ఆ రాష్ట్రంలో న‌ర్సులు క‌నిపిస్తే వ‌ణికిపోతున్నార‌ట‌

Update: 2018-05-26 04:31 GMT
చావు భ‌యం త‌ప్పు కాదు. కానీ.. ప్రాణాల మీద‌కు వ‌స్తుంద‌న్న అనుమానంతో మాన‌వ‌త్వాన్ని మ‌రిచిపోయి వ్య‌వ‌హ‌రించ‌ట‌మే దుర్మార్గంగా చెప్పాలి. తాజాగా కేర‌ళ‌లో అలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. నిఫా గుబులు.. కేర‌ళ ప్ర‌జానీకాన్ని వ‌ణికిస్తోంది. అక్క‌డి ప్ర‌జ‌లు ఇప్పుడు న‌ర్సులు క‌నిపిస్తే చాలు.. ఆమ‌డ దూరానికి ప‌రుగులు తీయ‌టమే కాదు.. వారి ప‌ట్ల సామాజిక వెలిని ప్ర‌ద‌ర్శిస్తున్న వైనం ఇప్పుడు ఆందోళ‌న క‌లిగించేలా చేస్తోంది.

నివార‌ణ‌కు మందు లేని నిఫా వైర‌స్ కార‌ణంగా కేర‌ళ‌లో ఇప్ప‌టివ‌ర‌కూ 12 మంది మృతి చెంద‌టం తెలిసిందే. మృతుల్లో ఒక‌రు న‌ర్సు కూడా ఉన్నారు. వైర‌స్ బారిన ప‌డినోళ్ల‌కు చికిత్స చేసిన పాపానికి ఒక న‌ర్సు త‌న ప్రాణాల్ని కోల్పోయింది. విధి నిర్వ‌హ‌ణ‌లో చావు భ‌యం లేకుండా ప‌ని చేసినందుకు ఆమె అమ‌రుల‌య్యారు.

అయితే.. ఈ ఉదంతం కేర‌ళీయుల్లో న‌ర్సుల ప‌ట్ల‌ సానుకూల‌త పెర‌గాల్సింది పోయి.. ప్ర‌తికూల‌త పెర‌గ‌టం.. న‌ర్సులంటేనే ఆమ‌డ దూరానికి ప‌రుగులు తీస్తున్న వైనం షాకింగ్ గా మారింది.

నిఫా వైర‌స్ న‌ర్సుల ద్వారా త‌మ‌కు అంటుతుంద‌న్న భ‌యాందోళ‌న‌ల‌తో విప‌రీతాల‌కు తెర తీస్తున్నారు. న‌ర్సుల్ని బ‌స్సులు.. రైళ్ల‌ల్లో ప్ర‌యాణించేందుకు నో చెప్పేస్తున్నారు. అంతేనా.. చివ‌ర‌కు రిక్షాలో తీసుకెళ్ల‌టానికి సైతం ఒప్పుకోవ‌టం లేని దుర్మార్గ ప‌రిస్థితి నెల‌కొంది. ఆటోల్లోకి న‌ర్సుల్ని ఎక్కించుకోవ‌టానికి ఆటోవాలాలు నో అంటే నో అనేస్తున్నారు.

త‌మ వృత్తిలో భాగంగా అనారోగ్యానికి గుర‌య్యే వారు ఎవ‌రైనా స‌రే.. త‌మ సేవ‌ల‌తో వారికి స్వ‌స్థ‌త చేకూర్చేందుకు  న‌ర్సులు త‌మ శాయ‌శ‌క్తులా కృషి చేస్తుంటారు. త‌మ వృత్తిలో భాగంగా మ‌ర‌ణానికి సైతం సిద్ధ‌ప‌డే న‌ర్సులు చాలామంది ఉంటారు. మ‌రి.. అలాంటి వారిపై నిఫా మీద ఉన్న భ‌యంతో సామాజిక వెలి ప్ర‌ద‌ర్శించ‌టం ఎంత‌మాత్రం స‌రికాదు.  

కేర‌ళీయులు ఇప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారో.. అదే తీరులో న‌ర్సులు కూడా వ్య‌వ‌హ‌రిస్తే ప‌రిస్థితి ఎలా మారుతుందో ఊహించుకోవ‌టం కూడా క‌ష్ట‌మే అవుతుంది. త‌మ తోటి ప్ర‌జ‌ల మాదిరి కేర‌ళ న‌ర్సులు ఆలోచించి..  త‌మ విధుల‌కు దీర్ఘ‌కాలిక సెల‌వు పెడితే.. ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఎంత దారుణంగా మారుతుందో ఊహించ‌లేం కూడా. అలాంటిది.. ప్రాణాల్ని ప‌ణంగాపెట్టి మ‌రీ త‌మ వృత్తి నిర్వ‌హ‌ణ‌లో భాగ‌స్వామ్యం అవుతున్న న‌ర్సుల విష‌యంలో ప్ర‌జ‌లు మ‌రింత ద‌యార్థ్ర‌హృద‌యంతో వ్య‌వ‌హ‌రించాల్సి ఉంది.

 అందుకు భిన్నంగా న‌ర్సులు ద‌గ్గ‌ర‌కు వ‌స్తే దూరంగా వెళ్లిపోవ‌టం.. ప్ర‌జా ర‌వాణ‌కు వారిని అంగీక‌రించ‌క‌పోవ‌టం.. వారితో మాట్లాడేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌టం స‌రికాద‌ని చెప్పాలి. నిఫా భ‌యంతో న‌ర్సుల ప‌ట్ల అభ్యంత‌ర‌క‌ర రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న కేర‌ళీయులు.. నిఫా వైర‌స్ తో మ‌ర‌ణించిన వ్య‌క్తికి అంత్య‌క్రియ‌లు చేసేందుకు  శ‌శ్మాన సిబ్బంది నో చెప్ప‌టం గ‌మ‌నార్హం. దీంతో.. వారిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. నిఫా ఎక్క‌డ త‌మ‌కు అంటుతుంద‌న్న భ‌యంతో కేర‌ళ‌లోని ప‌లు ఆసుప‌త్రుల‌కు రోగులు వెళ్ల‌కుండా ఉంటున్న వైనం వెలుగులోకి వ‌చ్చింది. అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం మంచిదే కానీ.. ఆ పేరుతో అనాగ‌రికంగా వ్య‌వ‌హ‌రించ‌టం ఏ మాత్రం స‌రికాదన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. క‌ర్ణాట‌క‌లో ప‌ని చేస్తున్న కేర‌ళ న‌ర్సులు.. వైద్య విద్యార్థులనువారి రాష్ట్రాల‌కు రెండు నెల‌ల పాటు వెళ్ల‌కూడ‌నద‌ని సూచ‌న చేసింది. మ‌రోవైపు.. నిఫా వైర‌స్ ను ఎదుర్కోవ‌టం కోసం యాంటీ బాడీని ఆస్ట్రేలియా నుంచి తెప్పించేందుకు కేర‌ళ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టింది. త్వ‌ర‌లోనే 50 డోసుల మోనోక్లోన‌ల్ యాంటీబాడీ కేర‌ళ‌కు రానున్న‌ట్లుగా చెబుతున్నారు. క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు మ‌నిషిలోని మాన‌వ‌త్వం నిద్ర లేవాలే కానీ.. భ‌యానికి గురై  ఆందోళ‌న‌ల్ని మ‌రింత పెంచేలా ఎవ‌రూ వ్య‌వ‌హ‌రించ‌కూడ‌దు.  


Tags:    

Similar News