నలుగురు పిశాచాలకు ఉరి.. 2650 రోజులకు నిర్భయకు న్యాయం

Update: 2020-03-20 02:47 GMT
సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అత్యంత పాశవికంగా గ్యాంగ్ రేప్ నకు పాల్పడి.. అమానవీయ తీరులో హింసించిన కామ పిశాచాలకు ఎట్టకేలకు తీహార్ జైల్లో ఉరిశిక్షను విధించారు. నేరం జరిగిన 2650 రోజులకు న్యాయం లభించింది. దేశంలోని ప్రతి ఒక్కరు నలుగురు నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించటం తప్పనిసరని భావిస్తున్న వేళ.. న్యాయపరమైన చిక్కుముడులతో తమకు విధించిన శిక్ష అమలు కాకుండా ఉండేందుకు చివరిక్షణాల వరకూ ప్రయత్నిస్తున్నప్పటికీ.. అన్ని అడ్డంకులు.. అవరోధాల్ని అధిగమించి.. ఎట్టకేలకు న్యాయం గెలిచింది. ఈ తెల్లవారుజామున (శుక్రవారం) 5.30 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేసినట్లుగా తీహార్ జైలు అధికారులు ప్రకటించారు.

తీహార్ జైలు నెంబరు 3లో.. కోర్టు పేర్కొన్నట్లుగా నిర్భయ దోషులు నలుగురినీ ఉరి తీసినట్లుగా జైలు అధికారులు వెల్లడించారు. ఉరిశిక్ష అమలు చేసే సమయంలో మొత్తం పదిహేడు మంది సిబ్బంది అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. కదులుతున్న బస్సులో పారామెడికల్ విద్యార్థిని నిర్భయను అత్యంత అమానుషంగా గ్యాంగ్ రేప్ చేసిన ఉదంతంలో దోషులైన ముకేశ్ సింగ్ (32).. పవన్ గుప్తా (25).. వినయ్ శర్మ (26).. అక్షయ్ కుమార్ సింగ్ (31) లను తీహార్ జైల్లో ఉరి తీశారు. జిల్లా మెజిస్ట్రేట్ సమక్షంలో ఈ ఉరిని పూర్తి చేశారు.

ఉరిశిక్ష అమలుకు ఒక రోజు ముందు అంటే.. గురువారం కూడా కోర్టు తమకు విధించిన శిక్ష నుంచి తప్పించుకోవటానికి చేసిన ప్రయత్నాల్ని కోర్టు ఏకీభవించలేదు. తమకు విధించిన ఉరిశిక్షను అమలు చేస్తున్న పటియాలా హౌస్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. నలుగురు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి ఎదురుదెబ్బ తగిలింది. పటియాలా హౌస్ కోర్టు తీర్పును సమర్థిస్తూ జస్టిస్ మన్మోహన్.. జస్టిస్ సంజీవ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో తీర్పును వెల్లడించారు.

గతంలో కోర్టు విధించిన ఉరిశిక్షను యథాతథంగా అమలు చేయాలని తేల్చి చెప్పారు. దీంతో.. నిర్భయ దోషులు అర్థరాత్రి దాటిన తర్వాత కూడా మళ్లీ సుప్రీం తలుపు తట్టారు. ఉరిశిక్ష అమలు కాకుండా స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో కూడా విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ భానుమతి.. జస్టిస్ అశోక్ భూషణ్.. జస్టిస్ బోపన్నలతో కూడి ధర్మాసనం సదరు స్టే పిటిషన్ ను కొట్టి వేసింది.

గతంలో కోర్టు ఇచ్చిన రీతిలో ఉరిని యథాతధంగా అమలు చేయాలని తీర్పు ఇవ్వటంతో.. ఈ రోజు తెల్లవారుజామున వారికి ఉరిశిక్షను అమలు చేశారు. ఉరి తీయటానికి ముందు నలుగురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్యం బాగుందని వైద్యులు వెల్లడించారు. దీంతో వారికి ఉరిశిక్ష అమలు చేశారు. ఇదిలా ఉండగా.. శిక్ష అమలు సమయంలో తీహార్ జైలు బయట పెద్ద సంఖ్యలు ప్రజలు గుమిగూడి ఉండటం గమనార్హం.  దక్షిణాసియాలో అతి పెద్దదైన తీహార్ జైల్లో అత్యంత దారుణమైన నేరానికి పాల్పడిన నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్షను అమలు చేశారు. ఈ విధంగా ఒక కేసుకు సంబంధించి దోషులందరికి ఒకేసారి ఉరిశిక్షను అమలు చేయటం ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. 
Tags:    

Similar News