చాలా కళ్ళు చూస్తున్నాయి : మూడవ తరం కోసం...?

Update: 2022-05-28 01:30 GMT
తెలుగుదేశానికి రానున్న రెండేళ్ళు అత్యంత కీలకం అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం ఇపుడు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటోంది. డూ ఆర్ డై అన్నట్లుగానే పొలిటికల్ సీన్ ఉంది. ఏపీలో వైసీపీ సర్కార్ మీద ప్రజా వ్యతిరేకత ఉంది. అయితే అదే సమయంలో టీడీపీ గ్రాఫ్ కూడా ఏమంతా గొప్పగా పెరగడంలేదు. ఇటీవల వచ్చిన సర్వేలు అన్నీ కూడా టీడీపీ ఓట్ల షేర్ గతంతో పోలిస్తే మూడు శాతం మాత్రమే పెరిగాయని పేర్కొనడం విశేషం.

అదే సమయంలో సీనియర్లు చాలా మంది ఇంకా ఒడ్డునే ఉన్నారు. యువరక్తం అంటే తమ వారసులే అన్న క్లారిటీ వారికి ఇస్తేనే రంగంలోకి దూకుతారని అంటున్నారు. ఇక చంద్రబాబు వయసు రిత్యా ఏడు పదులు దాటి ఉన్నారు. ఆయన ఆరోగ్యం మీద సామర్ధ్యం మీద ఎవరికీ డౌట్లు లేకపోయినా తరువాత పార్టీ భారం మోసేవారు ఎవరు అన్నదే చర్చగా ఉంది.

దానికి సమాధానం దొరికే వరకూ టీడీపీలో కొత్త జోష్ ఆశించడం కూడా కష్టమే. ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేష్ బాబు గతంతో పోలిస్తే చాలా బెటర్ గానే ఉన్నారని అంటున్నారు. ఆయన తడబాట్లు కొంతవరకూ తగ్గాయి. కానీ రాజకీయం అంటే నిరంతర యాగం. అక్కడ ఉండాల్సింది వ్యూహాలు, ప్రతివ్యూహాలూ.

నోటి వెంట ఒక మాట వచ్చిందంటే దానికి ఎన్నో అర్ధాలు ఉండాలి. అలాగే ఆవేశంతో పాటు ఆలోచన ఉండాలి. ఈ విధంగా చూస్తే చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ లోకేష్ నుంచి ఆశించలేరు కానీ ఆయన ఈపాటికే బాబుకు ఎంతో కొంత చేదోడుగా ఉంటారని అంతా ఆశిస్తున్న మేరకు అందుకోలేకపోతున్నారు అన్నదే బాధగా ఉంది.

లోకేష్ తండ్రిని అనుసరిస్తూ రాజకీయం చేయడం కాదు, వర్తమాన రాజకీయాలను గమనిస్తూ తనను తాను తీర్చిదిద్దుకోవాల్సి ఉంది. ఈ రోజుకీ చంద్రబాబుకీ జై ఎన్టీయార్ కి జై అన్న నినాదాలే తప్ప లోకేష్ కి జై అన్న వారు పెద్దగా లేరు అంటేనే మూడవ తరం ఎంత వీకో అర్ధమవుతోంది. చంద్రబాబు నుంచి రాజకీయాన్ని వంటబట్టించుకోవడంతో పాటు దాన్ని ఈనాటి జనరేషన్ కి కనెక్ట్ అయ్యేలా లోకేష్ చూసుకోవాలి.

ఒక విధంగా లోకేష్ మీద ఇపుడు చాలా పెద్ద బాధ్యత ఉంది. ఒక వైపు టీడీపీకి ఆయన భావి వారసుడుగా ఫోకస్ కావాలి. అలాగే ఏపీలో బలమైన ఒక సామాజికవరం ఆశలను కూడా నెరవేర్చే దిశగా మార్కులు తెచ్చుకోవాలి. ఇక ఏపీలో రాజకీయం ఏకపక్షం కాకుండా ఉండాలంటే టీడీపీ పటిష్టంగా ఉండాలి.

అది ప్రజాస్వామ్యానికి కూడా మేలు చేకూర్చే విధానం. మరి ఆ విధంగా చూస్తే లోకేష్ అవసరం రాష్ట్రానికి కూడా ఉంది. అలా లోకేష్ వైపు చాలా కళ్ళు చూస్తున్నాయి. మరి చినబాబు వీటిని గమనంలోకి తీసుకుని మరింతంగా పట్టు సాధిస్తారా. తనను తాను దిద్దుకుంటూ పార్టీని ఫోర్ ఫ్రంట్ లో పెడతారా. చూడాలి.
Tags:    

Similar News