కోడి కత్తి కేసు... విశాఖలో విచారణ

Update: 2019-01-14 06:49 GMT
కోడి కత్తి కేసు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపై దాడి చేసి కేసు. దాడి చేసిన నిందితుడు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస్ ను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ఐఎ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  రాష్ట్ర పోలీసులపైనా.... వారి చేసే దర్యాప్తుపైనా తనకు నమ్మకం లేదని ప్రతిపక్ష నాయకుడు ప్రకటించడంతో ఈ కేసును జాతీయ నేర పరిశోధనా విభాగానికి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిందితుడు శ్రీనివాస్ ను రెండు రోజుల క్రితం ఎన్ఐఎ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని విజయవాడకు తరలించారు. అయితే శ్రీనివాస్ ను తిరిగి విశాఖపట్నానికి తీసుకువచ్చిన ఎన్ ఐఎ అధికారులు ఆదివారం రాత్రి తమ కార్యాలయంలో రహస్యంగా విచారించినట్లు సమాచారం. శ్రీనివాస్ ను ఆయన లాయర్ సమక్షంలో దాదాపు మూడు గంటల  పాటు విచారించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సోమవారం నాడు శ్రీనివాస్ ను సంఘటన జరిగిన విశాఖపట్నం విమానాశ్రయానికి కూడా తీసుకువెళ్లి సంఘటన ఎలా జరిగింది వంటి వివరాలకు కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయని  అంటున్నారు.

విశాఖపట్నం విమానాశ్రమంలో విచారణ పూర్తి చేసిన తర్వాత నిందితుడు శ్రీనివాస్ ను హైదరాబాద్ కు కాని, మరో నగరానికి కాని తీసుకువెళ్లి రహస్యంగా విచారణ జరిపే అవకాశం ఉందంటున్నారు.  మరోవైపు ప్రతిపక్ష నాయకుడిపై జరిగిన దాడి ఆయనే చేయించుకున్నదని, దీని ద్వారా ప్రజల్లో సానుభూతి సంపాదించుకోవాలన్నది ఆయన ఉద్యేశ్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తనపై దాడి కేసును ఆంధ‌్రప్రదేశ్ పోలీసులు విచారించరాదని, వేరెవరైనా విచారించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ కేసును జనవరి 1 వ తేదిన జాతీయ నేర పరిశోధనా విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని అనుసరించే కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ ను జాతీయ నేర పరిశోధన విభాగం తమ అధీనంలోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. మరోవైపు ఈ కేసును ఎన్ఐఎకి బదలాయించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధికారాలను కేంద్రం అడ్డుకుంటోందని, ఈ కేసును ఎన్ఐఎకు బదలాయించడం తగదంటూ హైకోర్టుకు వెళ్తామంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ కేసును ఎన్ఐఎకి అప్పగించడంతోనే ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న సంబంధం బయటపడిందని చంద్రబాబు నాయుడు అన్నారు.
   

Tags:    

Similar News