సల్హాల రావులు ఎక్కువ మోపయిన్రు ! పెద్ద సారును మించిన తోపెవ్వడు !

Update: 2022-04-26 23:30 GMT
రాజ‌కీయం అంటేనే స‌లహా మ‌రియు సంప్ర‌తింపు (సంప్ర‌దింపు కాదు)..రాజ‌కీయం అంటే కొన్ని సార్లు ఆశ మ‌రియు దింపుడు క‌ళ్ల ఆశ  కూడా ! రాజ‌కీయం అంటే చాలా ఉంది ఏమీ లేదు ఈ రెంటి మ‌ధ్య ఉన్న విరుద్ధ‌త కూడా ! అందుకే రాజ‌కీయం ఓ పెద్ద అగాధం కావొచ్చు.. లేదా అంతు తేల‌ని స‌ముద్రం కూడా కావొచ్చు.. పోలిక‌లు కొన్ని పొలికేక‌లు కొన్ని క‌లిస్తేనే రాజ‌కీయం. అనుభం ఉన్నా కొన్ని సార్లు భ‌యాలు వెన్నాడుతాయి..నిర్భ‌య ధోర‌ణులు ఉన్నా అభ‌ద్ర‌త‌లూ వెన్నాడుతాయి. అందుకే ఇక్క‌డ ఏదీ శాశ్వ‌తం కాదు.

ఇక ఏపీలో కానీ టీజీ లో కానీ (టీఎస్ కాదు టీజీ అనే రాయాలి ఎందుకంటే వాళ్లంతా ఉద్య‌మ సమ‌యంలో టీజీ అనే రాశారు.. యాద‌గిరి గుట్ట అనే రాయాలి యాదాద్రి కాదు) ఎక్క‌డ చూసినా ఇప్పుడు స‌ల‌హాలరావుల గోలే ఎక్కువ అవుతోంది. అసలు క‌న్నా కొస‌రు మిన్న అన్న‌విధంగానే న‌డుస్తోంది. ఓ ఉత్తరాది వ్య‌క్తి వ‌చ్చి ఇక్క‌డ తెలుగు రాష్ట్రాల‌ను గ‌డ గ‌డ లాడిస్తాడు.

న‌వ‌రత్నాలంటూ అస్స‌లు రాష్ట్ర బ‌డ్జెట్ ఎంతో ఏమిటో తేలకుండానే, తెలియ‌కుండానే వ‌రాలు ప్ర‌క‌టించ‌మ‌ని చెప్పి వెళ్తాడు. అస్స‌లు ఏమీ లేకుండానే వ‌రాలు ఇచ్చేయ‌మ‌ని ఎలా చెప్ప‌గ‌ల‌డు.. విని న‌వ్వుకోండి ఏం కాదు. ల‌క్షా 35 వేల కోట్లు పీకే కార‌ణంగానే జ‌గ‌న్ స‌ర్కారు పంచింది. ఓ సమ‌యంలో మోయ‌లేని ఆర్థిక భారంతో స‌త‌మ‌త‌మ‌వుతూ జ‌గ‌న్ స‌ర్కారు పెద్ద‌లు అస‌హ‌నం సైతం వ్య‌క్తం చేశారు. ఇన్ని ఉచితాలు మ‌న‌కు అవ‌స‌ర‌మా అని జ‌గ‌న్ కు ఆ రోజు చెప్పినా విన‌లేదు. ఇక‌పై విన‌రు కూడా !

ఇక ఐఐఎం, ఐఐటీ కి చెందిన వాళ్లంతా వ‌చ్చి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఐ ప్యాక్ పేరిట పనిచేస్తుంటారు. కనుక వాళ్లంటే పార్టీల‌కు ఓ న‌మ్మ‌కం. మ‌రి! ఏ రోజు అయినా రాజ‌శేఖ‌ర్ రెడ్డి వీళ్ల‌లాంటి వారిపై ఆధార‌ప‌డ్డారా ..అఫ్ కోర్స్ కేవీపీ ఉంటే ఉండ‌నీ ! ఏ రోజు అయినా చంద్ర‌బాబు ఇలాంటివారిని అప్ప‌ట్లో నియ‌మించుకున్నారా. ఇప్ప‌డంటే ఎవ‌రో సునీల్ క‌నుగోల (ఎస్కే) వ‌చ్చి హడావుడి చేస్తాండు.

ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా కొంద‌రు ఐ ప్యాక్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి  సొంతంగా పొలిటిక‌ల్ క‌న్సెల్టెన్సీల‌ను ప్రారంభించే అవ‌కాశాలే మెండు. ఎందుక‌ని వీళ్లంతా తెలుగు రాజ‌కీయాల చుట్టూ ఇంకా చెప్పాలంటే త‌మిళ తంబీల చుట్టూ తిరుగుతున్నార‌ని? అంటే ఆ పాటి కూడా ఆలోచించి ప్ర‌జ‌ల కోసం తామేం చేయ‌గ‌ల‌మో చెప్ప‌లేక‌పోతున్నారా? లేదా వీళ్లు చెబితే అవి తిరిగి ప్ర‌జ‌ల‌కు తాము వివ‌రిస్తే నాలుగు ఓట్లు ఎక్కువ ప‌డ‌తాయ‌ని న‌మ్మ‌క‌మా ?

ఇక కేసీఆర్ విష‌యానికే వ‌ద్దాం.. ఉద్య‌మ కాలంలో ఆయ‌న చుట్టూ తొలినాళ్ల‌లో జ‌య‌శంక‌ర్ అనే ప్రొఫెస‌ర్ ఉన్నారు. త‌రువాత కోదండ రామ్ అనే ప్రొఫెస‌ర్ ఉన్నారు. అటుపై చాలా మంది విద్యావంతులు కూడా ఆయ‌న  చుట్టూ చేరారు. ఏవో త‌మ‌కు తోచిన స‌ల‌హాలు ఇంకా చెప్పాలంటే స‌బ్జెక్టివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఆ రోజు నాలుగు విష‌యాలపై స‌మ‌గ్ర అధ్య‌యనం చేసిన వారి కార‌ణంగా, అటువంటి వ్య‌క్తుల లేదా విష‌య నిపుణుల క‌లెక్టివ్  ఎఫెర్ట్ కార‌ణంగా కేసీఆర్ మంచి ఫ‌లితాలే అందుకున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కు పీకే ఎందుకు కావాల్సి వ‌చ్చిండో..! ఆయ‌న్ను మించిన వ్యూహ‌క‌ర్త ఉన్న‌డా ? అస‌లు.. నాయ‌కులు అస‌లు వ‌దిలి కొస‌రు పై ఆధార‌ప‌డి త‌మ మెద‌ళ్ల‌కు ప‌ని చెప్ప‌డం మానుకోవ‌డం ఎంత ప్ర‌మాద‌మో గుర్తించ‌క‌పోవ‌డమే ఇవాళ్టి విషాదం అన్న అభిప్రాయం పరిశీల‌కుల నుంచి విన‌వ‌స్తోంది. ఈ మాట అయినా వింటారో లేదా వినిపించుకుంటారో ?
Tags:    

Similar News