ప్లీన‌రీకి ముందే రాజ‌కీయం మారిపోతే ఎలా ఉంటుంది. జ‌గన్ అనుకుంటున్న వ్యూహం ఇదే! అవునో, కాదో తేలాలంటే జూలై ఎనిమిదో తారీఖు వ‌ర‌కూ వేచి చూడాల్సిందే ! తీవ్ర ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను మోసుకువెళ్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు, అదేవిధంగా ప‌లు  నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జుల‌కూ ఇప్ప‌టికే కొన్ని సంకేతాలు పంపారట. ఇదే క‌నుక నిజం అయితే జిల్లాలో నాలుగు స్థానాల‌లో నాలుగు కొత్త ముఖాలు  తెర‌పైకి వ‌చ్చి న‌యా సంచ‌ల‌నాల‌కు చిరునామా కావచ్చని అంటున్నారు.ఏదైనా ఆ లోగుట్టు పీకే-రిషి  టీంకే ఎరుక ! ఉత్త‌ర ప్ర‌దేశ్ కు చెందిన ఐఐటీయ‌న్, ప్ర‌స్తుతం ఆంధ్రావ‌ని వాకిట ఐ ప్యాక్ టీం ను లీడ్ చేస్తున్న రిషి రాజ్ సింగ్ అనే కొత్త  వ్యూహ‌క‌ర్త‌కే ఎరుక !

శ్రీ‌కాకుళం రాజ‌కీయ వ‌ర్గాల‌లో మ‌రో సంచ‌ల‌నం న‌మోదు కానుంది. ఇప్ప‌టిదాకా ఉన్న సిట్టింగుల‌లో కొంద‌రిని మార్చే ఆలోచ‌న అయితే జ‌గ‌న్ చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ధ‌ర్మాన దాస‌న్న‌ను త‌ప్పించి, ఆయ‌న స్థానంలో మ‌రో కొత్త ముఖానికి అవ‌కాశం ఇవ్వాల‌ని సీఎం జగ‌న్ యోచిస్తున్నారు అని వైసీపీ వ‌ర్గాల ఇంట‌ర్న‌ల్ టాక్. ఇప్ప‌టిదాకా ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను తీవ్ర స్థాయిలో మోస్తూ వ‌స్తూ, అనేక వివాదాల‌ను సైతం చ‌వి చూస్తూ ఉన్నార‌న్న ఆరోప‌ణ‌లు  ఎదుర్కొంటున్న ధ‌ర్మాన దాస‌న్న స్థానంలో ఓ క్రియాశీల‌క నేత రానున్నారు. ఇప్ప‌టికే సార‌వ‌కోట మండ‌ల రాజ‌కీయాల‌లో క్రియాశీల‌కంగా ఉంటూ, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు వ్యాపార భాగ‌స్వామిగా ఉంటూ, మూడు సార్లు ఎంపీపీగా గెలిచిన రికార్డును సొంతం చేసుకున్న చిన్నాల కూర్మినాయుడికి ఈ వ‌రం వ‌రించ‌నుంది అని తెలుస్తోంది. ఆయ‌న కూడా ఇప్ప‌టికే అధిష్టానం ద‌గ్గ‌ర త‌న వాయిస్ వినిపించార‌ని టాక్. అంటే ధర్మాన వారసత్వం ఆయన  శిష్యునికే దక్కనుందన్నమాట.

ఆయ‌న శిష్యుడికే రాజ‌యోగం..సార‌వ‌కోట ఎంపీపీ గా ప‌నిచేస్తున్న చిన్నాల కూర్మినాయుడుకు ఎందుకు ? దాసన్న కొడుక్కే ఇస్తారేమో అని కొందరు అనుమాన పడొచ్చు. కానీ దాసన్న కుమారుడు, పోలాకి జెడ్పీటీసీ ధ‌ర్మాన కృష్ణ‌దాసుకు కూడా అవ‌కాశం రానే రాద‌ని తెలుస్తోంది. వ్యతిరేకత ఎక్కువై  ఓడిపోతామేమో అనుకున్న స్థానంలో మ‌ళ్లీ,మ‌ళ్లీ దాస‌న్న‌కు ఛాన్స్ ఇచ్చే క‌న్నా, ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను మార్చే దిశగా ప‌నిచేసే నాయ‌కులు అవ‌స‌రం అని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని తెలుస్తోంది. దానివల్ల మళ్లీ ఆ సీటు వైసీపీకి దక్కుతుందని పార్టీ ఆశ.

కొత్త ముఖాల వెతుకులాట వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా కొత్త వరాికి మ‌ద్దతుగానే ఉన్నారు. ఇక్క‌డి సిట్టింగ్ స్థానం మార్పుతో పాటు టెక్క‌లి కి సంబంధించి కూడా ఓ కొత్త ముఖం తెర‌పైకి రావొచ్చు అని సంకేతాలు వ‌స్తున్నాయి. ఎందుకంటే టెక్క‌లిలో దువ్వాడ శ్రీ‌ను (ఎమ్మెల్సీ) వ‌ర్గానికీ, ఇక్క‌డి నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ పేరాడ తిల‌క్  వ‌ర్గానికీ ఉప్పూ నిప్పూ మాదిరిగా ప‌రిణామాలు ఉన్నాయి. క‌నుక తెర‌పైకి వీరిద్దరూ కాకుండా మరో ముఖం వ‌చ్చే అవ‌కాశాలే మెండుగా ఉన్నాయి.

ఇదే  స‌మ‌యంలో పాత‌ప‌ట్నంలో కూడా కొత్త ముఖం తెర‌పైకి రానుంద‌నే తెలుస్తోంది. ఇక్క‌డి ఎమ్మెల్యే రెడ్డి శాంతి కూడా కేవ‌లం సీఎం ఆదేశాల మేర‌కే యాక్టివ్ అయి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నార‌న్న వాద‌న కూడా ఉంది. అందుకే ఇక్క‌డ కూడా అభ్య‌ర్థిని మార్చే ఛాన్స్ ఉంది. టీడీపీ కూడా కొత్త ముఖం వెతుకులాట‌లోనే ఉంది.ఇదేవిధంగా ఆమ‌దాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గంలో కూడా అభ్య‌ర్థిని మారుస్తారు అని స‌మాచారం. తమ్మినేనికి కానీ ఆయ‌న కుటుంబానికి కానీ నో ఛాన్స్ అని ప్రాథ‌మిక స‌మాచారం వ‌స్తోంది. పొందూరుకు చెందిన క్రియాశీల‌క నేత‌కు టికెట్ ద‌క్కేందుకు అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

గెలుపు మ‌లుపులో...ఇక  న‌ర‌స‌న్న‌పేట  రాజ‌కీయాల గురించి మాట్లాడుకుంటే..ఇక్క‌డ టీడీపీ కూడా పాత ముఖాల‌ను తీసి కొత్త ముఖాల‌ను తెర‌పైకి తీసుకుని వచ్చేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించిందట పార్టీ. న‌ర‌స‌న్న‌పేట అంటే కింజ‌రాపు కుటుంబానికి కూడా మంచి ప‌ట్టే ఉంది. అదేవిధంగా ధ‌ర్మాన కుటుంబానికి కూడా కింజ‌రాపు కుటుంబానికి పోటీ ఇవ్వ‌గ‌ల స‌త్తా లేదా స‌మ‌ర్థ‌త ఉంది. ఇక్క‌డే ప‌నిచేసిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అనూహ్య‌రీతిలో 2004లో అసెంబ్లీ స్థానం మార్చుకోవాల్సి వ‌చ్చింది. దాంతో ఆయ‌న శ్రీ‌కాకుళంకు షిఫ్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు శ్రీ‌కాకుళం నుంచి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మ‌రోసారి అదృష్టం ప‌రీక్షించుకోవాల‌ని చూస్తున్నారు.
Tags:    

Similar News