షర్మిలమ్మా... ఎదురీతకు అంతం లేదామ్మా...?

Update: 2022-11-28 17:30 GMT
ఎదురీత గజ ఈతగాడికైనా పెను సవాల్. తీరం కనబడదు, దూరం తెలియదు. ఈదుతూనే ఉండాలి. అలుపు సొలుపూ వచ్చినా ఎదురీత తప్పదు. దానికి అంతం కూడా లేదు. అలా ఉంది వైఎస్సార్ తనయ షర్మిల రాజకీయ పయనం. ఆమె తెలంగాణా కోడలిని అంటూ పార్టీ పెట్టారు. దాదాపుగా రెండేళ్ళు అవుతోంది వైఎస్సార్టీపీ పుట్టి.

ఈ పార్టీ ఏ రకమైన రాజకీయ ప్రకంపనలు సృష్టించలేకపోయింది. అంతే కాదు, ఈ రెండేళ్ల వ్యవధిలో షర్మిల ఒక లీడర్ గా బాగానే కనిపిస్తున్నారు. ఆమె ఏదో సమస్య మీద జనంలో ఉంటున్నారు. ఏకంగా మూడు వేల అయిదు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం ద్వారా తెలంగాణాలో ఏ నాయకుడు చేయని అతి పెద్ద సాహసం చేశారు.

అయినా సరే ఆమె పాదయాత్రకు ఫలితం కనిపించడంలేదు. టీయారెస్ లీడర్ల మీద పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వారిని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. చాలా సార్లు లైట్ తీసుకుంటున్న టీయారెస్ నాయకత్వం కొన్ని సార్లు మాత్రం రెస్పాండ్ అవుతోంది. అది కూడా లోకల్ లీడర్స్ ద్వారా మాత్రమే. ఆ టైం లో ఉద్రిక్తతలు, గొడవలతో అధికార పార్టీదే పై చేయి అవుతోంది.

తాజాగా అలాంటి సందర్భంలోనే షర్మిల మరోసారి అరెస్ట్ అయ్యారు. అయినా పెద్దగా మీడియా ఫోకస్ లేదు. ఆమె రాజకీయం పట్ల కూడా మిగిలిన పార్టీలు సీరియస్ గా తీసుకోవడం లేదు అన్న కామెంట్స్ ఉన్నాయి. అన్నింటికంటే ముందు ఏ పార్టీ అయినా కొత్తగా పుడుతుందా మనం అక్కడ అడుగు పెడదామా అని ఎదురుచూసే నాయకులు ఎవరూ కూడా వైఎస్సార్టీపీ వైపు తొంగి చూడడంలేదు, వంగివాలడంలేదు.

ఆమె పార్టీకి ఏకైక అట్రాక్షన్ ఆమె మాత్రమే. ఆమె సభలకు జనం పెద్ద ఎత్తున వస్తారు. ఆమెను చూసేందుకు జనాలు వెంట పడతారు. ఆమెతో పాదయాత్రలో పాదం మోపుతారు. కానీ ఆమె రాజకీయాన్ని మాత్రం ఎవరూ అనుసరించరు. ఇది నిజంగా షర్మిల పాలిటిక్స్ కి అతి పెద్ద మైనస్. పైగా ఆమె ఇసుకన తైలం తీయాలని చూస్తున్నారు అని అంటున్నారు. తెలంగాణా రాజకీయాలు బహు కష్టంగా క్లిష్టంగా ఉన్నాయి.

మోడీ అమిత్ షాలకే కొరుకుడు పడని పాలిటిక్స్ అక్కడ నడుస్తోంది. కేసీయార్ వంటి చాణక్యుడు తెలంగాణాను ఏలుతున్నాడు. ఆయన తన నుంచి అధికారాన్ని ఏ విధంగానూ దూరం చేసుకోవడానికి ఇష్టపడే రకం కాదు. ఆయనకు ఓపిక ఉన్నంతవరకూ ఆయన దూకుడు సాగినంతకాలం తెలంగాణా రాజకీయాల్లో టీయారెస్ ని కదల్చడం కష్టమే అని ఒక కఠిన విశ్లేషణ ఉంది.

ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే తమ వారే పాలించాలని, తామే అధికారాన్ని శాసించాలని. ఆ విధంగా చూస్తే మొదటి దగ్గరే షర్మిల పాలిటిక్స్ కి అతి పెద్ద దెబ్బ పడినట్లు అయింది. ఆమె తెలంగాణా కోడలిని అని ఎంతలా చెబుతున్న తెలంగాణా సమాజం ఆమెతో కనెక్ట్ కావడంలేదు. ఈ రోజుకు చూస్తే పార్టీలో ఎవరూ లీడర్స్ గట్టిగా లేరు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 119 సీట్లు ఉన్న తెలంగాణాలో షర్మిల ఎంతమందికి ఎమ్మెల్యే అభ్యర్ధులుగా తమ పార్టీ తరఫున నిలబెట్టగలరు అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.

అయితే ఇవన్నీ పక్కన పెడితే షర్మిల మొండి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఆమె తెగువనూ మెచ్చుకోవాలి. తెలంగాణాలో రెండేళ్ల రాజకీయ ప్రయాణంలో ఏ విధంగానూ పాజిటివిటీ కనిపించకపోయినా ఆమె వెనకంజ వేయకుండా కలియతిరుగుతున్నారు. ఇది ఆమెకు ఒక పార్టీ అధినేతగా ఏ విధంగానూ ఉపయోగపడకపోయినా రేపటి రోజున ఆమె కనుక వేరే పార్టీలో తన పార్టీని మెర్జ్ చేసినా లేక ఆయా పార్టీలలో చురుకైన పాత్ర పోషించినా ఉపయోగపడే అవకాశం ఉంది అన్న వారూ ఉన్నారు.

ఆమె బెస్ట్ స్టార్ కాంపెయినర్. అది ఏపీలో వైసీపీకి ప్రచారం చేసిన వేళ బయటపడింది. తెలంగాణాలో పొలిటికల్ స్పేస్ నాలుగవ పార్టీకి లేని వేళ ఆమె ముందు ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే తగిన పార్టీని చూసుకుని అందులో చేరడం ద్వారా తెలంగాణా రాజకీయాల్లో తన పాత్రను మరింత విస్తరించుకోవడం. లేకపోతే మరింతకాలం తన పార్టీని జనంలో ఉంచి వెయిట్ చేయడం అంటే ప్రస్తుతానికి అసాధ్యమే అనిపిస్తోంది. అయినా షర్మిల ఆలోచనలు ఎలా ఉన్నాయో అని అంటున్నా వారూ ఉన్నారు. చూడాలి మరి షర్మిల ఫ్యూచర్ స్టెప్స్ ఎలా ఉంటాయో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News