విన్నంతనే విషాదం.. షాకిచ్చిన కామారెడ్డి ఘటన

Update: 2020-08-14 04:45 GMT
విషాదం గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? ఈ మీడియా వాళ్లకు పని లేదు. జనాల్ని అదే పనిగా భయపెడుతున్నారు లాంటి చవకబారు విమర్శలతోనే అసలు సమస్య. తీవ్రత ఉన్న విషయాలు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని కారణంగా కొంత భయాందోళనలు కలగొచ్చు. కానీ.. దాని కారణంగా కలిగే అవగాహన మేలే చేస్తుంది తప్పించి కీడు చేయదు. కరోనా వేళ.. నెగిటివ్ వార్తలంటూ వాస్తవాలు బయటకు రాకపోవటం.. పలు విషాదాలు అండర్ ప్లే కావటంతో.. చాలామంది నష్టపోతున్నారు. కరోనా బారిన పడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరి క్షేమం కోసం కొన్ని ఆందోళన కలిగించే అంశాల్ని తెలసుకోవటం.. చదవటం చాలా ముఖ్యం. ఇప్పుడు చెప్పేది అలాంటి ఉదంతమే. తెలంగాణలో కేసులు తగ్గిపోతున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నోళ్లు ఉంటున్నారు. ఒకప్పుడు పది కేసులు నమోదయ్యాయి అంటేనే హడలిపోయే స్థాయి నుంచి రెండు వేల కేసులు నమోదు అంటే.. ఏపీలో పది వేల కేసులతో పోలిస్తే.. మనం చాలా మెరుగ్గా ఉన్నామన్న భావన పెరుగుతోంది. ఇదేమాత్రం మంచిది కాదు.

కామారెడ్డి ఉదంతానికి వస్తే.. అక్కడ చోటు చేసుకున్న విషాదం గురించి తెలిసిన వెంటనే గుండెలు మెలిపెట్టినట్లుగా బాద కలుగుతుంది. చిన్నపాటి నిర్లక్ష్యం ఎలాంటి పరిస్థితికి కారణమవుతుందో ఈ ఉదంతం చెబుతుంది. పట్టణానికి చెందిన ఒక కుటుంబంలోని భార్య..భర్తలు ఇద్దరు వారం తేడాతో కరోనా కారణంగా మరణించారు. ఈ నెల ఏడున కరోనాతో భర్త చనిపోతే.. గురువారం భార్య మరణించింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో పాల్గొన్న తొమ్మిది మందికి కరోనా సోకటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. మృతుడి కుమారుడితో పాటు.. వారి తల్లిదండ్రులకు.. ఇతర సభ్యులకు పాజిటివ్ గా తేలింది. ఇలాంటి వేళ.. మరింత అప్రమత్తంగా ఉండాలి. కరోనాతో కుటుంబ సభ్యులు మరణిస్తే.. వదిలేయమని చెప్పట్లేదు. కానీ.. పక్కాజాగ్రత్తలు తీసుకొని వారి అంతిమసంస్కారాల్ని గౌరవప్రదంగా.. ఎలాంటి లోటు లేకుండా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుందన్నది మర్చిపోకూడదు.


Tags:    

Similar News