మెత‌గ్గా ఉండ‌టానికి పాత ఇండియా కాదు!

Update: 2019-02-26 07:32 GMT
నిర్ణ‌యాలు తీసుకోవ‌టానికి ద‌మ్ము ఉండాలి. అది త‌న ద‌గ్గ‌ర పుష్క‌లంగా ఉంద‌న్న విష‌యాన్ని భార‌త్ తాజాగా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చిన వేళ‌.. దాయాది పాక్ కు దిమ్మ తిరిగేలా షాకివ్వ‌టానికి మోడీ స‌ర్కారు సిద్ధంగా ఉండ‌టం.. ఇలాంటి అనుమ‌తి కోస‌మే చూస్తున్న ర‌క్ష‌ణ ద‌ళాలు.. త‌మ స‌త్తా చాటే ప‌ని చేస్తున్నాయి. పుల్వామాలో ఆర్మీ జ‌వాన్లు ప్ర‌యాణిస్తున్న వాహ‌నంపై ఆత్మాహుతి స‌భ్యుడితో దాడి చేయ‌టం ద్వారా 40 మంది వీర జ‌వాన్ల మ‌ర‌ణానికి కార‌ణ‌మైన జేషే ఏ మ‌హ్మ‌ద్ కు.. దాని వెనుక ఉన్న పాకిస్థాన్ కు దిమ్మ తిరిగే చ‌ర్య‌లు ఈ రోజు ఏక‌కాలంలో జ‌రిగాయి.

ముంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 3.30 గంట‌ల ప్రాంతంలో పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ లోని ఉగ్ర‌శిబిరాల‌పై భార‌త వాయు సేన‌కు చెందిన జెట్ ఫైట‌ర్స్ భారీ ఎత్తున బాంబులు కురిపించి.. ఉగ్ర‌వాద శిబిరాల్ని ధ్వంసం చేశారు. ఓప‌క్క దాడులు జ‌రుపుతూనే మ‌రోవైపు.. క‌శ్మీర్ వ్యాలీలో వేర్పాటు వాద నేత‌ల ఇళ్ల‌ల్లో సోదాలు నిర్వ‌హించారు.

ఇన్నాళ్లుగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్ని అడ్డుగా పెట్టుకొని డ‌బుల్ గేమ్ ఆడ‌తార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్న వేర్పాటు వాదుల‌కు దిమ్మ తిరిగేలా షాకిచ్చే  చ‌ర్య‌ను భార‌త స‌ర్కారు చేప‌ట్టింది. పాక్ పై భార‌త వైమానిక దాడితో పాటు.. క‌శ్మీర్ లోని వేర్పాటు వాదుల ఇళ్ల‌ల్లో ఎన్ ఐఏ.. సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు సోదాలు నిర్వ‌హించాయి. ఉగ్ర‌వాదానికి ఆర్థిక సాయాన్ని అందిస్తున్న‌ట్లుగా వీరిపై విచార‌ణ ప్రారంభించారు. మంగ‌ళ‌వారం చేప‌ట్టిన సోదాల్లో స్థానిక పోలీసులు కూడా భాగ‌స్వామ్యం కావ‌టం గ‌మ‌నార్హం.

దాదాపు తొమ్మిది వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వ‌హించిన భ‌ద్ర‌తా సిబ్బంది.. న‌యిం గిలానీ.. మిర్వాజ్ ఉమ‌ర్ ఫ‌రూఖ్.. స‌య్య‌ద్ అలీషా గిలానీ.. యాసిన్ మాలిక్.. శ‌బీర్ షా.. జాఫ‌ర్ భ‌ట్.. అప్ర‌ష్ సెహ్రాయ్ ఇళ్ల‌ల్లో సోదాలు నిర్వ‌హించారు. పాకిస్థాన్ నుంచి అక్ర‌మ ప‌ద్ద‌తుల్లో వీరికి నిధులు అందుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఒక‌వైపు నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద భారీ ఎత్తున వైమానిక దాడులు.. మ‌రోవైపు వేర్పాటు వాదుల ఇళ్ల‌ల్లో గ‌తంలో ఎన్న‌డూ లేనంతగా భారీ ఎత్తున సోదాలు నిర్వ‌హిస్తుండ‌టంతో వేర్పాటువాదుల‌కు ఏమీ అర్థం కాని ప‌రిస్థితి. మ‌రోవైపు.. ఊహించ‌ని రీతిలో రెండు ర‌కాలుగా ఎదురైన షాకుల‌తో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇలాంటి అనుభ‌వం ఇప్ప‌టివ‌ర‌కూ దాయాదికి ఎదురుకాలేద‌ని చెప్పాలి.

   

Tags:    

Similar News