జగన్ జమానా : బేలతనమా.. అసహనమా....?

Update: 2022-05-06 09:12 GMT
కొండ లాంటి ఢిల్లీ కోటను ఎదిరించిన జగన్ ఎక్కడ. ఏడుకొండల వాడా ఎల్లో బ్యాచ్ నుంచి నన్ను కాపాడు అని వేడుకునే జగన్ ఎక్కడా. కేవలం మూడంటే మూడేళ్ళు. జగన్ని మూడు చెరువుల నీళ్ళు తాగించేశారా. నిజంగా జగన్ అంత బేలగా మారిపోయారా. అంతలా తగ్గిపోతున్నారా ఇవే రకమైన ప్రశ్నలు ఇపుడు అందరిలో వస్తున్నాయి.

జగన్ అంటే గన్ అన్నది నిన్నది మాట. జగన్ అంటే డేరింగ్ అండ్ డేషింగ్ అన్నది కూడా నిన్నటి మాటే. ఇపుడు జగన్ అంటే జారిపోతున్న నాయకుడుగా ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయినా కానీ జగన్ కి ఈ ఎల్లో బ్యాచ్ కొత్తా, వారి నుంచి వచ్చే వేధింపులు కొత్తా అన్నదే ఇక్కడ పాయింట్.

ఏ రోజు అయినా జగన్ని ఎల్లో బ్యాచ్ మెచ్చుకుందా. ఆయన ఏమీ కాని రోజుల్లో నుంచే అంతా కలసి టార్గెట్ చేసారు కదా. ఇక చేతిలో ఏ అధికారం లేని రోజుల్లో కూడా పెన్నూ గన్నూ ఆయన మీదకే గురి పెట్టారు కదా. మరి ఆనాడు ఉన్న నిబ్బరం, మనోబలం నేడు జగన్ లో ఎందుకు తరిగిపోతున్నాయన్నదే క్యాడర్ కి పట్టుకున్న సందేహం.

తిరుపతిలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించిన సందర్భంగా చేసిన కొన్ని కామెంట్స్ ఆయన అంటే పిచ్చిగా ఆరాధించే వారికి, కరడు కట్టిన అభిమానులకు కూడా షాకింగ్ గానే ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ ఆ సభలో జగన్ ఏమన్నారు అంటే ఎల్లో బ్యాచ్ తో ప్రతీ రోజూ  యుద్ధం చేస్తున్నాం, అన్నీ వక్ర భాష్యాలే రాస్తున్నారు అని వేదన చెందారు.

అంతే కాదు ఏపీలో ఎన్నో పధకాలు అమలు చేస్తూంటే వారికి కనబడడం లేదా, వాటి  గురించి ఎందుకు రాయరు అని అమాయకంగా ప్రశ్నించారు. ఒక్క మంచి అయినా ఈ ప్రభుత్వం చేయలేదా అని వాపోయారు. నిజానికి ఎల్లో మీడియా అనే కాదు, టీడీపీ అనే కాదు ఎవరైనా మంచి జరిగింది అంటే ఆ వైపు చూడరు, చెడు అన్నది  ఆవగంజ అంత ఉన్నా కూడా గట్టిగా చూస్తారు, అదే రాస్తారు, ఆ విషయం సొంత పత్రిక చేతిలో ఉన్న జగన్ కి అర్ధం కాదా అన్నదే పెద్ద డౌట్.

మరో వైపు చూస్తే తన గురించి అన్నీ విమర్శలు చేస్తూ మసి పూసి మారేడుకాయ చేస్తున్నారని కూడా జగన్ చింతిస్తున్నారు. ఇక ఆయన ఒక దశలో ఏమన్నారు అంటే ఆ తిరుపతి ఏడుకొండల వాడే వీరి నుంచి ఏపీకి కాపాడాలని, అంటే ఇది చాలా పెద్ద కామెంట్ గా చూడాలి.

జగన్ ఒక విధంగా చేతులెత్తేశారా అని కూడా అనుకోవాలేమో. పాలన చేస్తున్నపుడు నానా రకాలైన విమర్శలు వస్తాయి. అందులో సహేతుకమైనది ఉంటే దాన్ని స్వీకరించాలి. లేకపోతే పక్కన పెట్టేయాలి. అంతే తప్ప వారు గుచ్చుతున్నారో లేక మెచ్చుకోలేదనో ఆవేదన  చెందితే లాభమేంటి. ఇక ఎల్లో బ్యాచ్ తో నేను వేగలేకపోతున్నాను అని జగన్ ఇండైరెక్ట్ గా అంటున్నట్లే ఉంది కదా అన్నది వైసీపీలోని వారి మాట.

మొత్తానికి జగన్ ఈ మధ్య జిల్లా టూర్లతో చేస్తున్న ప్రసంగాల్లో అసహనం పాలు చాలా ఎక్కువగా  ఒక వైపు కనిపిస్తోంది. ఇక లేటెస్ట్ గా తిరుపతి సభలో చూస్తే బేలతనం కూడా దానికి జత కలుస్తోంది.  మరి ఇదే తీరున ఉంటే ఎలా. రెండేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ధీమాగా ఉండాల్సిన చోట బీరువుగా మారితే ఎలా అన్నదే వైసీపీలో చర్చ.  ఎల్లో బ్యాచ్ జగన్ మనో స్తైర్యాన్ని దెబ్బ తీస్తోందా అన్న చర్చ అయితే  వైసీపీలో జోరుగా సాగుతోంది. చూడాలి మరి జగన్ మరిన్ని సభలలో  ఇంకెలాంటి షాకింగ్  కామెంట్స్ చేస్తారో.
Tags:    

Similar News