భార‌త్‌ పై భార‌తీయ మూలాలున్న మ‌హిళ‌ ఫైర్‌

Update: 2017-06-05 14:13 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్థించేందుకు అగ్ర‌రాజ్యం అధికారులు తంటాలు ప‌డుతున్నారు. ప్ర‌పంచ దేశాల‌న్నింటినీ తీవ్రంగా ప్ర‌భావితం చేయ‌గ‌ల పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొల‌గినట్లు ప్ర‌క‌టించిన‌ ట్రంప్ తీరుపై ప‌లు దేశాలు మండిప‌డుతుండ‌గా...అమెరికా అధికారులు మాత్రం త‌మ అధ్య‌క్షుడు తీసుకున్న నిర్ణ‌యం స‌మ‌ర్థ‌నీయ‌మ‌ని పేర్కొంటున్నారు. పారిస్‌ ఒప్పందంపై అమెరికా ఏం చేయాలనే అంశంపై భారత్‌ - ఫ్రాన్స్‌ - చైనాలు తమకు సలహాలు ఇవ్వవలసిన అవసరం లేదని ఐక్య‌రాజ్య‌స‌మితిలో అమెరికా రాయబారి నిక్కి హేలీ అన్నారు.

అమెరికా ప్రజ‌ల ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగానే దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని నిక్కీ హేలీ అన్నారు. త‌మ దేశ ప‌రిస్థితులు, ప్రాధామ్యాలు, ల‌క్ష్యాల‌కు అనుగుణంగానే త‌మ అడుగులు ఉంటాయ‌న్నారు. పారిస్ ఒప్పందం విష‌యంలో గత కొన్ని వారాలుగా భిన్నాభిప్రాయాలను ట్రంప్‌ విన్నారు. అధ్యయనం చేశారు. అయితే దేశానికి లబ్ది చేకూర్చని పారిస్‌ ఒప్పందం నుంచి బయటకు రావడమే మంచిదన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలను గౌరవిస్తునే అమెరికా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించారు` అని  చెప్పారు. 1990ల నుంచే గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను తగ్గించేందుకు అమెరికా అనేక చర్యలను చేపడుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ ఈ విష‌యంలో చైనా, ఇండియా వంటి దేశాల స‌ల‌హాలు అవ‌స‌రం లేద‌న్నారు.

కాగా అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ భార‌తదేశం గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్‌ను త‌మ కీల‌క‌ భాగస్వామిగా అమెరికా గుర్తిస్తోందని తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్థిరత్వాన్ని సమర్థంగా నిర్వహిస్తున్న న్యూఢిల్లి కృషికి గుర్తింపుగా భారత్‌ను ముఖ్యమైన రక్షణ భాగస్వామిగా గుర్తిస్తున్నట్లు ఆయన వివ‌రించారు. ఆగ్నేయాసియా ప్రాంతంలో పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదం వల్ల కలిగే ముప్పు విషయంలో సముద్ర భద్రత, ఇతర సవాళ్లకు సంబంధించి అమెరికా నూతన మార్గాలను అన్వేషిస్తోందని మాటిస్‌ అన్నారు. ఈ సందర్భంగా హిందూ మహా సముద్ర ప్రాంతంలో ఎలాంటి అలజడులకు తావు లేకుండా భారత్‌ నిర్వహిస్తున్న పాత్రను ఆయన ప్రశంసించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News