జ‌గ‌న్ కేసులో మ‌లుపు - ఇక విచార‌ణ విజ‌య‌వాడ‌లో

Update: 2019-01-09 06:00 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత - వైసీపీ అధినేత జ‌గ‌న్ పై విశాఖ విమానాశ్ర‌యంలో చోటుచేసుకున్న దాడి రాష్ట్రవ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అది హ‌త్యాయ‌త్న‌మ‌ని వైసీపీ చెప్తుండ‌గా.. డ్రామా అని టీడీపీ వాదిస్తోంది. తాజాగా ఈ కేసు విచార‌ణ బాధ్య‌త‌ను నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ(ఎన్ ఐఏ)కి అప్ప‌గించారు. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తుండ‌గా మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది.

జ‌గ‌న్ పై దాడి కేసు విచార‌ణ తాజాగా విజ‌య‌వాడ‌కు బ‌దిలీ అయింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.  జ‌గ‌న్ కేసులో విచార‌ణ ప్రారంభించిన ఎన్ఐఏ అధికారులు విజయవాడలోని మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో మంగ‌ళ‌వారం పిటిషన్‌ దాఖలు చేశారు. సీఆర్‌ పీసీ సెక్షన్‌ 41 (డి) ప్రకారం నిందితుడు శ్రీ‌నివాస్ ను తమకు అప్పగించాలని కోరారు. స్థానిక పోలీసులు ఇప్పటివరకు చేపట్టిన విచారణకు సంబంధించిన అన్ని ఫైళ్ల‌ను తమకు అప్పగించాలని విన్న‌వించారు. విశాఖ పోలీసులు - ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు స‌రిగ్గా స్పందించ‌క‌పోవ‌డంతో ఇప్పటికే ఎన్‌ ఐఏ అధికారులు విజయవాడలోని ఎన్‌ ఐఏ ప్రత్యేక కోర్టులో ఒక పిటిషన్ వేసిన సంగ‌తి గ‌మ‌నార్హం.

జ‌గ‌న్ పై దాడి కేసు విచార‌ణ ఇప్ప‌టివ‌ర‌కు విశాఖపట్నంలోని 7వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో జ‌రిగింది. తాజాగా ఈ కేసు విచార‌ణ‌ను విజ‌య‌వాడ‌కు బ‌దిలీ చేస్తూ విజయవాడలోని ఎన్‌ ఐఏ ప్రత్యేక న్యాయస్థానం - మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఆదే శాలు జారీ చేశారు. సంబంధిత ఆదేశాలు విశాఖలోని కోర్టుకు మంగళవారం అందాయి. దీంతో ఇక‌ కేసు విచారణ విజయవాడలో జరుగనుంది.  ఒకట్రెండు రోజుల్లో జగన్‌ కేసుకు సంబంధించిన పత్రాలను విజయవాడ ఎన్‌ఐఏ కోర్టుకు పోలీసులు - సిట్ అధికారులు అప్పగించే అవకాశం ఉంది. మ‌రోవైపు - జగన్‌ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావును విశాఖ సెంట్రల్‌ జైలు నుంచి త్వ‌ర‌లో రాజమండ్రికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Full View

Tags:    

Similar News